
హైకోర్టులో నిరసన తెలియచేస్తున్న న్యాయవాదులు
జీవో 120కి నిరసనగా హైకోర్టులో న్యాయవాదుల నిరసన
(హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి అందించిన కథనం)
రాయలసీమ విషయంలో ఆది నుండి తప్పుడు ప్రచారాలు, అడ్డగోలు నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తెదేపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లఘించి విడుదల చేసిన చీకటి జీవో 120ని నిరసిస్తూ ఈ రోజు (బుధవారం) హైకోర్టులో న్యాయవాదులు నిరసన తెలియచేశారు.
రాయలసీమ జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ ఉదయం హైకోర్టులోని నాలుగో గేటు వద్ద జీవో 120 ప్రతులను చించి నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీమ విద్యార్థినుల భవిష్యత్తుకు సమాధి కడుతూ అం.ప్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లఘించి మరీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రవేశాల విషయంలో జోనల్ వ్యవస్థను నీరుగారుస్తూ చీకటి జీవో 120ని వెలువరించిందన్నారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టి, ఆర్టికల్ 371(డి) ప్రకారం పద్మావతి మహిళా వైద్య కళాశాలలో సీట్లను ఎస్వీయు జోన్ విద్యార్థులకు కేటాయించాలని స్పష్టం చేసిందన్నారు.
హైకోర్టు తీర్పును అనుసరించి చేసిన తప్పును సరిదిద్దుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం దురదృష్టకరమన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్తినులకు చెందాల్సిన 107 సీట్లను 13 జిల్లాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో రాయలసీమ విద్యార్థులు జరుపుతున్న పోరాటానికి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరం కన్వీనర్ అశోకవర్ధన్ రెడ్డి, గ్రేటర్ రాయలసీమ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణా కార్యదర్శి రాధరావులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం ప్రకటించారు.