నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక
పులివెందుల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నేడు ఇడుపులపాయకు రానున్నారు. హైదరాబాద్‌నుంచి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి శుక్రవారం ఉదయం ఎర్రగుంట్ల చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వస్తారు. ఉదయం 7-30గంటల నుంచి 8 గంటల వరకు వైఎస్ సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రార్థనలు చేస్తారు. 8 గంటల నుంచి వైఎస్ సమాధిని దర్శించుకునే సందర్శకులకు అనుమతి ఇస్తారు.
సాయంత్రం వరకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోనే వైఎస్ జగన్ ఉండి తిరిగి రాత్రికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు వెళతారు. గురువారం రాత్రికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిళమ్మ ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్ ఘాట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బారి కేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే 30వేలమందికి సరిపడ అన్నదాన ఏర్పాట్లను చేస్తున్నారు. వైఎస్ సమాధిని థాయిలాండ్, స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లనుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఎకో పార్కు వద్ద ఏర్పాటు చేసిన వైఎస్, విజయమ్మల కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఇడుపులపాయలో ఏర్పాట్లు చక్రాయపేట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి పర్యవేక్షణలో సాగుతున్నాయి.