నన్నెచోడుడు

నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు నందలూరు సౌమ్యనాథుని సేవించినారు.

ఈ నన్నెచోడుడు ‘కుమార సంభవము’ అనే ఉత్కృష్ణ కావ్యాన్ని రచించిన కవిరాజశిఖామణి సూర్యవంశరాజు గనుక ఇతనికి టెంకాణాదిత్యుడు అని బిరుదు. కుమారసంభవ కావ్యాన్ని మానవల్లి రామకృష్ణకవి 1909లో పరిశోధించి, పరిష్కరించి, ప్రచురించాడు. ఈ తెలుగు కావ్యం కాళిదాసుని సంస్కృత కావ్యానికి అనువాదం. నన్నయ భారతాంధ్రీకరణం కంటె ముందే నన్నెచోడుడు కుమారసంభవాన్ని రచించాడని మానవల్లి రామకృష్ణకవి వాదన. అయితే సరైన చారిత్రక ఆధారాలు లేనందున నన్నెచోడుని కాలనిర్ణయం వివాదాస్పదమయింది.

మానవల్లి రామకృష్ణకవి, నేలటూరి వేంకటరమణయ్య, నడకుదుటి వీర్రాజుగార్లు ఈ నన్నెచోడుడు నన్నయ కంటె పూర్వుడని నిర్ణయించారు. అంటే నన్నయ కంటె దాదాపు వందేండ్లకు ముందరివాడని. అయితే చిలుకూరి వీరభద్రరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్యపంతులు, మన కవిరాజశిఖామణి క్రీ.శ. 1120 ప్రాంతం వాడని, వీరేశలింగం పంతులు, బుర్రాశేషగిరిరావు, కోరాడ రామకృష్ణయ్య, క్రీ.శ. 1160 ప్రాంతం వాడని వారి వారి వాదనలతో వివరించారు. చాలామంది పండితులు, సాహితీవేత్తలు నన్నెచోడుడు నన్నయకు కొద్ది సంవత్సరాలు వెనుకవాడని, తిక్కనకు పూర్వుడని తేల్చి చెప్పారు.

తెలుగులో కవిత్వం నన్నెచోడుని కంటె నన్నయ కంటె పూర్వం నుంచే అభ్యాసంలో ఉండేది. తెలుగు కవిత్వం అభ్యాసానికి రాక ముందు సంస్కృత ప్రాకృత భాషలు సాహిత్య భాషలుగా ఉండేవి. మన దేశములో తెలుగు వారితో పాటు ఇతరులు కూడా సంస్కృత ప్రాకృత భాషలు నేర్చి, ఆ భాషా కావ్యాలను అధ్యయనం చేసేవారు. కనుక నన్నయ నన్నెచోడాదులు అందరూ రామాయణ భారతాది ఇతిహాసాలను కాళిదాసు, భారవి, బాణకవి వంటి వారి సంస్కృత కావ్యాలను అధ్యయనం చేసేవాళ్లు. ఆ రీత్యా తెలుగులో నన్నయకు పూర్వమే తెలుగులో ఛందస్సు సంస్కృత, తమిళ, కన్నడ సాహిత్యాల ఆధారంగా రూపుదిద్దుకొన్నది. (కన్నడంలో తెలుగు కంటె ముందుగానే కావ్యరచన ప్రారంభమైంది.)

మొట్టమొదట ఛందోబద్ధ పద్యపాదాలు కడప జిల్లాలో రేనాటి రాజుల కాలంలోనే అంటే క్రీ.శ. ఆరవ శతాబ్దంలో దర్శనమిచ్చాయి. 9వ శతాబ్దంలో అద్దంకి శాసనంలో పూర్తి సీసపద్యం చోటు చేసుకుంది. అంటే నన్నయ, నన్నెచోడులకు రెండు లేక మూడు శతాబ్దాలకు ముందే తెలుగులో మార్గ ఛందస్సుకు సంబంధించి వృత్తపద్యాలు, దేశిచ్ఛందస్సులో కందము, సీసము, ఆటవెలది, తేటగీతి, ద్విపద వంటి పద్యరీతులు వాడుకలోనికి వచ్చాయి. ఆ ఛందో రీతుల్ని నన్నయ, నన్నెచోడులు కావ్యరచనలో ప్రయోగించి తెలుగు కావ్యరచనకు ఆద్యులయినారు.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2

నన్నయ ఆది కవి అనడానికి తిరుగులేని అనేక ఉపపత్తులు, కారణాలున్నాయి. అయితే కుమార సంభవ కర్త అయిన నన్నెచోడుడు ఆది కవి అనడానికి పండితులు తెలిపిన కారణాలు కూడా పరిశీలించదగినవే. మానవల్లి రామకృష్ణకవి 1909లో నన్నెచోడుని కుమార సంభవాన్ని వెలికితీసి, ప్రచురించిన తరువాత నన్నెచోడుని కవితా విమర్శన గ్రంథాలు పెక్కు వెలువడ్డాయి. అందులో 1937లో శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి ప్రచురించిన ‘నన్నెచోడ దేవ కుమార సంభవ విమర్శనము’, 1951లో దేవరపల్లి వేంకట కృష్ణారెడ్డి ప్రచురించిన ‘నన్నెచోడ కవి చరిత్ర’, ఆ తరువాత వేదం వేంకటరాయశాస్త్రి ‘నన్నెచోడుని కవిత్వము’, అమరేశ్వరం రాజేశ్వరశర్మ ‘నన్నెచోడుని కవిత్వము’, తిమ్మావజల కోదండరామయ్య ‘కవి రాజశిఖామణి’ ముఖ్యమైనవి.

నన్నెచోడుడు కావ్యరచనలో అనేక విషయాలకు ఆద్యుడైనాడు. కావ్య ప్రారంభంలో సకల దేవతా ప్రార్థన గావించాడు. గురు ప్రార్థన, పూర్వకవిస్తుతి, కుకవినింద, కవి స్వవిషయం, కృతి పతి వర్ణన, షష్ఠ్యంతాలు రచించి తరువాతి కవులకు క్రమ నియమ మార్గదర్శకుడైనాడు. తన కావ్యాన్ని తన గురువైన జంగమ మల్లికార్జునునికి అంకితమిచ్చాడు. ఈ ఒరవడిని తరువాతి కవులు అనుసరించారు. పూర్వకవుల స్తుతిలో నన్నయ వాల్మీకి వ్యాసులనే స్తుతించాడు. నన్నెచోడుడు వారిరువురితో పాటు సంస్కృత కవులైన కాళిదాసును, భారవిని, ఉద్భటుని, భట్టబాణుని స్తుతించాడు. అందు నన్నయ ఊసేలేదు. కాబట్టి నన్నెచోడుడు నన్నయ కంటే ముందు వాడో లేక సమకాలికుడో అయి ఉండాలి. ఆ కాలంలో విస్తర, వస్తు, మార్గ, దేశి అని నాలుగు విధాలైన కవిత్వముండేది. అంతేగాక తెలుగు కవిత్వం ఆశుకవిత, బంధ కవితా, గర్భ కవిత, చిత్ర కవితలుగా భాసిల్లింది. నన్నెచోడుని కావ్యంలో బంధ కవిత, గర్భకవిత, చిత్ర కవిత చోటు చేసుకున్నాయి.

చదవండి :  కడప జిల్లాలో వీరశిలలు

తెలుగు కవిత్వం పూర్వం గ్రంథస్థం కాకున్నా నన్నయ నన్నెచోడులకు ముందు నుంచే జనం నోళ్లలో నానుతూ ఉండేది. ఇందుకు నిదర్శనంగా తనకు పూర్వం చాళుక్యరాజులు తెలుగు దేశి కవిత్వాన్ని ఆదరించారని తాను తన కవిత్వంలో జాను తెలుగును అధికంగా ప్రయోగించినట్లు నన్నెచోడ రాజ శిఖామణి చెప్పుకున్నాడు. తెలుగు ‘కుమార సంభవము’ను నన్నెచోడుడు 12 ఆశ్వాసములతో 2005 పద్యాలతో రచించాడు. ఇందులో దేశికవితకు చెందిన కంద పద్యాలే 534. ఇతర దేశి కవితకు సంబంధించిన పద్యాలు కూడా అధికమే. సంస్కృత కావ్యాలను స్ఫుటంగా అవలోడించనిదే ఇంతటి రసరమ్య కావ్యారాజాన్ని నన్నెచోడుడు వ్రాయజాలి వుండే వాడు కాదు. కారణం మన దేశ భాషలన్నిటి మీద అప్పటికి సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావం మిక్కుటం కావటమే.

నన్నెచోడుని కుమార సంభవమందు 12 ఆశ్వాసాలున్నవి. అవి 1. సతీదేవి జననము, గణాధిప జననము 2. దక్షాధ్వర ధ్వంసము. 3. పార్వతీ జననము, శివుని తపస్సు. 4. తారాకాసురుడు దేవతలకు కలిగించిన బాధ, మన్మథుడీశ్వరునిపైకి వెడలుట. 5. మన్మథ సంహారము, పార్వతీ విరహము 6. పార్వతీ తపస్సు 7. ఈశ్వర వటు రూపధారణము, పార్వతీ తపస్సు ఫలితము. 8. ఓషధీప్రస్థపురవర్ణనము, పార్వతీపరమేశ్వరులని వాహనమునకు అంకురార్పణ 9. పార్వతీ పరమేశ్వరుల వివాహము, వారి శృంగారలీలలు. 10. కుమారస్వామి జననము. 11. తారకాసుర, కుమార రాయబారములు, యుద్ధ ప్రారంభము. 12. తారక వధ, కుమారస్వామి విజయము.

ఈ పన్నెండు ఆశ్వాసాల కుమార సంభవంలో నన్నెచోడుడు కాళిదాసు కావ్యాన్ని యధాతథంగా కాకుండా అవసరమైన మార్పులు, చేర్పులతోను, అవసరమైన వాని పరిహరణలతోను సాగించాడు. సతీదేవి వృత్తాంతాన్ని విపులపరచినాడు. గణాధిపతి వృత్తాంతాన్ని ప్రవేశపెట్టాడు. రతీమన్మథసంవాదాన్ని చేర్చాడు.

పార్వతి బిడ్డలకు ఓం నమశ్శివాయ మంత్రంతో విద్యాభ్యాస ప్రారంభం చేయించాడు. మన్మథుని పునసృష్టి ఈశ్వర కారణంగా జరిగినట్లు రచించాడు. శివ పార్వతులకు మధుపానం లేనట్లు తెలిపాడు. ఇవి మూల కావ్యంలో లేవు.

సంస్కృత పంచ మహాకావ్యాల అధ్యయనంతో నన్నెచోడుడు కుమార సంభవమందు కథా సంవిధానమును సమగ్రపరచి, వస్వైక్యమును సాధించి వర్ణనాత్మక రచనారీతికి ఆద్యుడైనాడు. ఈ కవిరాజ శిఖామణి రచనా చమత్కారము బహుధా ప్రశంసనీయము. ఈయన ప్రతిభాతిశయం కుమార సంభవము నందు అడుగడుగునా దర్శనమిస్తుంది. మచ్చుకు కొన్ని పద్యాలు పరిశీలిద్దాం.

చదవండి :  బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

దక్షాధ్వర ధ్వంస ఘట్టమున దక్షునిపై కోపంతో పరమేశ్వరుడు రౌద్రగతిని విశ్వమంతటినీ సంహరింపబూనగా గణాధిపతి ఇలా అంటాడు.

గీ. ఎలుక మీదికోపమున ఇల్లేర్చునట్లు
దక్షుపై నల్గి జగమెల్ల నీక్షణంబ
సంహరింపంగ దలచుట సన్నె, వాని
బట్టి తెచ్చెద వడినన్ను బనుపు దేవ.
ఈ పద్యంలో మొదటి పాదం తెలుగు నుడికారపు సొంపుకు గొప్ప నిదర్శనం.

గణ ముఖ్యులు దక్షుని పట్టుకొని వానిని శిక్షింపవలసిన విధానాన్ని గణముఖ్యుల ముఖత ఇలా వర్ణిస్తాడు.

ఉ. వీండెఖలుండుదక్షుడను వీరిడిపారుడు వీడు సర్వ వ
ధ్యుండెడ సేయకుండు, శివదూషకునాలుక గోసి యుప్పు నిం
పుండు వ్రపుద్రవమ్మొడల బూయుడు, లోహముగాచి నోరబ్రో
యుండు దురాత్ముచర్మపటమొల్వుడు గన్నులు మీటుడుక్కరన్
ఇందుకూడా తెలుగుతనము ఉట్టిపడుతున్నది.

పంచమాశ్వాసమున శివుని తపస్సును భంగమొందించుటకు దేవేంద్రుని పనుపున వచ్చిన మన్మథుని భస్మమొందించుటకు అప్పుడు బయల్వెడలిన అగ్నిని కడు చమత్కారముగా వర్ణించాడు. ఉదాహరణకు:

క. గిరి సుతమై కామాగ్నియు
హరుమై రోషాగ్నియుం దదంగజుమై ను
ద్ధుర కాలాగ్నియు రతిమై
నురు శోకాగ్నియునుదగిలి యొక్కటనెగసెన్.
గిరిసుత, హరు, అంగజు, రతిలమై అంటే శరీరాల నుంచి చతుర్విధాగ్నులు ఆ సమయాన బయల్వెడలినాయట.

కుమార స్వామి ఘనతను ఇలా వర్ణిస్తాడు:
క. దనుజారికంటె వీరుడు
దినవల్ల భుకంటె నధిక తేజుడు, పద్మా
సనుకంటె మహాత్ముడు, ద్రిణ
యనుకంటె విశేషుడు పతగైశ్వర్యమునన్

ఈ విధంగా నన్నెచోడుని కుమార సంభవము ప్రతి పద్య మనోహరమై, వస్తు కవితా ధుర్యమై వెలసింది. రమ్యమైన సంస్కృత పద, పదబంధాలు, వాడియైన తెలుగు నుడికారపు సొంపుతో సమ్మిశ్రితమై ప్రబంధ లక్షణాలకు నెలవై తరువాతి తెలుగు కవులకు మార్గదర్శకమై నిలిచింది.

నన్నయ కవిత్వం పరాశ్రయంగా రాజాస్థానం నుంచి లోకానికి అందించబడింది. నన్నెచోడునిది ఆత్మాశ్రయ కవిత్వం, తనకోసం, తానారాధించిన శివుని కైంకర్యంగా నిలిచి తరించాడు. ఆ కాలాన నన్నయ భారతం వలె సీమాంతర ప్రాచుర్యానికి నోచుకొన్నదో లేదో కాని 20వ శతాబ్దాన పండిత కవిశేఖరుల చర్చలకు ఆలవాలమై కావ్యారచనలో అనేక అంశాలకు, విషయాలకు ఆద్యుడుగా నన్నెచోడుడు అభివర్ణింపబడ్డాడు. ఇలా కవిరాజ శిఖామణి మూలంగా కడప జిల్లా ప్రశస్తి ఇనుమడించింది.

– ఎం.జానకిరామ్

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: