జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం
కడప: జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇది శుభపరిణామమని జైళ్ల శాఖ రీజియన్ డీఐజీ జయవర్దన్ అన్నారు. మంగళవారం స్థానిక బద్వేలు సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
గతంలో జమ్మలమడుగు సబ్‌జైలులో 100మంది ఖైదీలు ఉండేవారని, ప్రస్తుతం 13 మంది ఉన్నారన్నారు. అలాగే ప్రొద్దుటూరు సబ్‌జైలు పరిధిలో గతంలో 80మంది ఖైదీలుండగా, ప్రస్తుతం 30-40మధ్యలో ఉంటున్నారని, దీనికి ప్రధాన కారణం నేరాలు తగ్గుముఖం పట్టడమే అన్నారు.
కడప సెంట్రల్ జైల్ పరిధిలో నిర్వహించే పెట్రోల్‌బంక్ వలన రోజుకు రూ.10లక్షల వ్యాపారం జరుగుతోందన్నారు. త్వరలో ఖైదీలచే కడపలో గ్యాస్ ఏజన్సీ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ఇలాంటి వ్యాపారాలు దోహదపడతాయన్నారు.
ఖైదీలకు ధ్యానంతో పాటు యోగా, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక బోధనలు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. రాజంపేటలో నూతనంగా నిర్మించిన సబ్‌జైలును ఈ నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఖైదీలతో విడివిడిగా సౌకర్యాల గురించి మాట్లాడారు.