జిల్లాలో చరిత్ర సృష్టించిన మహానుభావులెంతోమంది వున్నా ఫ్యాక్షన్ సినిమాల పుణ్యమా అని కడప పేరు వింటేనే గుండెలు పేలిపోతాయి… కడప కథలు వింటేనే నరాలు ఉత్కంఠతో తెగిపోతాయి.
అయితే అదే జిల్లా నుంచి వచ్చిన ఓ వైద్యుడు మాత్రం నరాలను సరి చేస్తూ, నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్సా నిపుణుడి (న్యూరో సర్జన్)గా రోగులకు సేవలందిస్తూ చెన్నైలో పలువురి ప్రశంసలందుకుంటున్నారు. ఆయనే డాక్టర్ ఆవుల చక్రవర్తి.
* * *
మౌలిక సదుపాయాల లేమి వల్లే వైద్యం ఖరీదైపోతోందని చెబుతున్న డాక్టర్ చక్రవర్తి.. తనకు తోచినంతగా పేదవారిని ఆదుకుంటున్నారు.
కడపలో అత్యాధునిక సదుపాయాలతో నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పి జన్మనిచ్చిన జిల్లా రుణం తీర్చుకుంటానంటున్న మన ‘డాక్టర్ చక్రవర్తి’ – ఎస్.కె.ఎం.డి.గౌస్ బాషా ముందు ఆవిష్కరించించిన అంతరంగం – ఆయన మాటల్లోనే…
మాది రాయలసీమకే వన్నె తెచ్చిన కడప. అమ్మ విమల హిందీ గ్రాడ్యుయేట్. నాన్న రామచంద్రయ్య – చిన్న పిల్లల డాక్టర్. అమ్మానాన్నలకు మేం ఇద్దరం. నేను 1969లో పుట్టాను. తమ్ముడు – బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
నేను ఇంటర్మీడియేట్ వరకు కడపలోనే చదువుకున్నాను. తరువాత బెంగుళూరులో మెడిసిన్ పూర్తి చేశాను. న్యూరోసర్జికల్‌గా చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రైనింగ్ చేశాను. ఫిన్‌ల్యాండ్‌లో రెండేళ్లు వ్యాస్‌క్యులర్ న్యూరోసర్జరీ ఫెలోషిప్ తీసుకున్నాను.
నాకు భార్య సుధ, ఇద్దరు ఆడపిల్లలు – సౌఖ్య (13), త్రిలోఖ్య (7). పెద్దకుమార్తె రోబోటిక్స్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంటే, చిన్నకుమార్తె మాత్రం నాలాగే న్యూరోసర్జన్ అవుతానని చెబుతోంది. 2004 నుంచి చెన్నైలోని ఐదు ప్రముఖ ఆసుపత్రుల్లో పని చేస్తున్నాను.
తొలి చిన్నారుల ఆసుపత్రి మాదే …
కడపలో మొట్టమొదటి చిన్నపిల్లల ప్రత్యేక ఆసుపత్రి మా నాన్నగారిదే. ఇది మాకెప్పుడూ గర్వంగానే వుంటుంది. అప్పట్లో చిన్నపిల్లలకు బాగా లేకపోతే సాధారణ డాక్టర్ వద్దకే తీసుకెళ్లేవాళ్లు. లేకుంటే పిడియాట్రీషన్ కోసం ఇతర ప్రాంతాలకు పరిగెత్తేవాళ్లు. అయితే మా నాన్నగారు ప్రత్యేకంగా చిన్నారుల ఆసుపత్రి పెట్టిన తరువాత మా ప్రాంతంవారికి ఆ బాధ లేకుండాపోయింది. నేను వైద్యరంగంలోకి రావడానికి మా నాన్నగారే స్ఫూర్తి.
అవి ఛాలెంజింగ్…
ఫిన్‌ల్యాండ్‌లో వున్నప్పుడు ఓ పేషంట్ తలలో విపరీతమైన బ్లీడింగ్ జరిగింది. మెదడు బాగా దెబ్బతింది. ఆమె బ్రతకదని మా బృందం తేల్చేసింది. అయితే ఓ ప్రయత్నం చేద్దామని నేను, నా సహచరులతో మాట్లాడి ఆపరేషన్ చేశాను. భగవంతుడి దయవల్ల ఆమె బ్రతికింది. ఆ సంఘటన నిత్యం నాలో నాకు స్ఫూర్తి నింపుతుంటుంది. ఇక టి.నగర్‌కు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు బీపీ, కళ్లు తిరుగుతున్నాయంటూ వచ్చారు. స్కాన్ చేస్తే మెదడులో రక్తం గడ్డకట్టుకుని వుంది. నా బృందంతో కలసి మూడు గంటల్లో ఆపరేషన్ చేశాను. ఆయన అప్పుడప్పుడూ వచ్చి సంతోషంగా మాట్లాడివెళ్తుంటారు.
అపోహలు వీడండి
వృద్ధాప్యంలో మెదడు, వెన్నుపూస వంటి వాటికి శస్త్రచికిత్స చేస్తే ఇక అంతా అయిపోయినట్లేనని, జీవితంలో ఇక నడవలేమని చాలామంది అపోహపడుతుంటారు. ఈ రెండింటికీ సమస్యలొస్తే ఆపరేషన్ చేయించుకోవడానికి అస్సలు అంగీకరించరు. కానీ ఇది సరికాదు. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో వుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు.
బాధాకరమైన సంఘటనలు…
వైద్యులకు తమ వృత్తిలో బాధాకరమైన సంఘటనలు వుంటూనే వుంటాయి. ఒక్కోసారి మా వద్దకు వచ్చిన రోగులకు చికిత్స అందించేలోపే ప్రాణాలు పోతుంటాయి. వైద్యం అందించే శక్తి వున్నా, సమయం లేకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మనసు ఎంతో వేదనకు గురవుతుంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు బాధితులకు సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్లే దేశంలో ప్రాణనష్టం విపరీతంగా పెరుగుతోంది.
ఖరీదు కావడానికదే కారణం
మన దేశంలో వైద్యరంగానికి తగినన్ని నిధులు లేవు. తగిన మౌలిక సదుపాయాల్లేవు. తగినంతమంది వైద్యులు లేరు. విదేశీస్థాయి ఆధునిక పరికరాలు తీసుకురావాలంటే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక వైద్యులు కూడా జనాభాకు తగినంతగా లేరు. సహజంగానే వినియోగం పెరిగినప్పుడు దేనికైనా ఆటోమేటిగ్గా డిమాండ్ పెరుగుతుంది. అందుకే వైద్యం ఖరీదైందని నా అభిప్రాయం. విదేశాల్లో వైద్యం ఇంత ఖరీదుగా వుండదు.
ఆసుపత్రి స్థాపించడమే…
బహుశా కడప నుంచి వచ్చిన తొలి న్యూరోసర్జన్‌ని నేనే అనుకుంటా. ప్రమాదాల కారణంగా సరైన సమయంలో సరైన వైద్యం అందక ఎంతోమంది చనిపోతున్నారు. కడపలో ఆసుపత్రులున్నా నాడీ శస్త్రచికిత్స కోసం సరైన ఆపరేషన్ థియేటర్లు లేవు. అందుకే అక్కడ న్యూరాలజీ ఆసుపత్రి స్థాపించాలన్నదే నా ఆశయం. ప్రమాదాల్లో గాయపడ్డ వారు ఇటు చెన్నైగానీ, అటు హైదరాబాద్ వెళ్లాల్సిందే. కానీ ఈలోపే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్సకు తగినన్ని సదుపాయాల్లేవు. అందుకే అక్కడ ఆసుపత్రి స్థాపించాలనేది నా కోరిక. ఇప్పుడు కూడా నెలకోసారి కడప వెళ్తుంటా. అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం చేసి వస్తుంటా. అందరిలాగే నా వృత్తిలో నేను రాణించాలని, అంటే బెస్ట్ న్యూరోసర్జన్‌గా అనిపించుకోవాలని, రోగులకు మెరుగైన సేవలందించాలన్నదని నా లక్ష్యం. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్నా, టి.నగర్‌లోని నా నివాసానికి చాలామంది పేదలు వస్తుంటారు. వారందరికీ నావంతు సాయం చేస్తూనే వుంటా.
డాక్టర్ ఆవుల చక్రవర్తి మొబైల్ నెంబరు: 9940059403
అప్రమత్తం కండి…