గంజికుంట

చీకటి మాటున గంజికుంట సీమ చరిత్ర

ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట కేంద్ర స్థానంగా వెలుగొందింది.

పేరు వెనుక కథ :

గంజికుంట అగ్రహారం ఆ రోజుల్లో ఆధ్యాత్మిక విద్యాకేంద్రంగా వెలుగొందింది . తిరుమల, శిద్దవటం ప్రాంతాలనుండి నల్లమల కొండల దారిగుండా అహోబిలం క్షేత్రానికి వెళ్ళే యాత్రీకులకు వెలమ దొరలు పెద్ద ఎత్తున అన్నదానం చేసేవారు. ఆ అన్నం వార్చిన గంజి కాలువలై పారి కుంటగా మారడంతో ఆ ప్రాంతానికి గంజికుంట అనేపేరు వచ్చినట్లు స్థానిక చరిత్రవల్ల తెలుస్తోంది.

చదవండి :  తితిదే పాలకమండలి సభ్యుడిగా పుట్టా సుధాకర్

ఆలయాలు

గంజికుంట

గంజికుంటలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన చెన్నకేశవ, ఆంజనేయ , వీరభద్ర ఆలయాలతో కూడిన దేవాలయానికి ఏంతో చారిత్రిక విశిష్టత ఉంది. ఆలయంలోని చెన్నకేశవ, లక్ష్మీదేవి విగ్రహాలు ప్రసన్నతతో భక్తులకు ఆధ్యాత్మిక భావనను , మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నట్లుగా ఉన్నాయి. చేన్నకేశవ ఆలయ గర్భగుడికి పైకప్పులేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత . చెన్నకేశవ ఆలయానికి ఉత్తరదిశగా గంభీరమైన వీరభద్రస్వామి విగ్రహం ఉంది. ఆలయ ప్రాకారానికి నైరుతీదిశలో ఆంజనేయస్వామి ఆలయం, భక్తులకు కోసం నూతనంగా దాతలు నిర్మించిన వసతి సత్రం ఉన్నాయి. ఆంజనేయ విగ్రహం భక్తులకు అభయమిచ్చే కటాక్ష రూపంతో అలలారుతోంది.

చదవండి :  రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!

గంజికుంటఆలయప్రాంగణంలో పురాతన విఘ్నేశ్వర, నాగదేవతల విగ్రహాలు, ధ్వజస్తంభం ఆలయ ప్రాచీనతకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. విజయనగర రాజులు ఈ దేవాలయానికి వేద బ్రాహ్మణులను అర్చకులుగా నియమించి ఆగ్రహారాన్ని ఏర్పాటు చేసారు. ఆ అగ్రహారానికి భూములను మాన్యంగా ఇచ్చారు. ఆలయ సముదాయంలో తవ్విన బావి అందమైన కటకంతో శిల్పాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. బావిలో ఏనుగు, సర్పము , శృంగార శిల్పాలున్నాయి.

ఈ ఆలయానికి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం కూడా మహిమాన్వితమైనదిగా స్థానిక ప్రజలు విశ్వసిస్తారు . గంజికుంట, నల్లపురెడ్డిపల్లె, లెక్కలవారిపల్లె గ్రామాల ప్రజలు ఈ ఆలయాలలో పూజలు చేస్తూ ఉన్నారు. ప్రఖ్యాత భైరవకోన క్షేత్రం ఈ గంజికుంట సీమలోనే ఉండటం విశేషం . ఇంతటి విశిష్టత కలిగిన గంజికుంట సీమ చరిత్రపై మరింతలోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. ఆలయానికి సంబంధించిన మాన్యం భూములపై సరైన ఆదాయం వసూలు చేసి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

చదవండి :  ప్రొద్దుటూరు కోడెద్దులు రంకేసి బండ లాగితే...

గంజికుంట

–  తవ్వా ఓబుల్ రెడ్డి

మొబైల్ : +91-9440024471

ఇదీ చదవండి!

పిచ్చుకలకు

ఆధునిక సాంకేతికతే పిచ్చుకలకు శాపం

మారుతున్న ప్రజల జీవన విధానాలే మనుషుల్లో ఒకటిగా బతుకుతున్న పిచ్చుకలు కనుమరుగయ్యేలా చేస్తున్నాయని, జీవ వైవిధ్యానికీ , పర్యావరణ సమతుల్యానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: