రాయలసీమ
భూమన్

చరిత్రలో రాయలసీమ – భూమన్

తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హెచ్‌.డి. సంకాలియా తెలియజేసినారు.

”మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల మీద చెక్కబడ్డ కళానైపుణ్యాన్ని కనుగొన్నాడు. ఆ పనితనాన్ని ఆయన అదే రోజుల్లో ఫ్రాన్స్‌ గుహల్లో కనుగొన్న పనితనంతో పోల్చినాడు. ఆ కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞుల ‘పాత రాతియుగం ఉన్నతి దశ’ అంటారు.
దురదృష్టవశాత్తూ పుట్‌ సేకరించినవేవీ నేడు లభ్యం కావటం లేదు. అయితే ఆ తవ్వకాలలో దొరికిన సమాచారం ఆధారంగా మనం గట్టి ప్రయత్నం చేస్తే అభివృద్ది చెందిన వేటగాడి దశలోని మానవుని ఉనికి గురించి అనేక ముఖ్యమయన ఆధారాలు కర్నూలు గుహల్లో తప్పక దొరుకుతాయని, ఈ కృషిలో చిత్తూరు, మద్రాసు పరిసరాల గుహలు కూడా ఉపయోగపడవచ్చనని నాకు గట్టి నమ్మకం’ (హెచ్‌.డి. సంకాలియా) కర్నూలు జిల్లాలోని నదులు, వాగుల వెంబడి పాతశిలా యుగపు పనిముట్లు ఎన్నో దొరికినాయి. బెలుంగుహల్లో పాత శలా యుగపు ఉత్తర దశకు సంబంధించిన జనావాసాలు దొరికినాయి. ఇక్కడ మెల్లో వేసుకునే దంత హారాలు, కొన్ని వంపటెముకలు దొరికినాయి. కడప జిల్లా రాయచోటి తాలూకా సరస్వతిపల్లె, ముక్రావులపల్లె, ఇతర ప్రాంతాలకు చెందిన కనుమలోపల్లె, చిట్వేల్‌, కలసపాడులలోను, అనంతపురం జిల్లా గుంతకల్లు స్టేషన్‌లో నైరుతి దిక్కుగా వున్న దిబ్బలోను విడపనకల్లు కోటలో, వేల్పుమడుగు గుట్టల్లో, లత్తవరం, కరుకు ముక్కల కొత్తకోటకు పడమరగా వున్న మిట్టమీద, ఉరవకొండ ప్రాంతంలోను పాత శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ సమీపంలోని పుట్‌ స్నేహతులొకరికి ఒక కర్రాపన్నె దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ లభించని ప్రాచీన కుడ్య చిత్రాలు బెలుం గుహల్లో వున్నాయి. రాయదుర్గం కొండ మీద చెక్కడపు పనులు చిల్రేఖనం లభించినాయి. కర్నూలు జిల్లాలోని బెలుంగుహల్లో ఆనాటి మానవునికి నిప్పు చేయటం తెలిసివుందనటానికి కావల్సిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి.

అనంతపురం జిల్లాలో 25 జనావాసాల్ని బ్రూస్‌పుట్‌ బయటికి తీసినాడు. లత్తవరం కొండమీద పిండి విసరడాానికి వుపయోగించిన అనేక బండలు కనిపించినాయి. గింజల్ని నూరేందుకు అక్కడి ప్రజలు మంచి అందమయిన రంగుగల ఒక పిస్టసైట్‌ రాయి మీద ఎక్కువ మోజు చూపినారు. అక్కడికి కొంచెం దూరంలో కొండ కింద ఒక పొడవాటి రాతి బండ వుంది. దాని మీద , అరిగి, లొత్తబడి నునుపుదేరిన 14,15 పెద్ద గుట్టలున్నాయి. ఇక్కడ జనం ధాన్యం దంచుకుంటూ వుండి వుంటారు. (పుట్‌) కొండ మీద పెద్ద తిరుగలి రాళ్లు కనిపించినాయి. విడపనకల్లు కొండ మీద కత్తులు, ఉలులవంటివేగాక చెకుముకి రాయితో తయారు చేసిన పరికరాలు కూడా దొరికినాయి. ఈ గుట్ట మీద వెడల్పయిన పట్టాకత్తి, ఉలి, ఎర్రచెకుముకి రాతితో తయారు చేసిన వడిసెలరాయి, జాస్పర్‌ రాతితో చేసిన కోరం దొరికినాయి. తాడిపత్రి దేవాలయం వద్ద వన్నె చిన్నెలు గల మంచి రకం కుండ పెంకులు, నలుపు, పసుపు, ఎరుపు జాస్టర్‌ రాళ్ల పెద్ద పోగు కనిపించాయి. కలమెడెనూరు కొండ మీద నూతన శలాయుగపు జనావాసం కనిపించింది. ఇనుపు యుగం ప్రారంభమవుతున్న ఛాయలు అక్కడ కనిపించినాయి. అక్కడ లాంటి ఆయుధాలే వజ్రకరూరు, ఉరవకొండ, కరకుముక్కల, భోగసముద్రం, హావలిగెమిట్ట, ముచ్చుకొట, జంబులదిన్నె మిట్ట, ఎర్రగుడిమిట్ట, అనంతపురం పట్టణాలలో కూడా దొరికినాయి.

పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.

కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్‌లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్‌ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.

చదవండి :  కడప జిల్లాకు జగన్ హామీలు

అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్‌లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్‌లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది.

శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.

కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.

కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. “పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు” అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.

13వ శతాబ్దంలో మొదట్లో యదవసింగన పరిపాలన కాలం నాటి అనంతపురం జిల్లాలో వ్యవసాయదారుల సంఘం గురించిన సమాచారం వుంది. ఆ సంఘం పేరు ”చిత్రమేలి”. ఇది స్థానిక రైతులు ఏర్పరచుకున్న సంఘం. ఇటువంటి సంఘం ప్రసక్తి ఇక్కడ తప్ప మరెక్కడా కనబడదు. క్రీ.శ. 1136 నుండి 1650 వరకు అధికారంలో వున్న విజయనగర సామ్రాజ్యంలో రాయలసీమ ప్రాంతం ప్రముఖ పాత్ర వహించింది. విజయనగర రాజుల కాలంలో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందిందని ప్రతీతి. విజయనగర రాజులు అంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా వ్యవసాయాన్ని అభివృద్ది పరిచారు. నీటి పారుదల ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అనేక చెరువులు, కాల్వలు, ఆనకట్టలు కట్టించారు. ఆనాడు పళ్లు, పత్తి, చెరకు, కొబ్బరి, తమలపాకు, పోక, ధాన్యం, పప్పుదినుసులు, మొదలైన అనేక రకాల వ్యాపార పంటలు విస్తారంగా పండేటివి. విజయనగర కాలంలో1) నికొలాయే కాంటి-ఇటలీ-1420, 2)అబ్దుల్‌రజాక్‌ -పర్షియా-1422-45, 3) లుడోవికోడ్‌-వార్థేమా-ఇటలీ-1505-09, 4)దార్తే బార్బోసా-పోర్చుగీసు-1504-14,5)నన్నీజ్‌-పోర్చుగీసు-1535-37, 6) సీజర్‌ ఫ్రెడలి-కూవెన్నీస్‌-1563-67,7) ఫిలిప్పీ-ఇటలీ-1584-85, 8)సాస్పెట్టీ-ఇటలీ-1584-85, 9) పీజ్‌: మొదలయిన విదేశీయులు విస్తృతంగా పర్యటించి నాటి పరిపాలనను ఘనంగా కీర్తించారు. ఆనాటి రాజులే గాక రాణులు, ఉద్యోగులు అనేక చెరువులు కట్టించినట్టుగా ఆధారాలున్నవి.

1565లో తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానులు విజయం సాధించటంతో, విజయనగర రాజులు తమ రాజధానిని హంపీ నుండి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చుకున్నారు. యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓడినా, పూర్తిగా పతనం కాలేదు. బీజాపూర్, గోల్కొండ నవాబులు బలపడ్డారు. 1650లో వీరు పెనుగొండ మీద దాడిచేసి విజయనగర రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు. నవాబులు సరయిన ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు. రాజ్యం చిన్న చిన్న ప్రభువుల ఆధీనంలో వుండేది. 1677-78 ప్రాంతంలో శివాజీ పాలన కింద, తరువాత నిజాం ఆధిపత్యాన, తరువాత మైసూరు రాజ్యంలో హైదరాలీ కింద, 1792 ఒప్పందంతో నిజాం కిందికి వచ్చాయి. 1800 ఒప్పందంతో నిజాం సీడెడ్‌ జిల్లాలను తూర్పుఇండియా వారికి అప్పజెప్పాడు. రాయలసీమ ప్రాంతం ఆనాటి ప్రత్యేకత పాలెగాళ్ల వ్యవస్థ. విజయనగర సామ్రాజ్యంలో ఈ వ్యవస్థ ఏర్పడింది. విజయనగర పాలనా సౌలభ్యం కొరకు వివిధ ప్రాంతాలుగా విభజించి అధికారులను నియమించారు. పన్నులు వసూలు చేయటం, రక్షణ – కాపలాదార్లుగా వుండటం, రాజుకు అవసరమైన సైన్యాలను సమకూర్చటం వీరి బాధ్యత. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ వ్యవస్థ క్రమేణా దిగజారి అరాచక పరిస్థితి ఏర్పడింది. 18వ శతాబ్దంలో పాలెగాళ్లు నైజాం అధికారాన్ని మన్నించారు.

చదవండి :  'పోలి' గ్రామ చరిత్ర

కానీ అతని బలహీనతను కనిపెట్టి కప్పం చెల్లించటంలో నిర్లక్ష్యం చేస్తూ, నిజాం అధికారాన్ని వ్యతిరేకిస్తూ వుండినారు. సుమారు 80 మంది పాలెగాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించారు. సైనికచర్యలకు అవకాశం కల్పించిన ఈ ధిక్కారంను మొదట ఆదోనికి చెందిన చిన్న గ్రామాధికారి లేవదీసినాడు. కానీ ఇతను కంపెనీ సైన్యం చేతిలో ఓడిపోయాడు. 1803లో కడపలో సుల్తాన్‌ఖాన్‌, చిత్తూరులో నాగేటి పాలెగాళ్ళ తిరుగుబాట్లు జరిగాయి. నాటి ప్రభుత్వం వీరిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. పాలెగాళ్ళ అరాచక పాలన వల్ల ప్రజలు బాగా చితికిపోయారు. సాంఘిక జీవితం అల్లకల్లోలమయింది. భద్రత కరువయింది. అనేకమంది దోపిడిగాండ్రుగా తయారయినారు. ఈ పరిస్థితి రాయలసీమలో విస్తృతంగా వుండేది. ఈ దోపిడి గాండ్రనే ప్రజలు దివిటి దొంగలు అని పిలిచేవారు. కుమ్మరి గుండోళ్లని కూడా కొన్ని ప్రాంతాలలో అని అనేవారు. దత్త మండలాల మొదటి కలెక్టర్‌ థామస్‌ మన్రో వీరిలో కొందరిని లొంగదీసుకున్నాడు. మరి కొందరిని అణచివేసాడు.

విజయనగర రాజుల కాలం నుండి బ్రిటీషు వారి ఆధీనంలోకి వచ్చేంతవరకు ఈ ప్రాంతంలో భూసంబంధాలలో గాని, పంటల విధానంలో గాని, నీటిపారుదలలో గాని, ఎటువంటి మార్పులు లేక పోవటంవల్ల, కరువు కాటకాదులకు గురయి తీవ్రంగా చితికి పోయింది. తూర్పు ఇండియా కంపెనీ వ్యాపారసంస్థ. దీని ఆధీనంలోకి రాయలసీమ జిల్లాలు వచ్చాయి. ఈ కంపెనీకి వ్యాపారం తప్ప మరో ధ్యాస లేదు. తమ బొక్కసం నింపుకోవటమే ప్రధానలక్ష్యం. భూమి మీద విపరీతంగా పన్నులు విధించారు. జమీందారి విధానం ప్రవేశపెట్టడంతో రైతాంగం బాగా చితికి పోయింది. కరువు కాటకాలు వచ్చిన ప్రతీసారి వేలాదిమంది చనిపోయారు. కంపెనీ గుత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి గ్రామాన్ని గ్రామ పెద్దకు గుత్తకు ఇస్తుంది. అతను ఆ గ్రామానికి విధించిన గుత్తను కంపెనీకి చెల్లించాలి. ఈ గుత్త విపరీతంగా వుండేది. థామస్‌ మన్రో రాయలసీమలో రైత్వారీ పద్ధతిని అమలు చేయాలనుకుంటే కంపెనీ డైరెక్టర్లు వ్యతిరేకించారు. గ్రామ గుత్త పద్ధతినే అమలు చేయవలసి వచ్చింది. దీనివల్ల రైతులు గ్రామాలను వదలి వెళ్లి పోయేవారు.

1820లో మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా నియమించబడిన తర్వాత రాయలసీమలో రైత్వారీ పద్ధతి శాశ్వతంగా అమల్లోకి వచ్చింది. రైత్వారీ విధానం అమలుచేయటంలో కంపెనీ అనుసరించిన పద్ధతుల వల్ల రైతాంగం బాగా దెబ్బతిన్నది. రైతులు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. కంపెనీ పరిపాలనా కాలంలో రైతాంగం పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. ”కంపెనీ పాలనకింద వున్న ప్రాంతాలలోని ప్రజల్లో దత్త మండలాల ప్రజలే కడుబీదవారు” (మన్రో). తూర్పు ఇండియా పరిపాలనలో రాయలసీమ నిత్య కరువు కాటకాదులకు నిలయంగా మారిపోయింది.రాయలసీమ రైతాంగ జీవితంలో కరువులు అంతర్భాగమైపోయాయి. 1870లలో కడప-కర్నూలు కాలువలను ప్రారంభించినా అనేక అవకతవకల వల్ల నిర్మాణం 1882 చివరినాటికి గాని పూర్తికాలేదు. ఈ కాల్వను ప్రధానంగా రవాణాకు వుద్దేశించటం వల్ల వ్యవసాయం ఆగిపోయింది. రాయలసీమ మరింత వెనుకబడిపోయింది. కరువు రాయలసీమ రైతాంగానికి జీవన్మరణ సమస్యగా తయారయింది. రాయలసీమ దక్షిణ భారతదేశంలో కరువు ప్రాంతంగా మారిపోయింది.

రాయలసీమ నామకరణం

ప్రస్తుతం రాయలసీమగా పిలువబడే ప్రాంతాలను 1800 ప్రాంతంలో నిజాం తూర్పు ఇండియా కంపెనీకి ఇవ్వటంతో అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సీడెడ్‌ ప్రాంతంగాను లేదా దత్త మండలాలుగాను వ్యవహరిస్తూ వచ్చినారు. దత్త మండలాలుగా పిలువబడుతూ వచ్చిన ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన చరిత్ర వుంది. నిజానికి తెలుగు ప్రజల మొదటి నివాస స్థానం ఈ ప్రాంతమేనని తెలియజెప్పే రుజువులు కూడా వున్నాయి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి హిరణ్యక రాష్ట్రమని, రేనాడు మహారాజువాడి అని పిలిచేవారు.

దీర్ఘకాలం ఈ ప్రాంతం విజయనగర రాజులు పాలన కింద వుండటం వల్ల ఈ ప్రాంతం రాయలసీమగా వ్యవహరింపబడుతూ వస్తుందనేవారు. నిజానికి ఈ ప్రాంతాన్ని ”రాయలసీమ”అని పిలిచిందెవరు? ఆ నామకరణం ఎప్పుడు ఎట్లా జరిగింది? ”రాయలసీమ” అనే పేరును బాగా ప్రచారంలో పెట్టిన వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కావటం వల్ల ఆయనే ఈ ప్రాంతానికి ”రాయలసీమ” అని నామకరణం చేసి వుంటారని అనుకుని నేను ఉదయంలో ఒక వ్యాసం రాసినాను. రాయలసీమ పేరు పెట్టింది చిలుకూరి నారాయణరావు గారని రుజువుల్తో అవధానం నాగరాజారావు గారు నా వ్యాసానికి ప్రతిగా ఉదయంలో రాసిన వ్యాసం చదివిన తర్వాత లోతులకెళ్ళి పరిశోధిస్తే చిలుకూరి నారాయణరావు గారే ఈ ప్రాంతానికి ”రాయలసీమ” అని పేరు పెట్టినట్లుగా తేలింది. 16,17 శతాబ్దాల్లో ఈ ప్రాంతం మట్ల సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. ఈ కాలంలో రాయబడిన ”అభిషిక్త రాఘవము” అనే ప్రబంధంలో ”రాయలసీమ” అనే పేరు ఉంది.

చదవండి :  పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము - లగిసెట్టి వెంకటరమణయ్య

”గాయకులశ్వరాయబల భానులు మట్ల అనంతరాజు కౌక్షేయక ధార ద్రెవ్విరని చెప్పె దరింతయ కాక వేలుపున్‌ రాయలసీమలోన చతురంగ బలంబుల తోడ వైరములే పాయక యున్న వారు సరిపాళెము వైచిన మట్ల జస్రమున్‌” అని ఆ పద్యం. ఈ పద్యం మట్లి అనంతరాజును వర్ణించే సందర్భములోనిది. ఇంత ప్రముఖంగా వున్న రాయలసీమ పేరు ఎందుకనో ఆ తర్వాత మరుగున పడిపోయింది. ఎందుకు, ఎట్లా మరుగున పడిపోయిందనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత రాజకీయంగా సంభవించిన ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రాంతం అనేక సంక్షోబాలకు గురయింది. 1792-99లలో టిప్పు సుల్తాను, తూర్పు ఇండియా కంపెనీ, నిజాం నవాబులు కలిసి చేసిన యుద్ద ఫలితంగా తంజావూరు రాజు పదవీచ్యుతుడయినాడు. అతని కింద వున్న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొంతభాగం తూర్పు ఇండియా కంపెనీ వశమైనాయి.

1800లలో కడప, కర్నూలు, అనంతపురం, మదనపల్లి తాలూకాలు కూడా బ్రిటీషు వారి ఆధీనంలోకి పోయినాయి. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని దత్తమండలం అని, సీడెడ్‌ జిల్లాలని వ్యవహరిస్తూ వస్తున్నారు. దేశంలో జాతీయాభిమానం రగులుతున్న రోజుల్లో తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులవి. అట్లాంటి సమయంలో రాజమహేంద్రవరం నుండి మహా మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారు ఉద్యోగ రీత్యా అనంతపురం వచ్చినారు. ఆయన వచ్చేనాటికి రాయలసీమ వాసుల్లో దత్త అనే మాట ఏవగింపు కలిగింది. ఆ పేరు బానిసత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. చిలుకూరి వారికి కూడా ఈ దత్త అనే పేరు వెగటుగా అనిపించింది. దత్త అనే పేరుతో 128 పంక్తుల్లో మంజరీ ద్విపదలో సీమ ఘనతను గానం చేసినారు.

దత్త నందురు నన్ను దత్త నెట్లగుదు
రిత్త స మాటలు చేత చిత్తముకలగె
ఇచ్చిన దెవ్వరో పుచ్చిన దెవరొ
పుచ్చుకొన్నట్టి యా పురుషులు నెవరొ
తురక బిడ్డం డిచ్చె దొరబిడ్డ పట్టె
అత్త సొమ్మును గొని యల్లుండు
దాన మమర జేసెనటన్న యట్లున్నదిది

అని ఎద్దేవా చేసినారు. సీమ ప్రాశస్త్యాన్ని కొనియాడారు…

ఆ రోజుల్లో రాయలసీమ వారు తమ హక్కులు, అవసరాల కోసం సంఘటితమవుతున్నారు. బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్న గుత్తి కేశవ పిళ్లైగారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తమ ప్రాంతానికి వచ్చే లాభమేమిటని ప్రశ్నించినారు. ఈ ప్రాంతపు నలుమూలలా రాయలసీమ అవసరాల గూర్చిన ఆలోచన మొదలయింది.

1928 నవంబరు 17,18 తేదీలలో నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. అప్పటికే రాయలసీమ వారి మనోభావాలను పసిగట్టిన కోస్తా ఆంధ్రులు మెళకువగా వ్యవహరిస్తున్నారు. 18వ తేదీన కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ప్రథమ దత్త మండల సమావేశం జరిగింది. ఈ సభలో చిలుకూరి నారాయణరావు గారు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఏం పేరు పెడితే బావుంటుందన్న చర్చ ఈ సభలోనే జరిగింది. చిలుకూరి వారు గబుక్కున ”రాయలసీమ” అన్నారు. సభలో పప్పూరి రామాచార్యుల వారిచేత ఒక తీర్మానం ప్రతిపాదింపజేసినారు. ఆ తీర్మానాన్ని సభ చేత ఆమోదింపజేసినది చిలుకూరివారే. ఆ పేరు రగులుకుంది. దావానలంలా వ్యాపించింది.

3-1-1946న చిలుకూరివారు ”మన రాయలసీమ భాషా సంపద” అనే అంశం మీద రేడియో ప్రసంగం చేస్తూ ‘రాయలసీమ’ అనే పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్టుగా చెప్పుకున్నారు. చిలుకూరి విషయానికి సంబంధించిన రుజువులు టేకుమళ్ల కామేశ్వరరావు గారి ‘నా వాఙ్మయ మిత్రులు’ అనే గ్రంథంలోను, 1948 నాటి మహోదయ వారపత్రికలోను ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రాయలసీమ నామకరణం చేసినవారు చిలుకూరి వారేనని తెలుస్తున్నది.

– భూమన్

భూమన్ గురించి

రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్ పూర్తిపేరు భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి. వీరి స్వస్థలం కడప జిల్లాలోని నందలూరు. 18వ ఏటనే చలం ప్రభావంతో వీరు కొంతకాలం తిరువన్నామలైలో గడిపారు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయాల పట్ల ఉత్తేజితులై ఎందరో ప్రగతిశీల నాయకులకు సన్నిహితులయ్యారు. 1970 లో విరసం సభ్యుడై ఆ సంస్థ బాధ్యుడిగా కూడా కొంతకాలం వ్యవహరించారు. ‘భారత చైనా మిత్రమండలి’లో కూడా ఉన్నారు. వీరి కవితలు “లే”, “విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా సంకలనాల్లోనూ, “రాయలసీమ” పత్రికలోనూ ప్రచురితం అయ్యాయి. 1974లో చిత్తూరు కుట్ర కేసులోనూ, 1975లో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) లోనూ అరెస్టు అయి జైలు నిర్భంధానికి గురయ్యారు. 1978లో జనసాహితి స్థాపక సభ్యులయ్యారు. 1984లో రాయలసీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు ఆ ఉద్యమ కార్యాచరణ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాయలసీమ గొంతుకగా వెలువడుతున్న “కదలిక” పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. రాయలసీమ ఉద్యమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సాగిన పాదయాత్ర బృందంలో ప్రముఖ భూమికను పోషించారు. 1990 లో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. (సౌజన్యం: పొద్దు)

ఇదీ చదవండి!

సీమపై వివక్ష

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: