
పెన్నేటి గట్టున ఉన్న పుష్పగిరి చెన్నకేశవుని ఆలయం
గో’దారి’ సరే.. పెన్నా పుష్కరాల ఊసెత్తరేం?
దేశంలోని అన్ని నదులకూ 12 యేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తే.. పెన్నానదికి ప్రతియేటా ఫాల్గుణ మాసం లో పున్నమి రోజున ఒకరోజు పుష్కరాలు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి శ్రీ సొట్టు సాంబమూర్తి వెల్లడించారు.
రాష్ట్రంలొ గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల తర్వాత అతి పెద్దనదిగా పెన్నానది గుర్తించబడింది. కర్నాటకలోని నంది కొండల్లో పుట్టి రాష్ట్రంలోని అనంతపురం, కడప, నెల్లురు జిల్లాలలో దాదాపు 597 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో అనేక ఉపనదులు వచ్చి పెన్నానదిలో కలుస్తాయి. జయమంగళ, చిత్రావతి, పాపాఘ్ని, కుందూ, సగిలేరు, చెయ్యేరు(బహుదా), బొగ్గేరు లాంటి ఉపనదులతో పాటు వందలాది వాగులూ, వంకలూ, సెలయేర్లూ పెన్నానదిలో సంగమిస్తున్నాయి. పెన్నానదీ పరివాహక ప్రాంతం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా వ్యాపించించి ఉంది. ఈ పరివాహక ప్రాంతానికి తనదైన చరిత్ర, సంస్కృతులు ఉన్నాయి.597 కిలో మేటర్ల నదీతీరం పొడవునా అనేక అధ్యాత్మిక,చారిత్రక ప్రదేశాలున్నాయి.
మొదటినుండి మన రాష్ట్రాన్ని పాలించిన మనప్రభుత్వాలు తమ దృష్టినంతా గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలపైన్నే నిలిపాయి కానీ రాయలసీమ జీవనాడి అయిన పెన్నా గురించి ఆలోచించిన పాపాన పోలేదు. రాయలసీమలో ఒక్క తుంగభద్ర పుష్కరాలను మాత్రం తూతూమంత్రంగా ముగించి చేతులు దులిపేసుకోవడం మనకు తెలిసిందే!
వచ్చే ఏడాది రానున్న గోదావరి నదీ పుష్కరాలకు అప్పుడే సన్నాహాలను ప్రారంభించి ఎన్ని వందల కోట్ల డబ్బును ఎలా ఖర్చు చేయాలనే ప్రణాళికలను రచిస్తున్న ప్రభుత్వం ఏడాదికి ఓరోజు మాత్రమే వచ్చే పెన్నానది పుష్కరాలను నిర్వహించే విషయమై దృష్టి సారించాలి. పెన్నానదికి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాదినుంచే ప్రణాళికను తయారుచేసి అవసరమైన నిధులను కేటాయించాలి.