
తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన
కడప: నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు నీటి సమస్య ఎక్కువవుతోందని, కలుషిత నీటితో జనం రోగాలబారిన పడుతున్నారని తెలిపారు.
నీటి ఎద్దడి నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించకపోతే కార్పొరేషన్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఐదురోజులుగా సీపీఐ నాయకులు బృందాలుగా ఏర్పడి నగరంలో తాగునీటి సమస్యపై అధ్యయనం చేశారన్నారు. నీటిని కొనుక్కొనే స్తోమత లేని వారు ఫ్లోరైడ్‌తో కూడిన నీటిని త్రాగుతూ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.
గండి, లింగంపల్లి, బుగ్గ వాటర్ వర్క్స్‌లలో బోర్లు ఎండిపోతున్నాయని, కడపలో త్రాగునీటికి నికర జలాల కోసం నగరపాలక వర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కలెక్టర్ యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.
వాటర్ ప్లాంటు యజమానులు వాల్టాచట్టాన్ని అతిక్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. వాటి నాణ్యత పట్ల ఆరోగ్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ సందర్బంగా ఎంఈ చిన్నారావు, డీఈ దౌలా ఆందోళనకారుల వద్దకు వచ్చి వారి సమస్యలు విని వినతి పత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగరకార్యదర్శి ఎన్. వెంకటశివ, జిల్లా కార్యవర్గం సభ్యులు సుబ్రమణ్యం, విజయలక్ష్మి, డబ్ల్యు. రాము, నాగరాజు, గౌస్, ఓబులేసు, సురేష్, సుబ్బలక్షుమ్మ, స్వర్ణ, బీబీ, పక్కీరప్ప, బ్రహ్మం పాల్గొన్నారు.