సీమపై వివక్ష

సీమ కన్నీటి ధారల ‘పెన్నేటి పాట’

ఎట్టకేలకు తెలంగాణ గొడవకు తెరదించే పనికి కాంగ్రెస్ పూనుకుంది. ఇది ఆ ప్రాంత ప్రజా పోరాట ఫలం. వారికి ధన్యవాదాలు!

కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సీమకు కృష్ణా నికరజలాల కేటాయింపు హామీ ఏమైంది?

ఈ సందర్భంలో విడిపోయే రాష్ట్రంలో సీమ వాసులు కలిసుంటే మిగిలేది మట్టే. రాయలసీమ అస్తిత్వం కొనసాగాలన్న ఇక్కడ సాగు, తాగు నీరు కావాలన్న ప్రత్యేక రాయలసీమే శరణ్యం. దీనికోసం పాలకులు, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సిన తరుణమిది.

రాయలసీమ ఎలా వంచనకు గురైంది తెలిపే ఈ వ్యాసాన్ని పునః ప్రచురిస్తున్నాం…

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో 1969లో తెలంగాణ, 1972లో కోస్తాంధ్ర ఉద్యమించాయి. కానీ వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకు రాయలసీమ ప్రాంతంలో 1983లో సాగునీటి ఉద్యమం జరిగింది. వెనుకబాటుకు గురైన రాయలసీమ ప్రాంతంతో పాటు కోస్తాంధ్రలోని ప్రకాశం జిల్లా, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీమ ఉద్యమం కోరుకుంది. ఒకటి వాస్తవం. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు వెనుకబాటుతనమే ప్రాతిపదిక అయితే లేదా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రాలే ప్రమాణమయితే మొదట ఉద్యమ బాట పట్టవలసినది రాయలసీమే.

పెన్నానది
పెన్నానది

1956 నాటి విద్వాన్‌ విశ్వం ‘పెన్నేటిపాట’లోని జీవితం కంటే సీమ జీవితం ఇపుడు మరింత కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ప్రజలు ప్రభుత్వాలతో పోరాడడం లేదు. ప్రకృతితో చేసే పోరాటంలోనే వారి జీవితం గడచిపోతున్నది. తూర్పు కనుమలకు, పడమర కనుమలకు మధ్య ఎత్తైన పీఠభూమిగా రాయలసీమ ఉండటంతో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీమను కరుణించడం లేదు. రాష్ట్రం మొత్తం వర్షపాతం సగటు 850 మి.మీ. కానీ సీమలో సగటు వర్షపాతం 550 మి.మీ. అదీ సంవత్సరంలో 30 రోజులు మాత్రమే, అదనుతప్పి కురుస్తుంది. గడిచిన వంద సంవత్సరాలలో అరవై సంవత్సరాలపాటు కరువుల పాలైనందునే, నిరంతర క్షామపీడిత ప్రాంతంగా సీమను ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాయి. రాబోయే వందేళ్ల రాయలసీమలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎడారిగా మారుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.

రాయలసీమలో పెన్నా, తుంగభద్ర, కృష్ణా వంటి నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి సాగుకు యోగ్యమైన భూమిలో 10 శాతానికి కూడా నికరజలాలు అందవు. అదే కోస్తాంధ్రలో సాగుకు యోగ్యమైన భూమిలో 80 శాతం నికరజలాలు అందుతున్నాయి. సీమలో వేలమంది రైతులు, చేతివృత్తులవారు, విద్యార్థుల ఆత్మహత్యలు దీని ఫలితమే. ఒక్క అనంతపురం జిల్లాలో 2001-2005 సంవత్సరాల మధ్య 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వలసలు సరేసరి. ఖనిజ సంపద ఉన్నా ఒక్క భారీ పరిశ్రమ కూడా ఈ ప్రాంతానికి రాలేదు. ఇంతకంటే దారుణమైన పరిస్థితులున్న ప్రాంతాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి.కానీ నూతన సాంకేతిక పద్ధతులలో అవి అభివృద్ధి సాధించాయి. రాయలసీమ దుస్థితికి ప్రకృతి పాత్ర ఎంత ఉందో, అంతకుమించి ఈ ప్రాంతపు ఏలికల పాత్ర కూడా ఉంది.

చదవండి :  మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రాయల సీమను క్రీ.శ. 1336 నుండి హంపీ విజయనగర రాజులు పాలించారు. వీరి కాలంలో సుస్థిరత నెల కొంది. నదులపై ఆనకట్టలు, కాలువలు, చెరువులు నిర్మించారు. 1800 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన దత్త మండలాల ప్రథమ కలెక్టర్‌ థామస్‌ మన్రో “ఈ ప్రాంతంలో కొత్త చెరువులు కట్టాలని ప్రయత్నించటం వ్యర్థం. అనువైన ప్రతి స్థలంలోను పూర్వం చెరువు కట్టారు’ అని అన్నాడు. అయితే విజయనగర పాలకుల తరువాత సీమకు చెడ్డరోజులు దాపురించాయి.

నిజాం, కంపెనీల నిర్వాకం

రాకాసి తంగడి యుద్ధం లేదా తళ్లికోట యుద్ధం తో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. రాయలసీమపై దక్కన్‌ సుల్తానులు(గోల్కొండ, బీజాపూర్‌, అహమ్మద్‌నగర్‌, బీదర్‌) క్రీ.శ. 1564-1565లో దండయాత్రలు చేశారు. సుల్తాన్‌ల సేనలు విజయనగరంపైన, రాయలసీమ పైన స్వైరవిహారం చేశాయి. సీమలో ఉండే స్థానిక పాలెగాళ్లు దండయాత్రలు చేసే రాజులకు అడుగులకు మడుగులొత్తుతూ, కప్పాలు చెల్లిస్తూ కాలం వెళ్లబుచ్చారు. 17, 18 శతాబ్దాలలో రాయలసీమ అతలాకుతలం అయింది. మొగల్‌ చక్రవర్తి ఆజ్ఞమేరకు బీజాపూర్‌, గోల్కొండ సుల్తాన్‌లు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించారు. శివాజీ, ఔరంగజేబు, హైదరాలీ, టిప్పు సుల్తాన్‌ల ఆధిపత్యం కూడా ఈ ప్రాంతం మీద కనిపిస్తుంది. గోల్కొండ సుల్తాన్‌ సేనాపతి, మీర్‌ జుమ్లా, ఆర్థిక మంత్రి మీర్‌ మహమ్మద్‌ సయీద్‌ రాయలసీమను ఆక్రమించారు.

అయితే నిజాం మహారాష్ట్రలతో కలిసే అవకాశం ఉందని గ్రహించిన ఈస్టిండియా కంపెనీ నిజాంతో 12.10.1800లో అంగీకారానికి వచ్చి సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు నిజాం కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి ప్రాంతాలను బ్రిటిష్‌ వారికి దత్తం చేశాడు. అందుకే ‘దత్తమండలాలు’ అన్న పేరు వచ్చింది. బ్రిటిష్‌-నిజాం రాజ్యాల పరస్పర అవసరాల కోసం రాయలసీమ అంగడి సరుకుగా మారటం ఈ ప్రాంత దయనీయ దుస్థితిని తెలియచేస్తుంది. ఆ సంవత్సరంలోనే కంపెనీ పాలన ఆరంభమై దత్తమండలాల కలెక్టర్‌గా థామస్‌మన్రో వచ్చారు. పాలెగాళ్లను అణచివేసి సీమలో శాంతిభద్రతలు నెలకొల్పాడు.

బ్రిటిష్‌ పాలకులకూ బరువే

కంపెనీ మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి కొన్ని పనులు చేశారు. కోస్తాంధ్రలో 1852లో గోదావరి నదిపైన,1857లో కృష్ణానదిపైన, 1869లో పెన్నా నదిపైన(నెల్లూరు) ఆనకట్టలు కట్టి సాగునీటి సౌకర్యం కల్పించారు. రాయలసీమను మాత్రం నిర్లక్ష్యం చేశారు. చిన్న నీటి వనరులకు సరైన మరమ్మతులు కూడా జరగలేదు. రాయలసీమ 1803,1823, 1832, 1838, 1853, 1865, 1876, 1891, 1896లలో తీవ్రమైన కరువులకు లోనైంది. అంటే పందొమ్మిదో శతాబ్దం అంతా కరువులే. సీమ ప్రజలలో పెల్లుబుకుతున్న అసంతృప్తిని గ్రహించి ఆంగ్ల పాలకులు 1870లో కర్నూలు-కడప కాలువను తుంగభద్ర నదిపై సుంకేసుల నుంచి ప్రారంభించారు. 1882 సంవత్సరానికి పూర్తి చేశారు. కానీ ఈ కాలువ ప్రధానంగా రవాణాకు ఉద్దేశించినది. వ్యవసాయానికి ఉపయోగపడింది కొంతమేరకే.

చదవండి :  ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

‘పెద్ద మనుషుల’తో మొండిచేయి

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 1913లో ఆంధ్రమహాసభ ఉద్యమం ప్రారంభించింది. అయితే ఇది భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగానే నడిచింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాయలసీమ నాయకులకు ఆనాడే అనుమానాలుండేవి. పప్పూరి రామాచార్యులు, గుత్తి కేశవపిళ్లై, టీఎన్‌ రామకృష్ణారెడ్డి, కడప కోటిరెడ్డి వంటి నాయకులు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా లేదా మద్రాసులో భాగంగా ఉంచ డమే మంచిదని భావించారు. కానీ కోస్తాంధ్ర నాయకులు అనునయించారు. 6.11. 1937న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి నివాసమైన ‘శ్రీబాగ్‌’ భవనంలో రాయలసీమ, కోస్తాంధ్ర నాయకుల మధ్య ‘పెద్దమనుషుల ఒప్పం దం’ జరిగింది.

ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టులలో- ఏది కోరుకుంటే అది- ఏర్పాటు చేయడం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయడం, పెన్నా, తుంగభద్ర, కృష్ణా నదీ జలాలలో మొదట రాయలసీమ వారికి ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతోనే సీమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నారు.

1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ఆధ్వర్యంలో కృష్ణా- పెన్నార్‌ ప్రాజెక్ట్‌ రూపొందింది. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కూడా వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా ప్రయోజనం ఉండేది.

తమిళనాడుకు ఆంధ్ర జలాలలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కోస్తాంధ్ర నాయకులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలుగు ప్రజలకు ఉపయోగపడుతుందని, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం చేస్తామని కోస్తాం ధ్ర నాయకులు బాసలు పలికారు.

1.10.1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కృష్ణా- పెన్నార్‌ ప్రాజెక్ట్‌ను రాయలసీమ అవసరాలు తీర్చేవిధంగా సిద్ధేశ్వరం వద్ద నిర్మించాలని రాయలసీమ వాసులు కోరారు.

సీమవాసులకు చుక్క నీరు అందని విధంగా 1954లో రాయలసీమకు దిగువ భాగాన ‘నాగార్జునసాగర్‌’గా నిర్మించారు. 23 లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. రాయలసీమకు మొండిచెయ్యి మిగిలింది.

బహుళార్థ సాధక ప్రాజెక్టుగా, రాయలసీమ అవసరాలు తీర్చాల్సిన శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుత్‌ ప్రాజెక్టుగా నిర్మించారు. అందులో సీమకు చుక్కనీరు నికరజలం లేదు. ఈ ప్రాజెక్టు కోసం ముంపునకు గురైంది రాయలసీమ గ్రామాలు. ఇది అన్యాయం కాదా?

1945లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, నిజాం ప్రభుత్వం కలసి బళ్లారి జిల్లా హోస్పేట్‌ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు కట్టేందుకు సిద్ధమయ్యాయి. రాయలసీమ అవసరాలు తీర్చే మెకంజి పథకం(1901లో 36 లక్షల ఎకరాల సాగుకు ఈ పథకం రూపొందించారు. ఇందుకు గండికోట వద్ద ప్రాజెక్టు కట్టాలి. కానీ ప్రపంచ యుద్ధాల కారణంగా కార్యరూపం దాల్చలేదు. కానీ వైఎస్‌ శ్రీశైలం కుడికాలువ పొడిగింపులో భాగంగా 60 టీఎంసీల సామర్థ్యంతో గండికోట ప్రాజెక్టును చేపట్టారు.) స్థానంలో దీనిని తుమ్మలూరు వద్ద 300 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలి. కానీ అలా జరగలేదు. రాయలసీమకు దూరంగా 213 టీఎంసీల సామర్థ్యంతో 1956లో పూర్తి చేశారు.

చదవండి :  ప్రొద్దుటూరు కోడెద్దులు రంకేసి బండ లాగితే...

తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుండి 100 టీఎంసీలు రాయలసీమకు అందాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని నాయకులు తుంగభద్ర ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వాటా 65 శాతం, జలాల వాటా 35 శాతానికి ఒప్పుకుని రాయలసీమకు తీరని ద్రోహం తలపెట్టారు.

ఈ కారణంగా కేవలం 60 టీఎంసీలు మాత్రమే రాయలసీమకు లభిం చాయి. ఆంధ్రప్రదేశ్‌ అవసరాల కోసం కరువు సీమ అనే కనికరం కూడా లేకుండా రాయలసీమను ‘బలిపశువు’గా వాడుకోవడం ఏ రకంగా సమంజసం?

1.11.1956న విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. రాయలసీమలో ఉండే రాజధాని నగరం కర్నూలు నుండి హైదారాబాద్‌కు మారింది. విశాలాంధ్ర కోసం రాయలసీమ రాజధాని నగరాన్ని కోల్పోయింది.

1983లో తెలుగుగంగ పేరుతో కృష్ణా జలాలను రాయలసీమకు 2 లక్షల ఎకరాలకు పరిమితం చేసి, నెల్లూరు జిల్లాకు 4 లక్షల ఎకరాలు, మద్రాసుకు తాగునీటికై పథకం సిద్ధం చేశారు. శిశువుకు దక్కని స్తన్యంలా నిరంతరం క్షామపీడిత ప్రాంతాలైన రాయలసీమకు దక్కకుండా ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్లే మోసపూరిత విధానాన్ని సీమ ఉద్యమ నాయకులు ఎలుగెత్తి చాటారు. ప్రభుత్వంలో కదలికవచ్చి సీమలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ఇప్పటికి నిర్మాణాలు జరగక మొండి శిలాఫలకాలు దర్శనమిస్తాయి.

సమైక్యతే వైఎస్‌ స్వప్నం

గోదావరి నదిలో 1,495 టీఎంసీలు, కృష్ణా నదిలో 811 టీఎంసీలు, ఇతర నదుల ద్వారా 98 టీఎంసీల నికర జలాలు ఆంధ్రప్రదేశ్‌కు అందుతు న్నాయి. 1,440 టీఎంసీల భూగర్భ జలాలున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో సాలీనా ప్రవహించే వరదనీరు వేల టీఎంసీల్లో ఉంటుంది. ఇంత పెద్దమొత్తంలో లభిస్తున్న నీటిలో రాయలసీమ ప్రాంతానికి దక్కుతున్న నికర జలాలు కేవలం 122 టీఎంసీలు మాత్రమే. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు కనీసం 300 టీఎంసీల నీరు కావాల్సి ఉంది.

ఇన్ని రంగాలలో వెనుకబాటుతనం నిరంతర క్షామ పరిస్థితుల్లో జీవనం నెట్టుకొస్తున్నారు. కారణం ఒక్కటే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనీ, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలుగన్న జలయజ్ఞం ఫలించి వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధిలోకి రావాలనీ వారు ఆకాంక్షిస్త్తున్నారు. ఈ లక్ష్యసాధన తెలుగు ప్రజలు సమైక్యంగా ఉంటేనే జరుగుతుందన్న విశ్వాసంతో సీమప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు.

– అప్పిరెడ్డి హరినాథరెడ్డి,

సాక్షి దినపత్రిక, సంపాదకీయ పుట వ్యాసం. ( 13 జనవరి 2010 )

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: