
అనంతపురం గంగమ్మ దేవళం
గంగమ్మను దర్శించుకున్న నేతలు
అనంతపురం: గంగమ్మ జాతరలో గురువారం నేతల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకోడానికి నాయకులు తరలిరావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు జరిపించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
జాతర సందర్భంగా అనంతపురం గంగమ్మను న్యాయమూర్తులు దర్శించుకున్నారు. లక్కిరెడ్డిపల్లె న్యాయమూర్తి చెంగల్‌రాయనాయుడు, రాయచోటి క్యాంపు కోర్టు న్యాయమూర్తి శైలజ, విశ్రాంత న్యాయమూర్తి రామచంద్రారెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు. పోలీసు అధికారులు, ఆలయ సిబ్బంది వారితో పూజలు జరిపించి, అమ్మవారి కుంకుమ, తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వారు అసహనానికి గురయ్యారు.
పులివెందుల ఏఎస్పీ అంబురాజన్, ఇతర పోలీసు అధికారులు, జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీఐపీ పాసులను ఎక్కువగా జారీచేశారు. వీరిని దేవాదాయశాఖ పర్యవేక్షకులు రమణమ్మ, ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి, కమిటీ మాజీ ఛైర్మన్ టి.కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచు రామకృష్ణలు ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలను అందచేశారు.