
కోదండరాముడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్న గవర్నర్ దంపతులు
వైభవంగా కోదండరాముడి పెళ్లి ఉత్సవం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

తితిదే తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన ఎదుర్కోలు సన్నివేశం భక్తులను అలరించింది.
సీతారాముల విగ్రహాల శిరస్సులపై జీలకర్ర బెల్లం పెట్టి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. సరిగ్గా రాత్రి 8.15 గంటలకు ఉత్తరా నక్షత్రాన కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. సీతారాముల వారి తరపున వేద పండితులు సీతమ్మ తల్లికి మాంగల్యధారణ గావించారు.
ఒంటిమిట్ట యాత్రికులతో నిండిపోయింది. కల్యాణోత్సవానికి మంత్రులు మాణిక్యాలరావు, సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
సీతారాములు రథంపై శుక్రవారం తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.