కడప: తెలుగు నాటక రంగ దినోత్సవం నవంబర్ 6వ తేదీన నిర్వహించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిస్నాతులైన కళాకారులను ఎంపిక చేయాలని కలెక్టర్, జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి అధ్యక్షులు వి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో తెలుగునాటక రంగ దినోత్సవంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.
తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 6 తేదీన నిస్నాతులైన కళాకారులను సన్మానించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానించి వాటిని సబ్ కమిటీ పరిశీలన చేసి ఎంపిక చేస్తారన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పోగొట్టే విధంగా నెలకు ఒక సారి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాశాల క్షేత్రం కమర్షియల్ కార్యక్రమాలను నిర్వహించేందుకు అద్దె పెంచి వాటి ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సాంస్కృతి హైదరాబాద్ వారికి లేఖ రాయాలని జిల్లా పౌర సంబంధాల అధికారి డి.వి. ప్రసాద్‌రావు కలెక్టర్‌ను ఆదేశించారు.
జిల్లాలో సాంస్కృతిక వ్యవహార మండలి నిర్వీర్యమై పోతుందని మండలి సభ్యులు ఇలియాస్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పౌరాణిక నాటకాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదని సౌజన్య కళా మండలి సభ్యులు సాగత్ వలీ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో సాంస్కృతి వ్యవహారాల మండల సభ్యులు, రేడియో స్టేషన్ డైరెక్టర్ విజయ భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ కాంతం శ్రేష్ఠి సుబ్బరాయుడు, ఎన్.సి. రామసుబ్బారెడ్డి, సీతారామయ్య, శివారెడ్డి, పవన్‌కుమార్‌లు పాల్గొన్నారు.