ఒంటిమిట్ట కల్యాణోత్సవం

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వైభోగం

ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది.

ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా శిల్పకళా శోభితమైన కళ్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. వేదికపైన రజిత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఆసీనులను చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేసి కళ్యాణతంతుకు శ్రీకారం చుట్టారు. స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చొండబెట్టి కన్యావరణలు జరిపించారు. మోక్షబంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యగ్నోపవీత ధారణం చేశారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. ఆ సమయంలో ఒంటిమిట్ట కోదండరామాలయ విశిష్టత, వైకుంఠరాముని ప్రాశస్త్యం, సీతారామ కళ్యాణ వైభోగాలను వ్యాఖ్యాన రూపంలో భక్తులకు వివరించారు. బంగారు ఆభరణాలను సీతారాములకు అలంకరించి సకలోపచారలు చేశారు. మధుపర్కప్రాశన అనంతరం లోక క్షేమం కోసం మహాసంకల్పం పఠించి కన్యదానం, గోదానం, భూదానం చేయించారు. సీతమ్మకు, రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టకం చదివారు. మంగళవాయిద్యాలు.. వేదపండితుల చతుర్వేద మంత్రోచ్చారణలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య శుభముహూర్తాన సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరీదేవి, సరస్వతి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆవాహన చేసి మంగళసూత్రానికి పూజ చేశారు. మంగళసూత్రధారణ అనంతరం ముత్యాల తలంబ్రాలు, కళ్యాణమూర్తుల శిరస్సులపై పోసి కన్నుల పండువగా కళ్యాణం జరిపారు. నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది.

చదవండి :  ఏప్రిల్‌ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు

గవర్నర్‌, ముఖ్యమంత్రి తదితరులు స్వామివారి ముందు కూర్చోగా, వీవీఐపీలు, వీఐపీలు వేర్వేరుగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం  తితిదేలో విలీనమైన తర్వాత చేస్తున్న ఈ తొలి కార్యక్రమాన్ని తితిదే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేడుకగా నిర్వహించింది.

ఒంటిమిట్ట కల్యాణోత్సవం
పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు వస్తున్న గవర్నర్

సాధారణ భక్తులు కూడా దగ్గరగా కల్యాణవేడుకను చూసేందుకు వీలుగా కల్యాణ వేదిక ప్రాంగణంలో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి. కల్యాణ వేదికను వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో అలంకరించారు.

చదవండి :  మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ముత్యాల తలంబ్రాలు

గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీరామచంద్రుడు, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు కంకణాలు, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను అందజేశారు.

ఆనవాయితీ

రూ.28 లక్షల విలువైన ఆభరణాలను తితిదే అధికారులు గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా స్వామివారికి బహుమతిగా సమర్పించారు. తితిదేకు చెందిన ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించినపుడు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ఒంటిమిట్ట కోదండరామునికి తితిదే వారి బహుమతి
ఒంటిమిట్ట కోదండరామునికి తితిదే వారి బహుమతి ఇదే

ఈ వేడుకలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, మంత్రులు మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు,  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, తితిదే పాలకవర్గసభ్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌, తితిదే ఈవో సాంబశివరావు, కలెక్టర్‌ కేవీ రమణ, పలువురు తెదేపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

చదవండి :  సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: