చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి.

వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది.

“మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి.

తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు వెళ్తోంటే- అవి అరిచే అరుపులు వీధంతా ప్రతిధ్వనిస్తున్నాయి.

“ఇంగ రారాదబ్బీ! పాద్దుబోలే?” ఎదురుగా పంచలోంచి మా అమ్మ పిలుపు.

“ఆ… వస్తాండలే…” చెప్పాను.

“ఏం ఏసోబూ! మీరు మీరు ఏదోకటి మాట్లాడుకొని చెప్పండి మరి,” అరుగు ముందు నిల్చుని వున్న కొత్త మాలోల్ల నాయకునికేసి చూస్తూ అన్నాను.

“అట్టనేబ్బా! అందరం కల్సి మాట్లాడుకొని ఎట్టనోకట్ట సద్దుకొంటంలే మరి. ఏమ్మాట పొద్దున్నే వొచ్చి నీతో ‘సెపుతలే రెడ్డే!… వస్చం  సోమీ,” మెల్లగా అక్కణ్నించి కదిలాడు ఏసేబు. అతనితోటి మిగిలిన మాలలు కూడా అనుసరించారు. వాళ్లటు వెళ్లగానే అంతవరకు జరిగిన చర్చ మీద మావాళ్లు నమీక్ష మొదలెట్టారు.

“యీ మాలోల్ల పనే బాగుంది. అందరికీ మిద్దెలొస్చాండయి. తిన్నే తినకున్నే సల్లగా పడుండొచ్చు. మనమే… గుడిసెకు ఎక్కవా కొట్టానికి తక్కవా అయి సచ్చేది.” వేళ్లు చురక్కిమనేదాకా పీల్చి బీడీ ముక్కను
విసిరేస్తూ అన్నాడు గురన్న.

“గవర్నమెంటు ఇస్తాంది. వాల్లు తీసుకుంటాండ్రు మామా!” చెప్పాను.

“ఏం గవన్మెంటబ్బీ! ఓట్లకు అమ్ముడుబొయ్యేది.” కేకరించి ఉమ్మాడు? పులి సుబ్బన్న.

“వాల్లకన్నా హీనంగా బతికేటోల్లు మనోల్లలో లేరంటావా. యేటా దోవదప్పకుండా వచ్చే యీ కరవుల్తో నెత్తినిండా అప్పులమోత ఎక్కవై మన బతుకులు రోజురోజుకూ యిగిరిపోతాండయి. వాల్లకేం కూలి మారాజులు. రొండ్రూపాల బియ్యమొచ్చినాక ఒక్కరోజు కూలికిబోతే సాలు మూడ్రోజులు గోడకింద కూకున్నే జరిగిపోద్ది. వాల్లకంటే మన బతుకులేడ బాగుండాయబ్చీ! యీ గవన్మెంటోల్లకు బుద్దిలేదుగాని,” అన్నాడు, ఆవేదనతోటి ఆవేశం మిళితమైన స్వరంతో.

“నిజమే నిజమే. నుగంగా బతకాలంటే యిట్లా కూలికెన్నా బోవాల. అట్లా వుజ్జోగమన్నా సూసుకోవాల.” పక్కనే ఉన్న ఎంగన్న అందుకొన్నాడు.

“ఏమన్నాగానీ, మనకన్నా వాల్లే బాగా బతుకుతాన్రు.” సిద్దయ్య సిద్ధాంతీకరించాడు.

“మనమెంత యీనంగా బతికినా అదో అట్టా బొచ్చెదీస్కోని యిండ్లమ్మటి బోలేం గదా!” రంగన్న అనటంతో అందరి కళ్లూ అటుకేసి తిరిగాయి.

సత్తుపళ్లేన్ని చంకన బెట్టుకొని వీధిలైటు వెలుగులో పైవీధికెళ్తూ కన్పించింది మాల పొట్టక్క.

“యాడికో యీదెక్కి పోతాంది. వూరంతా దిరిగినాపెసిడెంటు ఇంటికాన్నే గాదూ దానికింత పిడ్స బుట్టేది,” గురన్న అన్నాడు.

“యీల్లింటికి దానికి అంత లంకె వుంది మరి. యీల్లమ్మ తన పాలి మిగిలిచ్చెయినా ఆ పొట్టదానికి పెడ్తది.”

నాకు వినబుద్ధిగాలేదు. ఆ సంభాషణ పొడగింపు భరించరానిదిగా వుంది. వాళ్ల మాటల్లో దాగున్న వ్యంగ్యం నాలో తగలరాని చోట తగిలి చురక్కిమనిపిస్తోంది.

ప్రెసిడెంటును అయినంత మాత్రాన నేను వాళ్ల ఎగతాళికి అందనంత ఎత్తులో ఏమీలేను. నిన్న మొన్నటి
దాకా నిరుద్యోగిగా వుండి ఈరోజు  ప్రెసిడెంటు అయిన వాణ్ని. నేనూ వాళ్లల్లో ఒకల్నే. కాదంటే- నా తండ్రి అహోరాత్రుల శ్రమ ఫలంగా అంతో యింతో వాళ్లకన్నా మంచి ఆర్థికస్థితి కలవాణ్ని.

వరసైన వాళ్ల ఎగతాళి భరించటం బరువే.

అందులోనూ పొట్టక్కతోటి మా కుటుంబానికున్న సంబంధాన్ని గురించిన ఎగతాళికి నేనసలు తట్టుకోలేను.

చిన్నప్పటిలా బహిరంగంగా గేలిచేయకున్నా, నర్మగర్భంగా వాళ్లు చేసే ఎగతాళి నా మర్మాల్లో నాటుకొంటోంది. అక్కడికీ నేను హుందాగా ప్రవర్తించటంతో అంతగా పేలటం లేదు.

పొట్టక్క సంగతి దాటవేసేందుకు రాబోయే ఎంపీ ఎలక్షన్ల సవాలెత్తాను.

దాని మీద చర్చ చాలాసేవు సాగింది.

అంతలో పొట్టక్క వూరంతా చుట్టి మాయింటి వద్దకు రావటం, ఆమె కోసమే కనిపెట్టుకున్నట్లు మా అమ్మ పప్పు బువ్వ పళ్లెంలో వేయటం, పొట్టక్క పంచ దిగి అరుగు ముందు నించే వెళ్లటం జరిగింది.

“నేన్జె ప్పలే…” గురన్న మల్తీ ఎత్తబోతున్నాడు ఆ విషయం.

“ఏమబ్బీ! ఇంగరా నాయనా,” మా అమ్మ పిలువు.

నాక్కొంత వూపిరి పీల్చుకున్నట్టయింది.

బువ్వదిని రాపోండి,” చెప్పాను అరుగు దిగుతూ, చర్చ కొనసాగకుండా ఆపుతూ.

పైపంచెలు దులుపుకొంటూ నాతోబాటు కొందరు కదిలారు.

మెల్లిగా ఇంట్లో కెళ్లాను. అమ్మ మీద అసహనంగా వుంది. భార్య మీద కోపంగా వుంది.

మౌనంగా స్నానం చేసి భోజనం అయిందనిపించాను.

తల్లితో చెబితే ఉపయోగం కన్పించేటట్టు లేదు.

అసలు- నాదొక సమస్యగా ఆమె అర్ధం చేసికొనేట్టు చిత్రించలేమోనని నా అనుమానం.

నాకు మాత్రం ఇదొక సమస్యగా యీ మధ్య కాలంలోనే గదా విస్తృతమైంది.

రెండు మూడుసార్లు ఇందిరకు చూచాయగా చెప్పి చూశాను. దీన్నంత తీవ్రమైన సమస్యగా ఆమె తీసికొన్నట్లు లేదు. అందుకే ఆమె మీద కోపం.

లేచి అలవాటుగా అరుగువద్ద కెల్తోంటే మంచమ్మీంచి నాన్న అన్నాడు. “రొవ్వొoత సేపు పురాణం సదివి చెబితేమబ్బీ! ఆ పోలుబొందులేని మాటల్లో పొద్దు బుచ్చకుంటే,” అని.

నేను విన్పించుకోనట్టుగా వెళ్లి అరుగుమీద కూచున్నాను. పంచాయతీ ప్రెసిడెంటును అయింతర్వాత రాత్రి పొద్దుబోయిందాకా అరుగు మీద యవ్వారం తప్పనిసరి బాధ్యత అయింది.

రాత్రి చర్చ సాంతం మాలోల్లకు రాబోతోన్న బిల్డింగుల గురించే సాగింది.

వాళ్లతోబాటు తమకు కూడా బిల్దింగులొచ్చే అవకాశమేదైనా వుందేమోనని రైతుల వెదుకులాట.

తమకు బిల్జింగులొచ్చే అవకాశం లేదని తెలిసేసరికి మాలోల్ల మీద కొంత యీర్ష్యలాంటిది వ్యక్తం చేశారు ఒకరిద్దరు రైతులు.

యవ్వారం ముగించి ఇంట్లోకెల్లి మంచినీళ్లు తాగి దొడ్లోకి నడిచేసరికి మంచమ్మీద కనుగూరికి వుంది ఇందిర.

నా స్పర్శ సోకగానే మెల్లిగా ఒక పక్కకు సర్దుకుంది.

“ఏం యవ్వారమబ్బా! సగిరబొద్దుదాకా. నాకీ దొడ్లో ఒక్కదాన్ని పండుకోవాలంటే ఎట్లనో వుంటది. బెన్నే వస్తేనేం?” అంది.

ఇప్పటిదాకా నిద్రబట్టలేదు కాబోలు. నేను వెల్లకిలా పడుకొని మౌనంగా నక్షత్రాల కేసి చూస్తున్నాను.

ఆమెను మందలించేందుకు లోలోపల అసహనపడుతున్నాను.

పొట్టక్కను గురించి హెచ్చరించేందుకు ఆవేశపడుతున్నాను.

ఆమె చేయి మెల్లగా నా ఎదల మీదకొచ్చింది.

దానితోటే తల కూడా వచ్చి కుదురుగా సర్దుకొంది.

నేనా అనుభూతికి ఓవైపు బలంగా ఆకర్షింపబడుతోన్నా రాయిలా వుండేందుకు విశ్వప్రయత్నం చేయసాగాను. కొద్దిక్షణాల్లో వూర్తిగా కరిగిపోవటం ఖాయమనే సంగతి అర్ధమై వెంటనే నోరు విప్పాను.

“రేపట్నుంచి ఆ పొట్టక్కను ఇంటికాడికి రానీగాకండ్రి.” చెప్పాను.

మోచేతుల్ని ఆపుగా నా ఎదల మీద తలపైకి లేపింది ఇందిర.

“అదేం కూలికి నాలికి వచ్చేదా? కావిలి గంతలుండేదా? రోజూ కూడు బెట్టి సాకుతాండ్రు.” కోపంగా అన్నాను.

ఆమె కళ్లల్లోని ఆశ్చర్యం నా కళ్ల మీద తళుక్కున మెరిసింది. పొట్టక్కను అట్లా సంబోధించటం నాలో సైతం ఒక మూల అపరాధభావంగా రగులుతోంది.

ఆమె మీది అసహనాన్ని నా నాలుక అంతకన్నా సున్నితంగా వెళ్లగక్కలేకపోయింది మరి.

“మా అమ్మకు నువ్వయినా చెప్పి ఆమె పీడ ఎట్టనోకట్ట వదిలించు,” చెప్పాను.

ఉపోద్ఘాతం అర్థంకాని విద్యార్ధినిలా నాకేసి చూసింది ఇందిర.

“మన పెళ్లయిన కొత్తలో నువ్వే సెబితివి. పొట్టక్కను రొవ్వొంత బాగా సూసుకోమని. ఇంటికాడి కొస్తే లేదనకుండా పంపమని?” ప్రశ్నార్ధకంగా ఆగింది.

సమాధానంకోసం చాలాసేపు నేను గుండె తడువుకోవలసి వచ్చింది. అంతలో ఆమె తల నా ఎద మీద
సున్నితంగా వాలింది.

చిన్నంబలి పొద్దయింది.

నోట్లో వేపపుల్ల ఆడిస్తూ తోట వద్ద నించి తిరిగి వస్తున్నాను. జ్యోతివాగులో దిగేసరికి ఏసేబు ఎదురయ్యేడు.

“నీ కోసమే వస్చాండ సోమీ!” అంటూ.

“మాట్లాడుకొన్నెరా?” అడిగాను.

“కుదర్లేదయ్యా!” వెనకే నడుస్తూ చెప్పాడు.

“ఏం?”

“ఆ నా కొడుకులు తావు సాల్దంటాండ్రు.”

“నిజంగా చాల్దా?”

“బిల్టింగులకు సరిపోద్ది. గొడ్డుగోదా కట్టేసుకోవాలంటేనే బరువు.”

కొద్దిసేపు మౌనం తర్వాత చెప్పాను, “నేను కనుక్కొంటాలే,” అని.

ఏసేబు ఆగి మిరపచేలకేసి సాగాడు, “గొర్రెపిల్లలకు ఆముదపు ఆకు కావాలంటూ.”

వాస్తవానికి ఏసేబు మావూరి వాడు కాడు.

మా మాలోల్ల చుట్టం.

అతనిలాంటి వాళ్లు పదిమంది దాకా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, కూలినాలి చేనుకొంటూ, విస్తారంగా
వ్యాపించి వున్న బరకభూముల్లో కొర్రో, అరికో పండించుకొంటూ బతుకుతున్నారు. నాలాటి పనిచేయలేని వాళ్ల భూముల్ని కోరుకు గుత్తకు చేసికొంటున్నారు.

ఇప్పుడు బిల్దింగులొచ్చేసరికి వాళ్లకు వూర్లో స్థలాలు తక్కువయ్యాయి. ఇంతదాకా తమ తావుల్లో గుడిసెలేసికోనిచ్చిన బంధువులు ఇప్పుడు లేచి పొమ్మంటున్నారు. ఈ తకరార్ల మధ్య వచ్చిన బిల్డింగుల్ని వదిలేనుకొంటారేమోనని నాక్కొంత ఆందోళన కలిగింది.

చదవండి :  పాలకంకుల శోకం (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వాళ్లకు నా హయాంలోనే పక్కాగృహాలు కట్టించాననే తృప్తికన్నా రాజకీయంగా వాల్లెప్పుడూ నావైపే వుండి
పోతారనే నమ్మకం నాకెక్కువ ఆనందాన్ని కలిగిస్తూ వుండేది.

అదిప్పుడు బీటలు వారటం పట్ల బాధగా వుంది.

ఇంటికెళ్లి ముఖం కడుక్కొని కడుపులో యింత పిడచ వేసికొని పంచలోకొచ్చేసరికి, “ఓయ్‌ దొరా!” అంటూ వచ్చాడు గురన్న.

అతని వెనక పులి సుబ్బన్న- ఎంగన్న, తిరిపేలయ్యలు వున్నారు.

అందరూ మంచాల మీద కూచున్న తర్వాత, “ఇంతకూ మిద్దెలు ఖాయమేనా ఓహోయ్‌?” అని అడిగాడు గురన్న

“ఆ… ఖాయమే,” చెప్పాను.

“ఎన్ని?”

“నలభై దాకా.”

“యిరవై యిండ్లోల్లే గదబ్బీ యీల్లంతా?” పులి సుబ్బన్న అడిగాడు ఆశ్చర్యంగా.

“పెద్ద కుటుంబాలున్నాయి గదా! ఏరుబొయ్యే వాళ్లకు కావొద్దూ!” చెప్పాను.

“అవున్లే. పుట్టిన పిల్లోడంతా యేరుబొయ్యేవోడే.” ఎంగన్న అన్నాడు.

“మనమివ్వుడేమీ అనుకోవావల్సిన పన్లే. మన పూర్వీకులకు బుద్దిలేదు,” బీడీ ముట్టించుకొంటూ
అన్నాడు పులి సుబ్బన్న.

“ఏమీ?”

“బుద్దున్నోల్లయితే మాలిండ్ల్డ ప్రక్కన వూరు గట్టుకొంటారా?” గయ్‌మన్నాడు. నాకు నవ్వొచ్చింది.

“ముందు మనోల్లే ఊరుగట్టారేమో?” అన్నాను.

“అట్టయితే మాలోల్లను వూర్లో యిండ్లేసుకోనిస్తరా?” అన్నాడు కోపంగా.

నిజమే. ప్రతి వూరికి మాలవాడ దూరంగా వుంటుంది. మా వూర్లోనే కలిసి వుంది.

పూర్వం మా బరుగొడ్ల కొట్టం హద్దుగా పడమటి వీధంతా మాలిండ్లేనట. నలభై యాభై ఇళ్లదాకా వుండేవట. వాళ్లంటే జంకుతూ వుండేవారట వూర్లోని గొల్లలు, కాపులంతా.

గత అర్ధ శతాబ్దంలో ఇక్కడి కరువు పరిస్థితులకు తట్టుకోలేక భద్రావతి మొదలైన ప్రాంతాలకు వలస  పోయారట మాలోల్లంతా.

వాళ్ల ఇంటి స్థలాల్లో రెండొంతుల దాకా గొల్లలు, కాపులు ఆక్రమించుకొని ఇండ్లేసుకొన్నారు. ఇప్పటి మాలిండ్లకు వూరికి అసలు తేడా లేకుండాపోయింది.

“యీన్నించి జూస్తే నీకేమనిపిస్తాందోయ్‌?” గురన్న అడిగాడు.

నేను పంచలోంచే మాలిండ్లకేసి చూపులెత్తాను.

ప్రతిరోజూ అప్రయత్నంగా కొన్ని వందలసార్లు చూస్తుంటాను. నాకేమీ అన్పించట్లేదు.

“ఆ గుడిసెలూ, ఆ కొట్టాలూ, ఆ పడిపోయిన గోడలూ… మాలోల్లకూ రైతులకూ ఏమన్నా వారా కనిపిస్చాందే?”

నిజమే. ఏమీ తేడా లేదు.

“ఆ మాలిండ్లన్నీ మిద్దెలయినాయనుకో. ఎట్టుంటదో ఒకసారి వూహజేసి సెప్పు.”

కొత్త చమత్కారమే.

“వెలిగే మాలిండ్ల మధ్య వెలవెలబోయే రైతుల గుడిసెలు.” అంటూ చెప్పవలసి వస్తుంది.

“ఎవుడన్నా సరైన కాపోడు వూర్లోకొచ్చి సూస్చే మానం బోద్దోయ్‌ మొగోడా!”

అయోమయంగా అతనికేసి చూశాను.

అతని ఉద్దేశ్యమేమిటో నాకర్థం కాలేదు.

“వాళ్లంతా మిద్దెల్లో. మనోల్లంతా బోదకొట్టాల్లో…పొద్నన్లేసినాన్నుంచీ సూస్చావుండాలంటే బాగుండదబ్బీ!”
తిరిపేలయ్య.

వాళ్ల ఉద్దేశ్యం నాకర్థమైంది.

“బిల్టింగులు శాంక్సనయినయ్‌. మనమేం చెయ్యలేం,” చెప్పాను.

“రాకుండా జెయ్యొద్దు. వూర్లో కట్టకుండా జెయ్యి సాలు,” ఎంగన్న.

“కొత్త మాలోల్లకు యీల్లెట్టా తావియ్యరు గదా! వాల్లను గాదని యీల్లు సొంతంగా కట్టుకోలేరు. అందర్నీ కలిసి పలుగురాళ్ల మిట్టన కట్టుకోమని సెప్పు.” గురన్న సలహా.

ఆలోచిస్తూ వుండిపోయాను.

మధ్యాహ్నం దొడ్లో మందార చెట్టు కింద వాలు కుర్చీలో కూచుని కళాపూర్ణోదయం చదువుతున్నాను.

కథ నడిపిన తీరు నన్నెంతో ముగ్దుణ్ణి చేస్తోంది.

ఊహించని మలుపులు. మలుపు మలుపుకూ ఒళ్లంతటికీ గగుర్పాటును అంటించే కుదుపులు.

పుస్తకాన్ని ఒళ్లో పెట్టుకొని అందులోని దృశ్యాల్ని సజీవంగా మనోఫలకం మీద గీసికొనేందుకు ప్రయత్నిస్తూ కళ్లు మూసికొని వెనక్కి వాలాను.

ఇంట్లో అమ్మ, ఇందిరా మాట్లాడుకొనే మాటలు అస్పష్టంగా వచ్చి నా చెవుల సోకేందుకు ప్రయత్నిస్తున్నాయి.

వాటిని నేను పట్టించుకోదల్చలేదు గాని, పొట్టక్క గురించిన మాట విన్పించేసరికి ఆనక్తిగా చెవులు రిక్కించాను.

“వాని మొగంలే. ప్రెసిడెంటు అయినాక వాని బుద్ధులు గూడా మారిపోతాండయి,” అమ్మ అంటోంది.

రాత్రి నేను చెప్పిన మాట చెవినేసింది కాబోలు ఇందిర.

“ఆ పొట్టదీ నేనూ సిన్నప్పట్నించీ సావాసగత్తెలం. ఇద్దరం కల్సి బరుగొడ్లకు పోతాంటిమి. అప్పుడు గూడా యింత లావు పొట్టేసుకుని తిరుగుతాండె. వాళ్లమ్మ బెట్టిన సగం ముద్ద సద్ది సంగటి దాని కడుపులో ఏ మూలకూ సాల్దు . నా సంగటి గూడా గుంజక తింటాండె. నేనెప్పుడన్నా మాయమ్మ మీంద అలిగి సంగటి తీసప్పోకుంటే దాని సగం ముద్దలోనే ఇద్దరం సర్దకపోతాంటిమి. ఆరోజు యింగ దాని అగసాట్లు సూడాల. సేలల్లో అలసందకాయలు, కందికాయలు పెరక్క తింటది. కంపసెట్లలో దూరి దోరదోర రేగ్గాయలు పీక్కతింటది. బచ్చటాయి గడ్డలు తొవ్వక తింటది. ఇంటికొచ్చేదాకా ఏదోకటి తింటానే వుంటది.”

చిన్నప్పుడు తెలిసో తెలియకో చేసిన పనుల్ని ఆమె గొప్పగా చెప్పుకోవటం నాకు సహించకుండా వుంది.

కోడలు- తన మేనగోడలే కాబట్టి సరిపోయింది గాని, ఎవరైనా పరాయిపిల్లయి వుంటే- మాలోల్ల సంగటి
తిన్నందుకు ఆమెను ఎంతగా అనహ్యాంచుకొని వుండేదో!

“అది లేకుంటే యీడేడ వుండాడనీ! యీడు పుట్టడం ఆకలితోనే పుట్టిండు. బూమ్మీద పన్నేల నుంచీ ఒకటే ఏడుపు. నాకాడ పాల్లేవు. బరుగొడ్డు పాలు వొంటలే. ఆడికీ ఆవును పట్టకొచ్చిండు మీ మామ. అయ్యీ కుదర్లే. ఇప్పుడేల అప్పుడేం పాలపొడి డబ్బాలున్నెయా? పాడా?.. ఆ యమ్మను యీ యమ్మను ఎన్రోజులని బంగపడాల. యీని ఏడుపు ఆపాలంటే నా సేతగాలే. ఆ కాలానికి దేవతాల యీ పొట్టదే అడ్డు
పడింది. వాళ్ల పిల్లోనికి సంగటో సారకో పెట్టుకొని యీనికి పాలిచ్చింది.. యీడు యింతోడయ్యేదాకా పొట్టక్కను సూస్చేసాలు ఎగురుకుంటా పొయ్యి వొల్లో పడేవోడు.”

చనుబాలు

ఏ విషయాన్ని గురించయితే నేను మధన పడుతున్నానో- దాన్నే ఆమె కెలికి కంపుజేస్తోంది.

రాజకీయంగా ఎదిగి, సంఘంలో గుర్తింపు పొందింతర్వాత, ఆర్థికంగా అంత గొప్ప స్థితిలో లేకున్నా నా చదువును చూసో, పదవిని చూసో పదిమంది ‘పెద్దరెడ్ల సరసన నాకూ స్థానం కేటాయించిన తరువాత-

నా బాల్యం నన్ను వెంటాడే దయ్యమైంది.

నాకీ సమస్య చిన్నప్పటి నుంచీ వుంది.

అప్పుడింత మేధోపరంగా వుండేది కాదు.

గిరిలో వున్న బొంగరాన్ని గురిజూసి కాలెత్తి నా బొంగరంలో గుమ్మగొడితే రెండుగా విచ్చి గిరికి అటు ఇటు చెక్కలయ్యేది. తోటి పిల్లలంతా సంతోషంతో చప్పట్లు కొట్టేవాళ్లేగాని, బొంగరం పోగొట్టుకొన్న వాడు మాత్రం గుర్రుగా, “యీడేం మనపాల్దాగిండా? మాలోల్ల పాల్టాగిందాన అంత బలం,” అనేవాడు.

దాంతో పిల్లల చప్పట్ల మధ్య వాడి మీద నేను కలబడటం, ఇంటికొచ్చి మా నాన్న చేత దెబ్బల్టినటం
మామూలైంది.

బడిలో తోటి పిల్లల్ని కొట్టినప్పుడు సైతం ఇదే మాట.

ఒకసారి తోటకాడ మడవ కోసం గలభా జరిగి అవతల వాళ్లు ఇద్దరు కలిసి ముల్లు గరల్తో మా నాన్న మీద దాడి చేసిన సమయంలో నేను ఒడుపుగా ఒకని చేతిలో కర్ర లాక్కుని ఇద్దర్నీ చావబాదినప్పుడు వాళ్ల
ఆడాళ్ల నోళ్లలోంచి కూడా యివే మాటలు.

అమ్మ సైతం అదే మాట, “పొట్టక్క పాలు తాగి పెరిగానని.”

ఒక్కోసారి అన్పిస్తుంది, “నాకీ పెరుగుదల లేకున్నా బావుండే’దని.

పై చదువుల కోనం వూరు విడిచింతర్వాత సమన్య చాలావరకు మాసిపోయినట్లే అన్పించింది. ఊరి వాళ్లతో మునుపటిలా గాఢంగా కలవకపోవడం వల్ల ఆ విషయం ఎదుటికి వచ్చేది కాదు.

చదువైనాక ఉద్యోగానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి అనుకోకుండా వచ్చిన పెళ్ళి ప్రయత్నం ఫలించటం, మేనమామ కూతురే నా పెళ్లాం కావటం. నా నిరుద్యోగానికి కొంత పని కల్పించినట్లయింది.

నేను వూర్లో మొదటి గ్రాడ్యుయేట్‌ననే అహం వల్లనయితేనేం, ధనవంతుడైన మామ దొరికాడనే గర్వం వల్లనయితేనేం, కోరుకు గుత్తకు యిచ్చి కూచున్నా కుటుంబ పోషణకు ఇబ్బంది కలిగించని భూములున్నాయనే తృప్తి వల్లనయితేనేం- ఊర్లో మనుషుల్లో పెద్దగా పూసుకు తిరగను కాబట్టి ఆ మధ్యకాలంలో పొట్టక్క సమస్య నన్ను స్పృశించలేదు.

పొలం పనులు చేయలేక, ఇంటికాడ వూరకే వుండబుద్ధి కాక రాజకీయాల్లోకి దిగింతర్వాత మనుషుల్లో కలిసిపోక తప్పలేదు.

అదో- అప్పుడు తిరగదోడడం మొదలైంది యీ సమస్య.

ఎన్నికలయ్యేదాకా వాళ్ల ఎగతాళిని నేను చిరునవ్వుతో స్వీకరించేందుకే ప్రయత్నించానుగాని, పంచా యతీ ప్రెసిడెంటును అయింతర్వాత భరించలేకపోతున్నాను.

అయితే వాళ్లు కూడా నా చిన్నప్పటిలా సూటిగా గేలిచేయటం లేదుగాని, పొట్టక్క కన్చించినప్పడు మాత్రం వరసైన వాళ్లు చలిస్తున్నారు. నా హుందాతనాన్ని సైతం దాటుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నోటితో అనకున్నా వాళ్ల కళ్లల్లోని పరివాన కిరణాలు నా ఒళ్లంతా గొంగళివురుగులై ఉలులమంటాయి.

నా గెలుపుకోసం తన పరిధిలో అహర్నిశలూ శ్రమించిన పొట్టక్క కృషిని గుర్తు చేయటంలో కూడా వ్యంగ్యమే.

అందుకే యీమధ్య కాలంలో ఆమెను చూస్తే చాలు – నిండా రొచ్చులో మునిగిన నా ఆకారం నాకు మదికొస్తుంది.

చిలుమెక్కిన వొళ్లు, చింపిరితల, చిరుగుల చీరతో అసహ్యంగా వున్న ఆమె ఒడిలో నా బాల్యం గడవటం నాకు భరించరాని స్మృతిగా వుంది.

చదవండి :  జుట్టుమామ (కథ) - ఎం.వి.రమణారెడ్డి

చెమటతో తడిసి, ఉప్పుర్లి, చారికలు గట్టిన ఆమె రవికను చూడటంతోనే నా ఒళ్లు జలదరిస్తుంది. నా ముఖం నిండా చెమట కంపు దట్టించినట్టుగా అన్పించి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతాను.

ఆమె నా కళ్ల ముందు కన్పిస్తూ వుంటే నాకీ అగచాట్లు తప్పవు.

ఆలోచించసాగాను.

ఉదయం పులి సుబ్బన్న బృందం చేసిన ప్రతిపాదన గుర్తొచ్చింది.

ఆలోచించే కొద్దీ నా సమస్యకు పరిష్కారం అందులోనే దొరుకుతున్నట్టుగా గోచరించింది.

అవును… ఆమె నాకు దూరమైతే చాలు.

మాలిండ్లన్నీ మిట్టమీదకు మారితే ఆమె నీడ కూడా ఇక్కడ సోగదు గదా!

హుషారుగా లేచి పుస్తకాన్ని గూట్లో పెడుతోంటే అమ్మ అంది, “ఏమబ్బీ! గడ్డి వామేయించవా? కల్లానికి కంపేయకుండా అట్టనే బెడ్తవా?” అని.

“రెండు మూడు రోజుల్లో అయిపిస్తాలే,” చెబుతూ బైటకొచ్చాను.

మధ్యాహ్నం కాబట్టి పులిజూదం, బారు కట్టలతో అరుగు మోగిపోతోంది. పులిజూద౦ వద్దనున్న పులి సుబ్బన్నను పక్కకు పిల్చి విషయం చెప్పాను. ఆయన అటు వెళ్లగానే నేను పులిజూదం వద్దకు నడిచాను.

పొద్దుగూకే నమయాన పులి సుబ్బన్న నావద్దకొచ్చాడు గురన్నను వెంటేనుకొని.

“కుదరదంటాండ్రబ్బీ! మిట్టకు బొయ్యేందుకు కొత్త మాలోల్లు ఎప్పుడెప్పుడా అని సంకలు ఎగేస్చండ్రు గాని, పాతోల్లు వొవ్పుకోడంలే. ‘రైతుల్నిడ్చి పెడ్తే మేమెట్టా బతకాల?’ అంటాండ్రు. “ఉప్పో, పప్పో, సద్ది సంగటో, ఊరిమిండో అడక్కొచ్చుకొని బతికేటోల్లం. మేము సచ్చినా వూరిడ్స్చం’ అంటాండ్రు.” చెప్పాడు.

నా ఆశలు తుస్సున జారాయి. నమస్య మళ్లీ జటిలమైంది. పొట్టక్క బాధ నన్నొదిలేట్టు లేదు.

రాత్రి ఏసేబు అరుగు వద్ద కొచ్చాడు.

“కుదరదంటాండ్రా వాల్లు. మీరే ఎట్టనోకట్ట బతిమాలుకోగూడదండ్రా!” గురన్న చెప్పాడు.

“యినడం లేదయ్యా!” బాధపడ్డాడు ఏసేబు.

“తోటిమాలోల్లం, వూరిడ్చివొచ్చినోల్లం, రొవ్వొంతన్నా మా మీంద కనికెరం లేదయ్యా నా కొడకలకు.” అన్నాడు.

“వాల్లకు తెలిసిరాలేదుగాని- మిట్టమీంద మీకు శాన సుగంగా వుంటదిరా!” గురన్న అందుకొన్నాడు.

“యీడ బారెడు బారెడు గుడిసెల్లో, రొచ్చు బురదల్లో పొల్లేడే దానికన్నా మిట్టమీంద కావలసినంత తావుంది. హాయిగా బతకొచ్చు. నెలరోజులు జడిబట్టినా కాలికి బురదంటదు. బన్సు మార్గం దగ్గెర. నన్నడుగుతే యిది నరకం అది సొర్గంరా!

“నిజమేగదూ మరి!” ఏసేబు తలూపాడు.

“అయ్యన్నీ ఎట్టన్నాయే. రైతులిండ్లల్లో మాలోల్లం కలిసుండాలంటే యాడయిద్దెబ్బా? – యీల్లు బుద్దిలేక వుండారుగానీ, మీరు దోవన వస్చాంటరు. పోతాంటరు. మేం మంచాల మీంద నీలుక్కోని కూకుంటే బాగుంటదే? అట్టని మాటి మాటికి లెయ్యాలంటే మా పొగుర్నాకొడకలకు వొల్లోంగుతదే? అందుకే మీకు దూరంగుంటే గౌరవముంటది. అయ్యా అన్నే ఒరే అన్నే తగినట్టుంటది.” చెప్పాడు ఏసేబు.

అతని మాట మా వాళ్లందరికీ నచ్చినట్టుంది.

***** ‘చనుబాలు’ నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథ – www.kadapa.info  ****

“అవ్‌ అవ్‌… నీ నడతకూ వాల్ల నడతకూ యాడ సమ్మందం. తొలీత నుంచీ సూస్చానే వుండాం. నీకతే యేరు. నీ తెలివి వాల్లకేడ వస్చది,” ఎంగన్న మెచ్చుకోలు.

“నేను పెద్ద రెడ్ల కాడ మెలిగినోన్నయ్యా! లోకం సూసినోన్ని, యీనా కొడకలకేందెల్సు.” ఏసేబు వివరణ.

ఏసేబు మాటల్లోని నిజాన్ని గురించి నాకు అనుమానమే. అక్కడి రెడ్ల చేత దెబ్బల్తిని చెల్లకనే ఇక్కడికొచ్చాడని జనుల వాడుక.

తమకు స్థలాలివ్వని పాత మాలోల్ల మీద రైతులకు చెడు అభిప్రాయాన్ని కలిగించేందుకు అతను ప్రయత్నిస్తూ ఉన్నట్లుంది.

నేనేమీ కలుగజేసికోలేదు.

రాత్రి అమ్మకు చెప్పాను వామేసేందుకు ముగ్గురు కూలోల్లను పిలవమని. ఉదయమే లేచి కూలోల్లను వెంటేసుకొని కళ్లంలోకెళ్లాను.

పొట్టక్క కొడుకుతోటి ఇద్దరు కాపోల్లు వున్నారు పనికొచ్చిన వాళ్లలో. లావుపాటి గుండ్రాళ్ల మీద పండె కొయ్యల్ని పేర్చి రెండు బండ్ల జొన్నచొప్ప వొడ్డేసరికి అంబలి పొద్దయింది.

పైటేలకంతా వామి బాగా ఎత్తుకు లేచింది.

మంచి హుషారు మీద పన్చేస్తున్నారు కూలీలు.

పొట్టక్క కొడుకు వామ్మీద వున్నాడు.

మనిషి బక్కగా టీబీ పేషంట్‌లా వున్నా- వాడు మంచి ఏటుగాడు.

పొట్టక్క మీది స్మృతులకు తావివ్వకుండా, కోపు యాస లేకుండా వామి పెరిగేందుకు కింద నుంచి సూచనలిస్తూ పన్జేయించుకొంటున్నాను.

వామి పెరిగేకొద్దీ దగ్గరున్న ఎండుగడ్డి అయిపోయి కుప్పలు దూరమయ్యాయి.

మోపుల్ని ఎగేసేందుకు కూడా బరువై చిలక్కట్టె ఉపయోగించాల్సి వచ్చింది.

మోపు గట్టటం, మోయటం ఇద్దరి చేతుల్నిండా పనవటంతో, తలకు గుడ్డ చుట్టి చిలక్కట్టె అందుకొని ఎగేయటం ప్రారంభించాను.

బరిగి, రాగి, కొర్ర, అరికె చెత్తల్తోబాటు సెనక్కట్టె కూడా కలిసి పొరలు పొరలుగా పేరుకొని వామిగా రూపెత్తుతోంది.

ఎండ పొడ సోకకుండా వున్న చింతకొమ్మల నీడ కింద మేము హుషారుగా పన్జేస్తున్స సమయంలో సింగరప్ప వచ్చాడు ప్రకాశాన్ని తోడేసుకొని.

“నేనెగేస్చతేబ్బా!” అంటూ ప్రకాశం నా చేతిలోని చిలక్కట్టె అందుకొన్నాడు.

తలకు చుట్టుకొన్న టవల్‌ విప్పి వొళ్లు విదిల్చికొని, కడవలో నీల్లొoచుకు తాగి ఒక రాతి మీద కూచున్న
నా వద్దకొచ్చాడు సింగరప్ప.

“ఏంది కత?” నవ్వుతూ అడిగాను.

“ఏముంది సోమీ! ఎట్టనో కట్ట ఆ మిద్దెలొచ్చేట్టు సూడు. బీద నాకొడకలం,” దీనంగా అన్నాడు.

“మీకు బిల్డింగులు కట్టించాలనే నేనింత ప్రయత్నం చేసేదీ,” చెప్పాను. “వాళ్లకు మీరు తావియ్యక పోతిరి. వాళ్లతోబాటు వూరిడ్చి మిట్టకు పోమంటిరి. మధ్యన నేనేం జెయ్యాల?”

నా ఎదురుగా గొంతుక్కూచ్చున్నాడు అతను.

“మిమ్మల్నిడ్సి పెట్టి మేమేడ బతకాల? మిట్ట మీంద యిండ్లేసుకొంటే మానాకొడుకులు పనికొస్చరా రెడ్డీ! అదిలిచ్చే వాల్లులేక- పనీబాటల్జెయ్యకుండా. పెండ్లాల కూలిగింజల్లో సారాయి తాగి తాగి నాశినమై పోరూ యీడ వూర్లో వుండబట్టీ, పొద్దున్లేసినాన్నుంచీ మీ మొగాలు సూడబట్టీ కూటికి గుడ్డకు యిబ్బంది లేకుండాంగాని వూరిడిస్చే బతుకుతామా సోమీ! సుట్టు పక్కల మాల మాదిగోల్ల బతుకు సూస్చాండం గదా!
అబ్బబ్బ… వూరిడ్సే మాట ఎత్తగాకు రెడ్డీ!” అన్నాడు.

తదేకంగా అతనికేసి చూశాను నేను.

నిజమే… ఊర్లో ఉండటం గుండా చుట్టపక్కల మాల మాదిగల్లాగా వీళ్లు సోమరిపోతులయ్యేందుకు వీల్లేకపోయింది. వీళ్లు గోడకింద కూచోబోయినా రైతులు కూచోనివ్వరు. రెక్కబట్టుకు పొలాల్లోకి లాక్కుపోతారు.

“మరి… కొత్త మాలోల్ల సంగతేందోయ్‌? వాళ్లు మిమ్మల్నే నమ్ముకొన్నేరు గదా!” అన్నాను.

“వాల్లకూ మాకూ ఏమి లంకె రెడ్డే?”

నాకాశ్చర్యమేసింది.

“మీవాళ్లే గదా!” అన్నాను.

గట్టిగా వూపిరి పీల్చి వదిలాడు సింగరప్ప.

“ఆ నాకొడుకులకేం? యియ్యాల యీడుంటరు. రేపు యింగోసోటికి బోతరు. ఆ ఏసేబుగాడయితే యిప్పుటికి రొండూర్లు మారిండు. రొండూర్ల కాడ వానికి గవన్నమెంటోల్లు మిద్దెలు గట్టిచ్చిన్రు. బూమిలిచ్చిన్రు. బోర్లేయించిన్రు. ఎద్దుల్చిన్రు.” గట్టిగా చెప్పాడు.

“అవన్నీ ఎక్కడికెళ్లాయ్‌?” వింతగా వుంది నాకు.

“కడుపులోకే…” అభినయిస్తూ చెప్పాడు.

“అవ్‌ రెడ్డే! ఎద్దల్ను కోసక తిన్నెరు. బండ్లమ్ముకొన్నిరు. బోరులో మోటారమ్ముకొని లోపల పడిపోయిందని ఆఫీనర్లకు జెప్పిన్రు. వూరిడ్సినాంక మిద్దె దంతెలు, వాకిండ్లు గూడా పీకి అమ్ముకొన్నెరు. యీడ గూడా అదే
పని బట్టాలని సూస్చాన్రు.”

ఆ కఠోర సత్యం నన్ను కొంతసేపు కుదిపింది. “వాడెప్పుడూ ఎవుని ఎంగిలిదిని బతుకుదామా అనే సోమీ.” సింగరప్ప అన్నాడు.

ఎంగిలి అనేసరికి నాకు వామ్మీది ఏటుగాడు గుర్తొచ్చాడు.

పుట్టగోచి బెట్టి వామ్మీద హుషారుగా కదల్తున్నాడు. ఒళ్లంతా మట్టి పేరుకొని పుళ్ల శరీరంతో,అస్థి పంజరంలా వున్న పొట్టక్క కొడుకునే చూస్తోంటే- వాడి ఎంగిలి పాలు తాగి పెరిగాననే విషయం నా వెన్నెముక వెంట అసహ్యపు జలదరింపై పాకుతోంది. రాజకీయపు హోదా, చదువిచ్చిన విజ్ఞానం, సంఘంలో గౌరవం అన్నీ కలిసి ఉచ్చ్భస్థితిలో వున్న నేను, వాని దృష్టిలో ఎంత తక్కువ స్థాయిలో వుంటానో వూహించుకొనేసరికి అక్కడ నిలబడ బుద్ది గాలేదు.

నా సమస్త దశలు ఎంగిలి అయినట్లు సిగ్గేస్తోంది. సింగరప్పతో కలిసి వూర్లోకి నడిచాను. చీకటిపడేసరికి వామేసి ఎంట్లు గట్టి వచ్చారు కూలీలు.

రాత్రి ఏసేబు అరుగు వద్ద కలిశాడు. సింగరప్ప ఆరోపణల గురించి ఆరా తీశాను.

“అవ్‌ రెడ్డీ! ఆ బూముల్లో తుమ్మ కట్టెల్దప్ప ఏమీ పెరగవు. పాపిస్టి సవుటి బూములు… మిద్దెలిచ్చిన్రు. తుమ్మ కట్టెలు గాల్చి బొగ్గుల్జే సి అమ్ముకొని ఆ మిద్దెల్లో యింత గంజిగాసుకొని బతుకుతాంటిమి… అంతలోనే సవిటి బూములకు పట్టాలిచ్చిరి. బోర్లిలిచ్చిరి. ఎద్దులిచ్చిరి. బండ్లిచ్చిరి. దాంతో మేమూ రైతులమని సంకలు గుద్దుకొంటిమి. కట్టెలు గొట్టడం మాని బూములు సాగు జెయ్యబోతిమి. సవిట్లో ఏం బండుతాయ్‌? మొల్చిన మొలకంతా ఎర్రబడి సావబట్టె. బోర్లు, బండ్లు, ఎద్దుల్జూసి అప్పులిచ్చిన మారాజులొచ్చి మెడల మీంద కూకుండ్రి. ఇంగేజెయ్యాల సోమీ! ఎద్దలమ్మినం. బండ్లమ్మినం. బోర్లమ్మినం… ఆ వూర్లిడ్సినం…” చెప్పాడు.

చదవండి :  సన్నపురెడ్డి నవల 'కొండపొలం'కు తానా బహుమతి

“లెక్క. శానా మిగిలిండాల్నే మరి?” ఎంగన్న ప్రశ్న.

“యాడుందెయ్యా? మాకెవురిస్చరు? ఎద్దులు బండి ఎరువుల బాకీకి సెల్లుబడె. ముప్పయేలమ్మే మోటారు దొంగదెనీ, అదెనీ యిదెనీ ఒక పెద్ద రెడ్డి ఐదేలు సేతబెట్టె. అది తిండి గింజలకూ, గుడ్డల బాకీకి సెల్లుబాయె. ఇంగ మిగిలిందేంది సోమీ?” అన్నాడు.

వాళ్ల సమన్య ఏంజేసేందుకు నాకు అర్థంకాలేదు. నలభై మిద్దెలూ వూర్లోకనే శాంక్షనయ్యాయి. వీల్ళిట్లే కొట్లాడ్తూ వుంటే కాన్సిలవుతాయి.

మిట్టమీద కొన్నీ, ఇక్కడ కొన్నిగా విడగొట్టాలంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లక తప్పదు. అందుకు రైతుల నించి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇంకొన్ని రోజులు గడిస్తే వాళ్లే ఏదోకటి పరిష్కరించుకోకపోరు.

మావూరి మాలల స్థితిగతుల్ని గురించీ, వూర్లో వాళ్ల స్థానాన్ని గురించీ, రైతులకూ వాళ్లకూ మధ్యనున్న సంబంధాల్ని గురించీ- దళితుల జీవన విధానంపై అధ్యయనం చేస్తున్న నా హైదరాబాదు మిత్రుడికి రాసిన లేఖకు సమాధానం వచ్చింది.

మంచి విశ్లేషణతో చక్కగా ఉంది ఉత్తరం.

మొదటి లైనులోనే రాశాడు, “వాల్లెట్టి పరిస్థితిలోనూ వూరు విడవరని”.

వాళ్లు సాంఘికంగా నమానత్వం కోసం చూన్తున్నారుట.

ఇప్పటికే వూర్లో ముక్కాలు భాగం కాపులకు గొల్లలకు- వాళ్లు మంచాలు దిగి- చూపే గౌరవం మాసిపోయింది కాబట్టి “ఒరే తరి” అనే పిలుపుల్లో చాలావరకు పేర్లు చోటు చేసికొన్నాయి కాబట్టి.

అందరి పిల్లలూ ఒకేచోట చదువుకోవటంతో వాళ్ల మధ్య తిట్టకోవడాలూ, కొట్టుకోవడాలూ, ఆటలూ, పిలుపులూ కులాలకతీతంగా జరుగుతున్నాయి కాబట్టి.

అన్నిటికంటే ముఖ్యమైంది- “అవి మాలిండ్లని” వేలెత్తి చూపే అవకాశం లేదు గాబట్టీ.

తము పూజారులయినా, వురోహితులయినా, బ్రాహ్మణులకు ఈనాటి రెడ్లు ఏమాత్రం గౌరవమిస్తన్నారో చూస్తున్నారు కాబట్టి.

తొందరలో తాము గ్రామంలోని మిగతా కులాలతోటి కలిసిపోతామనే నమ్మకముంది గాబట్టి.

వాళ్లు ఊరు వదలి మిట్టమీదకు వెళ్లరని రాశాడు.

ఇందులో నిజమెన్ని పాల్లో నేను తర్కించదలచుకోలేదుగాని, నా సమన్యకు పరిష్కారాన్ని గురించి మథనపడుతున్నాను.

సింగరప్పను పిల్చి అడిగాను చివరగా, “వూరు విడిచే ఆలోచనలు ఏమైనా వున్నాయా?” అని.

“మిట్టమీద అయితేనే మిద్దెలొస్చా యనే మాత్తరమయితే మాకా మిద్దెలొద్దు. ఏమొద్దు. కొత్తమాలోల్లకే యియ్యండి. మిమ్మల్నిడ్సి మేం పోలేము,” అన్నాడు.

నా సమన్య తిరిగి మొదటికొచ్చింది.

పొట్టక్కను ఇంటికాడికి రానీకుండా వుండటమే తాత్కాలిక పరిష్కారంగా తోస్తోంది.

ఇందిరకు మళ్లీ చెప్పాను. అమ్మతో గట్టిగా మాట్లాడమని కూడా వేడుకొన్నాను.

మధ్యాహ్నం దొడ్లో వున్న నా వద్దకు అమ్మ విసురుగా వచ్చింది. “ఎవురొరే నిన్ను ఎగతాళి చేసే నా బట్టలు?” అంటూ.

నేను బిత్తరపోయాను ఆమె తీవ్రత చూసి.

“మాల్దయితేనేం? అది మనిసిగాదూ! ఆర్సుకోని ఆర్సుకోని బరుగొడ్డు పాల్దాగుతరే. అంతకన్నా యీనమైందా అది? ఎవురో సెవుల్దెగిన్నాబట్టలు యేందో అంటాండరని నువ్వు బాధపడ్తే ఎట్ట?” అంది.

“అదిగాదు మా…” వివరించబోయాను.

“కొడుకును కంటానే అమ్మయిద్దే? పాలిచ్చి బతికిచ్చుకొంటే అమ్మయిద్ది గాని. ఆ పొట్టది లేకుంటే నేను
అమ్మనుగాదు. ఆడదాన్ని గూడా కాదొరే. నాకున్నె వొంకర దానిగుండా తీర్చుకొన్నె. నిన్ను బతికిచ్చుకొన్నె,
అది నాపాలి దేవతరా!” అంటూ ఇంట్లోకెల్లింది.

ఏదో ఆవేశం పూనినట్టు రావటం, పోవటం.

పొట్టక్కను దూరం చేసేది లేదని భయంగా సూచించటం.

ఆమె హృదయం నాకర్థమైంది.

నేను కాదనటం లేదు.

కాలాలు మారాయి గదా!

ఇప్పుడు జీవితాలకు మేధోపరమైన ప్రాధాన్యత ప్రధానమైంది. సున్నితమైన వ్యంగ్యాన్ని కూడా భరించ లేని స్థితిలో ఉంది. అనవసర త్యాగాలకూ, జీవితాంతం రుణపడి వుండే బంధాలకూ మనస్సు కట్టుబడి వుండటం ఇప్పుడు అనాగరీకమైంది.

ఆమె చేసిన సహాయానికి అమ్మానాన్నలు ధనరూపంలోనో, వస్తురూపంలోనో రుణం చెల్లేసి వుండొచ్చు కదా!

నేనిట్లా ఎంతకాలమని మానసిక క్షోభ అనుభవించాలి? ఆలోచిస్తూ ఉండిపోయాను.

“అమ్మా నాన్నలు చేయలేని పని నేనే చేస్తే?”

మెదడులో మొలకిత్తిన ఆలోచన క్రమంగా బలం  పుంజుకోసాగింది. కొంత మూల్యం చెల్లించయినా పొట్టక్కను ఇంటి వద్దకు రానీకుండా చేయాలనుకొన్నాను.

మూడు గంటల ప్రాంతంలో లేచి మా కళ్లంలోకి వెళ్లాను. కంప అవతలే పొట్టక్క ఇల్లు.

ఈ సమయంలో ఆమె కొడుకు, కోడలు కూలి పనికి వెళ్లుంటారు. పిలుద్దామనుకొనేసరికి ఏవో మాటలు విన్పించి ఆగిపోయాను.

ఏవేవో పొద్దుబోని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్లు. అవతలి మనిషి వెళ్లిపోతుందేమోనని నిరీక్షించసాగాను. కొంతసేపటికి వాళ్ల మాటల్లో విషయం మారింది.

నాకు ఆసక్తిగా అన్పించింది.

“యాడ జూపియ్యాలక్కా! ఏ డాకటేరు కాడికి పొయ్యినా సేటెడు సేటెడు మందులు రాయిస్చరు. వాటెకు లెక్కేడ దేవాల?” పొట్టక్క గొంతు.

చనుబాలు“డాకటేరు కాడికెందుకూ? వానికేందో గాలి సోకింది. మూడు ఆదివారాలు అంకాలమ్మ కాడికి తీసప్పో.” అవతలి గొంతు సలహా.

“గాలి గాదు దూలిగాదులే. సిన్నప్పుట్నించీ వాని బతుకంతే. యాడాదిలోపల పిల్లోనెప్పుడే పాలియ్యకుండా ఎండగట్టి సంగటి బెట్టినా అప్పుట్నుంచి పురెక్కలే”

“నీ కాడ పాలున్నెయేయోనే?”

“ఉన్నయ్‌… మా ‘సెన్నమ్మ తల్లికాడ పాల్లేక, పిల్లోడు సావు బతుకుల్లో వుంటే… ఆయనకిచ్చి సాకినా.”

“ఎవరూ? మన పెసిలెంటుకేనా?” అవతలి గొంతులో ఆశ్చర్యం.

“ఆ.”

“నీ కొడుకును ఎండగట్టే?”

“ఆ… సెన్నమ్మా నేను సిన్నప్పుట్పుంచీ పానానికి పానంగా వున్నేం. ఆమెకాడ పాల్లేక పసరపు పాలొంటక,
పాలిచ్చే వోల్లు దొరక్క పిల్లోడు ఆకల్తో గొంతు బూడిపోయేదాకా ఏడుస్చాండె. ఆమె మొగునికి ఏం జేసే దానికి దిక్కుదెలక ఆమెను గొనగబట్టె. నా కండ్ల ముందరే ఆమె సంసారానికి ముప్పొచ్చె. నా పిల్లోని పక్కా జూస్చి. పాల్లేకున్నే సంగడి తిని పానాలు నిలబెట్టుకొనే కాడుండె. అందుకే… యీని ఎండగట్టి ఆయన్ను
బతికిచ్చుకొన్నె”

నా కపాలంలో ఏదో పెఠీల్మని పగిలినట్లుగా అన్పించింది.

చింతచెట్టు మొదలుకి నేనో చింతమొద్దులా ఆనుకొని నిల్చుండిపోయాను.

నన్ను చూడగానే పొట్టక్క కళ్లలోంచి జాలువారే అంతులేని వాత్సల్యధార గుర్తుకొచ్చింది.

ఆమె కడుపు పట్ల మా అమ్మ చూపే ఆదరణ జ్ఞప్తికొచ్చింది. నా ఉన్నతి పట్ల వాళ్లిద్దరూ పడే ఆతృత మది కొచ్చింది.

ఆలోచించేకొద్దీ నా యీ హోదాకూ, జ్ఞానానికి మూలాలు నేననుకొంటోన్నవేమీ కావేమో అని కూడా అన్పిస్తోంది.

అప్పుడప్పుడూ అమ్మానాన్నలు పశ్చాత్తాపపడుతున్నట్లుగా చెప్పే మాటల్ని బట్టి నేను పెరిగేందుకు ఆమె చనుబాలే కాకుండా వాళ్లల్లోంచి మరేదో స్వీకరించినట్టుగా కూడా అర్ధమవుతోంది.

మా నాన్న హయామంతా పాట్టక్క కుటుంబం మా యింటి మాలోల్లుగా రెక్కలు ముక్కలు చేసుకోవటం.

నేను ఆరు చదివేందుకు నర్సాపురం ప్రయాణమైతే, నాతోటి ఐదు చదివిన పొట్టక్క కొడుకు మా యింట్లో బరుగొడ్ల కాపరిగా చేరటం.

నా చదువైపోయి ఇంటికొచ్చేదాకా మా నాన్నతో కలిసి వాడు అహర్నిశలూ మా పొలాల్లో శ్రమించటం.

అన్నీ గుర్తుకొచ్చేసరికి నా విజ్ఞానపు పరిధి కూడా తెలిసి వస్తోంది.

రైతుల్తోబాటు మాలోల్లకు కూడా బరకో, మెరకో కొంత భూమి ఉంది.

స్వల్పంగా వున్న వాళ్ల భూములు సాగుజేయబడకుండా రైతుల భూములే ఎందుకు పండించబడుతున్నాయో?

నాలుగేళ్లు కరువొచ్చేనరికి కేవలం మాలలే వూరిడిచి వలస పోవలసిన పరిస్టితి ఎందుకొచ్చిందో నాకిప్పుడు బాగా అర్ధమవుతోంది.

చనుబాలు తాగినందుకే సిగ్గుబడుతోన్నవాణ్ని – వాళ్ల జీవన మూలాల్త్లోంచి అస్తిత్వాన్ని పొందినందుకు
నేనింక ఎంత ఖేదపడాలి! చనుబాలకు ప్రతిఫలంగ ఆమెకు డబ్బునో, వస్తువులనో ఇవ్వగలను గాని వాళ్ల శ్రమను చనుబాలుగా తాగి పెంచుకొన్న నా చదువుకూ, విజ్ఞానానికీ, రాజకీయ హోదాకు, ఆస్తులకూ ప్రతిఫలంగా ఆ కుటుంబానికి నేనేమివ్వ గలను?

ఎగతాళి చేసేవాళ్లకు యీ విషయం తెలిస్తే తమ వ్యంగ్యానికి యింత పెద్ద రాశుల్లో వస్తువు దొరికినందుకు ఎగిరి గంతేస్తారు కాబోలు.

అయినా- నా అమాయకత్వం గానీ- ఏ అగ్రకులస్థుడు మాత్రం వాళ్ల చనుబాలు తాగకుండా ఇప్పుడుండే స్థాయికి ఎదిగాడని!

(సాహిత్య నేత్రం జన్మదిన ప్రత్యేక సంచిక – జూన్‌ 1996)

సన్నపురెడ్డి గురించి

సన్నపురెడ్డి పుట్టిందీ, పెరిగిందీ , ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నదీ – కడప జిల్లా, కలసపాడు మండలం బాలరాజుపల్లెలో – కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు. వీరి ‘పాలెగత్తె’ స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో – ‘చినుకుల సవ్వడి’ చతుర నవలపోటీలో ప్రథమ బహుమతిని సాధించాయి. వీరి తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందింది.2006 ఆటా పోటీలలో వీరి నవల తోలుబొమ్మలాట  ప్రథమ బహుమతి పొందింది.

ఇదీ చదవండి!

నేను - తను

నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: