
మా పిల్లోల్లకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాల
చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక
అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగుతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు
సోమవారం అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో విద్యార్థి సంఘ నాయకులు క్రిష్ణానాయక్, ప్రతాప్‌రెడిలప్డై జరిగిన దాడిని నిరసిస్తూ రాయలసీమకు చెందిన వివిధ సంఘాల నేతృత్వంలో మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయం దగ్గర నిరసన దీక్ష చేసినారు. ఈ నిరసన దీక్షకు హాజరై సంఘీబావం తెలిపిన బైరెడ్డి మాట్లాడుతూ…
ప్రత్యేక హోదా దీక్ష పేరుతో రాయలసీమ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. . సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ ప్రత్యేక హోదాపై చర్చకు రావాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో రాయలసీమ ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా నాయకులు పొద్దుపోక ‘ప్రత్యేక హోదా’ దీక్షలు చేస్తున్నారన్నారు. సీపీఐ ప్రత్యేక హోదా డ్రామా మాని రాయలసీమ రాష్ట్రం కావాలని కోరుకోవాలన్నారు. కోస్తా వాళ్ళతో కలిసి ఉన్నంత వరకు మనకు రాష్ట్రం రాదన్నారు.
దీక్షకు హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ… దాడికి ప్రోత్సహించిన చలసాని, శివాజీలతో పాటు దాడికి కారణమైన వామపక్షాల నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపైన ఎవరు దాడి చేసినా సహించబోమన్నారు. కోస్తా వాళ్ళ ప్రయోజనాల కోసం సీమను పావుగా వాడుకుంటే సహించేది లేదన్నారు.
కార్యక్రమంలో నాగార్జునరెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ దశరథరామిరెడ్డి, విరసం తరపున అరుణ్, బాలసుందరం, రాయలసీమ మహాసభ తరపున రచయిత అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున మల్లెల భాస్కర్, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం తరపున అశోక్, రాధారావు తదితరులు మరియు పలువురు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.