పట్టిసీమ మనకోసమేనా? : 2

కడప జిల్లా లేదా సీమ సమస్యలపైన ఎవరేనా అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్ళాలంటే వీళ్ళకు భయం. సదరు విషయం మరుసటి రోజు పత్రికలలో వచ్చీ,  విషయం అధినేత దృష్టికి వెళితే మైలేజీ తగ్గిపోతుందని వీరి బెంగ కావచ్చు. ఇలా మైలేజీ తగ్గటం చాత దక్కవలసిన నామినేటేడ్ పదవులు కూడా దూరమవుతాయని భయం కూడా ఉండొచ్చు.

ఇన్ని విషయాలలో నిశ్శబ్దంగా ఉన్న కడప జిల్లా తెదేపా నేతలు ఒకేసారి పులివెందుల వీధుల్లోకి వెళ్లి పట్టిసీమ పేరుతో రాయలసీమకు బాబు నీళ్ళు తెస్తాడని చెబితే ఎలా నమ్మాలి? పోనీ బాబు గారిని చూసి నమ్మమంటారా? లేక నీటి పారుదల శాఖామాత్యులు దేవినేని ఉమా గారు కాబట్టి  నమ్మాల్నా?

ఎలా నమ్మాలి?

చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి.

1996లో బాబు గారి తెదేపా ప్రభుత్వ హయాంలో కృష్ణా డెల్టాకు మూడో పంటకు నీళ్ళు సరిపోవని విద్యుత్ పేరు చెప్పి జీవో నెంబరు 69 తీసుకొచ్చి శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని సడలించినారు. ఈ జీవో నెంబరు 69ని రద్దు చేయాలని కోరుతూ కడప కర్నూలు జిల్లాలలోని రైతాంగం 1996 నుండి 2004 వరకు పలు మార్లు చంద్రాబాబును అభ్యర్తించారు. కరువు కోరల్లో చిక్కుకొని తాగునీటికీ ఇబ్బంది  పడుతున్న సమయంలో రైతులు పలుమార్లు జాతీయ రహదారులను సైతం దిగ్బందించారు. ఇవేవీ బాబు గారి మనస్సును కరిగించలేకపోయాయి. ఫలితంగా సీమలో అంతో ఇంతో సాగునీటితో పచ్చగా కనిపించే కే.సి కెనాల్ ఆయకట్టు సైతం ఆరు తడి పంటల సాగుకు కూడా నోచుకోలేక అల్లాడిపోయింది.

1996 నుండి 2004  వరకు గాలేరు నగరి సాగునీటి పథకంలో భాగమైన వివిధ జలాశయాలకు పలుమార్లు శంకుస్థాపన చేసిన బాబు గారు సదరు సాగునీటి పథకం పూర్తి చేయటానికి ఇచ్చింది కేవలం 19 కోట్ల రూపాయలు. సదరు సమయంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి బాబు గారు ఇచ్చింది కేవలం 13  కోట్ల రూపాయలు మాత్రమే.

చదవండి :  హుషారెత్తిస్తున్న రాయలసీమ పాట

రాయలసీమ జిల్లాలలో మిగులు లేదా వరద జలాలపై ఆధారపడి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరందించేందుకు గాను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సైజును పెంచేదానికి వైఎస్ పూనుకుంటే తెదేపా వాళ్ళు చేసిన రభస అంతా ఇంతా కాదు. ఓ పక్క నాగం, రేవంత్ మరో పక్క దేవినేని ఉమ, కోడెల – ముందు మీడియా దగ్గర – ఆ తర్వాత అఖిలపక్షంలో – ఆనక శాసనసభలో చేసిన గోల అంతా ఇంతా కాదు.

మొన్నటికి మొన్న గండికోట జలాశయానికి వచ్చి అక్కడ సభ పెట్టిన ముఖ్యమంత్రి గారు, జులైలో గండికోటలో 35  టి.ఎం.సిల నీళ్ళు నింపుతానాన్న ముఖ్యమంత్రి గారు, నెల తిరక్కుండానే గండికోటలో నీళ్ళు నింపే దానికి అడ్డంగా ఉన్న పనులు పూర్తి చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించకుండా బడ్జెట్లో తూచ్ అనేశారు.

రాయలసీమ సాగునీటి పథకాల విషయంలో మొదటి నుంచీ ఇటువంటి వైఖరితో ఉన్న ముఖ్యమంత్రిగారు ‘పట్టిసీమ’ నీళ్ళు తెచ్చి మన నెత్తిన పోస్తారంటే ఎలా నమ్మాలి? పోనీ నమ్మేదానికి అధికారిక ఉత్తర్వులలో రాశారా? లేదే. అధికారికంగా రాయలసీమకు దక్కిన నికర జలాలనే తూతూ మంత్రంగా విడుదల చేస్తూ… కరెంటు పేర రెండు రాష్ట్ర  ప్రభుత్వాలు కూడబలుక్కుని నీటిని సముద్రం పాలు చేస్తూ సీమను ఎండబెడుతున్నాయే! అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నోటి మాటను మనం నమ్మొచ్చా?

మక్కువ అంతా ఆ రెండు జిల్లాల పైనే

మూడో దఫా ముఖ్యమంత్రి అయినాక రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన బాబు గారి ప్రభుత్వం సీమ ప్రాజెక్టులన్నిటికీ కేటాయించిన మొత్తం 1000 కోట్ల రూపాయలను మించదు. ఒక్క నాగార్జున సాగర్ ఆధునీకరణకు 2015 బడ్జెట్లో కేటాయించిన సొమ్మే 850 కోట్ల రూపాయలు.సొంత జిల్లాకు నీరందించే ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వలేని బాబు గారు సకల సాగునీటి సౌకర్యాలు పుష్కలంగా కలిగి ఉన్న డెల్టా ఆధునీకరణకు దండిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు.

చదవండి :  "నారాయణ" లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

వీటన్నిటి వల్లా తేలేది ఏమంటే బాబు గారి మక్కువ అంతా ఆ రెండు మూడు జిల్లాల కృష్ణా డెల్టా పైనే. అంచేతనే రాజధానికి కూడా ఆ ప్రాంతాన్నే ఎంచుకున్నారు – రాయలసీమలో శాంతిభద్రతల సమస్య అనే అబద్దం చెప్పి.

‘పట్టిసీమ’ రాయలసీమ కోసమే అయితే ఇక అప్పట్లో పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేసిన ఇప్పటి నీటి పారుదల శాఖామంత్రిగారు కానీ, బాబు గారు కానీ దాన్ని ఇంత ప్రాధమ్యంగా తీసుకునేవారు కాదు అనేది గత చరిత్రను ఎరిగిన  ఎవరైనా ఇట్టే చెప్పెయ్యగలరు.

సింగపూరు వారి మనసెరిగి….పట్టి సీమ నీళ్ళు చేరేది రాజధానికే!

ఇప్పుడు బాబు గారి ప్రభుత్వం చెబుతున్న పట్టి సీమ నీళ్ళు నేరుగా చేరేది కృష్ణా డెల్టా ఆయకట్టుకే. అక్కడి నుండి ఈ నీటిని రాజధాని ప్రాంతానికి, అక్కడ వెలిసే బహుళజాతి సంస్థలకూ, పరిశ్రమలకూ కేటాయించేందుకే కాబట్టి ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది – అదీ సరిగ్గా సింగపూరు ప్రయాణానికి వెళ్ళే రోజునే ఈ పథకానికి శంకుస్థాపన చేసి. సహజంగానే ఈ విషయం రాజధానిని కట్టి అక్కడ భూమిని తీసుకునే సింగపూరు వారికి ఆనందం కలిగిస్తుంది. అలా బాబు గారు సింగపూరు వారి మనసెరిగి ప్రవర్తిస్తున్నారు.

కృష్ణా డెల్టాకు నికర జలాల కేటాయింపులు ఉండగా గోదారి నీళ్ళు రాజధానికి ఎందుకు అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజధాని పేర ప్రభుత్వం సృష్టిస్తున్న ఇబ్బందుల కారణంగా ఇప్పటికే అక్కడి రైతాంగం ప్రభుత్వం మీద గుర్రుగా ఉంది. ఇప్పుడు రాజధానికి కృష్ణా జలాలను వాడితే స్థానికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. లేదంటే తన ప్రాబల్యం బాగా ఉన్న ప్రాంతంలో వ్యవసాయానికి నీళ్లకు ఇబ్బంది వస్తుంది. ఈ యవ్వారంలో ఎక్కడా ఇబ్బంది కలుగకుండా అటు రాజధాని వర్గాలను (బహుళజాతి కంపెనీలు) ఇటు డెల్టా రైతాంగాన్ని  సంతోషపరిచేందుకు ‘పట్టిసీమ’ను ఆఘమేఘాల మీద బాబు గారు నెత్తికెత్తుకున్నారు – పోలవరం నిర్మాణంలో ఉండగానే.

చదవండి :  గణిత బ్రహ్మతో నా పరిచయం

సీమ రైతు ‘శవయాత్ర’కు సన్నాహక శిబిరాలు

గోదారి జలాలు రాజధానికి తీసుకుపోతుంటే అటు రాయలసీమలోనూ, ఇటు గోదావరి జిల్లాలోనూ ఆందోళన తలెత్తే అవకాశం ఉందని గుర్తించి తెలివిగా ‘రాయలసీమ’ను ముందుకు తెచ్చారు. ఈ విషయంలో విపక్షం అభ్యంతరాలు లేవనెత్తేసరికి తెలుగు మీడియా, మేధావులూ, తెలుగు తమ్ముళ్ళూ కథనాలూ, వ్యాసాలూ, ప్రదర్శనలతో రాయలసీమను హోరెత్తిస్తున్నారు. ఇలాటి వాదాలు విని కృష్ణా పెన్నార్ పథకాన్ని, రాజధానిని, సాగునీళ్ళనూ, ఉపాధినీ కోల్పోయిన తరం వారసులు కొందరు ఉచ్చులో చిక్కుకుని ఇప్పుడు విశాల ప్రయోజనాల వల్లె వేస్తుంటే, మళ్ళీ మన ప్రతిబింబం మనలను వెక్కిరిస్తున్నట్లుగా ఉంది.

రేపు ‘పట్టిసీమ’ పూర్తయినాక సాగర్ నుంచి లేదా ప్రకాశం బేరేజీ నుంచి రాజధాని కోసం నీళ్ళు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇస్తే అప్పుడూ ఈ తెలుగు మీడియా, తెలుగు మేధావులూ, తెలుగు తమ్ముళ్ళూ అడుగుతారా? – రాయలసీమకు ఇవ్వకుండా రాజధానికి ఇస్తున్నారు ఏమిటీ అనీ?

అప్పట్లో పోతిరెడ్డిపాడును వెడల్పు చేస్తేనే సహించలేని తెలుగు మీడియా, తెలుగు మేధావులూ, తెలుగు దేశం పార్టీ ఇవాళ రాయలసీమ కోసమే అధిక సొమ్మును వెచ్చించీ, నిబంధనలను తోసిరాజనీ చేపట్టిన ‘పట్టిసీమ’ను నెత్తిన పెట్టుకున్నాయంటే అర్థం కావడం లేదూ…దగా పడిన సీమ రైతును మరోసారి ఆశల పల్లకీలోకి ఎక్కించి పాడె మీదకు ఎక్కించబోతున్నారని!

ఇప్పుడు ‘పట్టిసీమ’ పేర సీమ నేతలు జరుపుతున్న ప్రదర్శనలూ, యాత్రలూ అన్నీ రేపటి సీమ రైతు ‘శవయాత్ర’కు సన్నాహక శిబిరాలుగా నాకు తోస్తున్నాయి!

(అయిపోయింది)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: