
కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి
చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా
వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న//
వాడెవడో నిజాముగాడు
మననమ్మెనంట తెల్లోనికి
ఇంకెవడో ఖద్దరోడు
ముక్కలుగా నరికెనంట.
అరవ నాడులో చేతులు
కన్నడ దేశాన తలా
మొండెమే మనమిప్పుడు
వంచించ బడిన బిడ్డలం //చర్న//
రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార
ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము రండి
సరహద్దుల గీతగీచి -మాసంస్కృతినే చంపినారు
కుటుంబాన్ని విడగొట్టి- కుర్చిలాట ఆడినారు //చర్న//
లేవండీ కదలండీ- చలిచీమల దండులాగ
పాముల పన్నాగాలా- పడగనీడ వదలండి
విడిపోయిన సీమజాతి-కలిపేసే కలలుగంటు
“కొత్తసీమ” ఆయుధంతో వీరులార పోరండి //చర్న//