శనివారం , 7 డిసెంబర్ 2024
నీళ్ళ చెట్టు
నీళ్ళ చెట్టు

కరువుసీమలో నీళ్ళ చెట్లు!

రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి.

సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా తొలిచి భంగపడిన దృశ్యాలు కోకొల్లలు. ఆలాంటి కరువు సీమలోనూ నీటివృక్షాలున్నాయి!

చదవండి :  విభజన తర్వాత సీమ పరిస్థితి ...

neella teega (liana)

నీళ్ళ తీగ ఆకు
నీళ్ళ తీగ ఆకు

వై.ఎస్.ఆర్ (కడప) జిల్లాలోని మైదుకూరు సమీపంలోని, నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నీటివృక్షాలు ఉన్నాయి! ప్రపంచంలోనే అరుదైన కలివికోడి, ఎర్రచందనం లాంటి పక్షి, వృక్ష జాలాలకు ఆవాసమైన నల్లమల అటవీ ప్రాంతంలోనే ఈ నీళ్ళ చెట్లు కూడా ఉండడం విశేషమే! అడవిలో దొరికే ఫలసాయం సేకరించుకుని జీవనం సాగించే గిరిజనుల(యానాదుల) పాలిట ఈ వృక్షాలు కల్పవృక్షాలు మాత్రం కాక పోయినా ఎండాకాలంలో ఆపద సమయంలో దప్పిక తీర్చే ఆపద్భాంధవులని మాత్రం చెప్పవచ్చు.

నీళ్ళతీగకు పూసే పూత
నీళ్ళతీగకు పూసే పూత

గిరిజనులు ఈ వృక్షాన్ని ‘నీళ్లతీగ’ అని పిలుస్తారు. భూమిలో మొలకెత్తిన ఈ నీటి మొక్కలు , తీగలా పాకి, కాండాన్ని వృక్షంలా విస్తరించుకుంటూ, పరిసర చెట్ల మీదుగా 50 మీటర్లకు పైగా పొడవున పెరుగుతాయి. తీగలు బలంగా పెరుగుతూ శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి.

చదవండి :  కడప జిల్లాలో సంక్రాంతి

ఈ వృక్షాలను ‘లయనాస్‌’ గా వృక్ష శాస్త్ర పరి భాషలో పిలుస్తారని, రాయలసీమలో ఈ వృక్షాలు అరుదుగా కనపడతాయని వృక్ష శాస్త్రజ్ఞులు అంటున్నారు.

నీళ్ళ తీగ అడ్డుకోత
నీళ్ళ తీగ అడ్డుకోత

తమకు తాగడానికి అడవిలో ఎక్కడా గుక్కెడు నీళ్లు దొరకని సమయంలో మాత్రమే గిరిజనులు (యానాదులు) ఈ నీటి వృక్షాన్ని ఆశ్రయించి దప్పిక తీర్చుకుంటారు. నీళ్ల కోసం గిరిజనులు నీటివృక్షం కాండం జోలికి ఎంత మాత్రం పోరు. ఈ చెట్టు నుండి విస్తరించే ఉపతీగెల ద్వారా దాహం తీర్చుకుంటారు. తమ పూర్వీకుల నుండి వారసత్వంగా అందిన ఈ పరిజ్ఞానాన్ని విపత్కర సమయాల్లోనే వినియోగించుకోవడం ప్రశంసనీయం.ఈ నీళ్లను తాగినప్పుడు దప్పిక వెంటనే తీరుతుందనీ, అడవిలో తిరిగిన అలసట కూడా మటుమాయం అవుతుందనీ గిరిజనులు చెబుతున్నారు.

చదవండి :  వాన జాడ లేదు - సేద్యానికి దిక్కు లేదు

మరి ఈ సంగతి మన నేతలకు తెలిస్తే, ఎర్రచందనంలా వీటి అమ్మకాలకూ గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తారేమో!

– తవ్వా ఓబుల్‌‌రెడ్డి

(నల్లమల నుండి అందించిన కధనం)

 

ఇదీ చదవండి!

sodum govindareddy

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: