తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి- కలెక్టర్
కడప : కడప కళాక్షేత్రంలో ఈ నెల 29వతేదీ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అనిల్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబరులో తెలుగుభాషా దినోత్సవ నిర్వహణపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆగస్టు 29వతేదీ గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రభుత్వం తెలుగుభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు తెలుగు భాషా కోవిదులకు, పదవతరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులు ముగ్గురికి పురస్కారాలు అందిస్తామన్నారు. ఆ రోజు కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. రొటీన్‌గా కాకుండా వినూత్నంగా ఈ కార్యక్రమాల రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవితాగోష్టులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా రెవిన్యూ అధికారి హేమసాగర్ తెలిపారు. ఇంటాక్ కన్వీనర్ సీతారామయ్య మాట్లాడుతూ తెలుగుభాష మొగ్గ తొడిగింది జిల్లాలోనే అని తెలిపారు. తొలి తెలుగు శాసనాలు జిల్లాలోనే లభించాయన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్టెప్ సీఈవో మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాన్‌శ్యాంసన్, డీఈవో సుబ్బారెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి గుణభూషణరెడ్డి, తహశీల్దారు శ్రీనివాసులు పాల్గొన్నారు.