
కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం
కడప జిల్లా పరిషత్ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. ఉదయం కోఆప్షన్ సభ్యులుగా నలుగురు నామినేషన్లు వేయగా వారిలో ఇద్దరు నామినేషన్‌ను ఉపసంహరించుకోగా మిగిలిన దువ్వూరుకు చెందిన చిన్న కమ్ముగారి మదార్‌వలి, ప్రొద్దుటూరుకు చెందిన కె.అక్బర్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయిన అనంతరం వారితో పాటు జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం కలెక్టర్ చేయించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవిని కాశినాయన జడ్పీటీసీ సభ్యుడు కత్తెరగండ్ల వెంకటసుబ్బయ్య ప్రతిపాదించగా గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలు మిట్టపల్లె లక్ష్మీదేవి బలపరిచారు. అలాగే వైస్ చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించగా జమ్మలమడుగు జడ్పీటీసీ సభ్యుడు జయసింహారెడ్డి బలపరిచారు.
చైర్మన్, వైస్ చైర్మన్‌లకు గూడూరు రవి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిల పేర్లు మినహా మిగతా ఎవరి పేర్లు ప్రతిపాదనలకు రాకపోవడంతో వీరిద్దరిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. అనంతరం వారిద్దరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాష, జయరాములు, రాచమల్లుప్రసాద్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.