కుప్పకట్లు (కథ) – బత్తుల ప్రసాద్

తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడ్సుకుంటా వచ్చాడు నారయ్య.

ఆ మనిషి కండ్లు మసక మసగ్గా కనపడ్తాండయి.

సొగం దూరం వచ్చాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపిచ్చింది. మెల్లగ నడ్సుకుంటా జిల్లేడు శెట్టుకాడికి పొయినాడు. శెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క ఆకు అరశెయ్యంత ఉంది. తెల్లగా శెట్టు నిగనిగలాడతా ఉంది. ఒక ఆకు తుంచినాడు. పాలు జలజల కారినాయి. ఆకు నుండి కారతాన్నె జిల్లేడు పాలను రెండు కండ్లలో పోసుకొని కాసేపు కండ్లు మూసి తెర్సినాడు నారయ్య.

కండ్లు ఒక్క రవ్వ తెరప తెరపగా కనపడినయి. మనసులోనే ఈ వైద్యం జెప్పిన అవదాన్లయ్యకు దండం పెట్టుకున్నాడు నారయ్య. కాసేపు ఆడనే దంతె శెట్టు వుంటే దాన్నీడన కూకోని, బీడి ఎలిగిచ్చి కాసేపటికి కలసపాడు తట్టు ఎల్లబారినాడు.

నారయ్యది తెల్లబాడు, మాలోల్ల మనిషి. శిన్నతనం నుండి నల్లమల కొండకు పొయి కట్టెలు కొట్టుకోని, వాటిని నెత్తిన పెట్టుకోని, కలసపాడుకు తెచ్చి కోంటోళ్లకు అమ్మి, కొనుక్కున్న వాళ్ల ఇంటిముందే గొడ్డేలితో నరికి కువ్వజేసి, ఆ దాంతో వచ్చిన లెక్కతో బతుకుతాంటడు. పెండ్లాం పిల్లోళ్లు వాళ్లు కూడా కూలినాలి జేసుకుండేటోల్లే. నారయ్యకు యాభై ఏండ్లు పైబన్నయి. కంటిసూపు ఒక్కరవ్వ తగ్గడం తిరుక్కున్నెది.

kuppakatuluదాంతో కొండకు పొయి కట్టెలు కట్టడం ఒక్కరవ్వ ఇబ్బంది అయింది. దాంతో రోజూ అవదాన్లయ్య ఇంటికాడికి పొయి కంటిసూపు తగ్గుతాంది సామి అని జెప్పుకుంటా వుంటే… ఆయన ఏదో మందులియ్యడం, అది తగ్గకపోడంతో… ఓ రోజు మళ్లా పొయినాడు నారయ్య. అవదాన్లయ్య బో శెతురు మనిషి. కండ్లు కనపడ్డం లేదు అంటే శెతురుగా జిల్లేడుపాలు పొడ్సుకో పో అనంటే, నారయ్య అవదాన్లయ్య మీద నమ్మకంతో ఆ పని జేసినాడు అమాయకంగా.

సగిలేరు దాటి కలసపాడులో మంగలిండ్ల పక్కనుండి అవదాన్లయ్య ఇంటికి శేరుకున్నాడు. అవదాండ్లయ్య ఇంటికాడ ఎప్పుడూ జనం తిరనాల ఉన్నెట్టు ఉంటారు. ఇప్పుడు గూడా అట్టనే ఉండారు. అవదాన్లయ్యకాడికి పోదామంటే జనం శానామంది ఉండడంతో కుదరకపాయ. అట్టనే తెల్లబాడుకు పొయినాడు. నారయ్య రెండు మూడు రోజులు పొయి, ఆ జిల్లేడుపాలు పొడ్సుకుండార్క కండ్లు బాగా కనపడ్డం తిరుక్కున్నెయి. నారయ్య అబ్బ నా కండ్లు బాగయినాయి, అవదాన్లయ్యకు కాళ్లు మొక్కి రావాలని మనసులో గట్టిగ అనుకున్నాడు.

ఆ రోజు అవదాన్లయ్య ఇంటికాడ జనం తక్కువే ఉండారు. నారయ్య అవదాన్లయ్య ఇంటి అరుగుమింద కూచ్చున్నాడు. ఒక్కొక్కరే లోపలికి పొయి, అవదాన్లయ్యతో సూపిచ్చుకోని బయటికి వచ్చాండారు. నారయ్య వంతు వచ్చే లోపలికి పోయినాడు. లోపల ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు, టీచర్లు, సావాసగాళ్లు కూచ్చోని ఉండారు. నారయ్య లోపలికి పొయి అవదాన్లయ్య కాళ్లు మొక్కినాడు.

‘ఏంటికిరా నా కాళ్లు మొక్కితివి’

‘ఏందయ్యా, నువ్వు నాకు దేవుడితో సమానం. నువ్వు జెప్పిన వైద్యం జేసుకుంటే కండ్లు తేటగా కనపడ్తాండయి. అందుకని నీ కాళ్లు మొక్కితే తప్పుగాదు’.

అవదాన్లయ్య ఈనికి నేనేమి వైద్యం శెప్పినానబ్బ అని కాసేపు ఆలోశన జేసి, ‘ఇంతకు ఏమి వైద్యం శెప్పినానురా’ అనడిగినాడు. ‘అదేంది సోమీ, వారం కిందట నీకాడికి వచ్చి కండ్లు మసకలు మసకలుగా కనపడ్తాండాయి సోమి అనంటే… పొయి జిల్లేడుపాలు పోసుకో పోరా అని జెప్తివి మరిసిపోతివా’ అని నారయ్య జెప్తా వుంటే అవదాన్లయ్య నోరెళ్లబెట్టి సూచ్చాండడు.

‘ఏందిరా నిజ్జంగా జిల్లేడుపాలు కండ్లల్లో పొడ్సుకున్నెవా’ అన్నడు అవదాన్లయ్య. ‘అవును సోమీ, నాలుగు రోజులు వర్సగ జిల్లేడుపాలు కండ్లలో పొడ్సుకుంటే కండ్లు బాగా కనపడ్తాండయి’ అని చెప్పినాడు.

అవదాన్లయ్యకు మతికి వచ్చింది. శెతురుకు జిల్లేడుపాలు పొడ్సుకో పోరా అన్నెడు. వాడది నిజమేననుకొని పొడ్సుకున్నడు. మరి జిల్లేడుపాలు కంట్లో పడితే కండ్లు పోతయి. ఈడేం దానికి అడ్డంగా జెప్తాండాడు అనుకొని ‘కాదురా, జిల్లేడుపాలు పొడ్సుకుంటే కండ్లు పోతయిరా. నీకు కండ్లు తేటగా ఎట్ట కనపడ్తాండాయి’ అనడిగినాడు అవదాన్లయ్య.

‘లేదు సోమి, నువ్వు శెప్పినావు. నేనట్టనే జేచ్చి’ అన్నడు. అవదాన్లయ్య ఆలోశన్లో పన్నాడు. కాసేపుటికి తేరుకొని ‘పా. నువ్వు పొడుసుకున్నె జిల్లేడు శెట్టును జూపిజ్జువుగాని’ అని కుర్చీలో నుండి లేసి నిలబడినాడు. ఆయనతో పాటు ఉన్నె నలుగురైదుగురు మనుసులు కూడా లేసి నిలబడిరి. నారయ్యతో కల్సి అందరూ తెల్లబాడు దావన నడ్సడం తిరుక్కుండిరి.

అవదాన్లయ్య పూర్తి పేరు అవధాన్ల వెంకట సుబ్బయ్య. నియోగ బాపనాయన. వైద్యశాస్త్రి అని ఆయనకు బిరుదు. పది సంవత్సరాల వయసు నుండే వాళ్లమ్మ లక్ష్మమ్మ కాన్నుండి వైద్యం నేర్చుకున్నాడు. తెల్లబాడు గురివిరెడ్డి వాళ్లమ్మకు బాగాలేకుంటే, రాత్రిపూట ఆ ఊర్నుండి కలసపాడుకు మనుసులు వచ్చి లక్ష్మమ్మకు ఇట్టిట్ట ఉంది అని చెపితే, ఆమె మందులు కట్టిచ్చి పదేండ్ల అవదాన్లయ్యతో ఇచ్చి పంపింది. ఆ మందులకు గురివిరెడ్డి వాళ్లమ్మ తిరుక్కున్నెది. దాంతో అవదాన్లయ్య అస్తవాసి మంచిదని అందరూ శెప్పుకోడం తిరుక్కుండిరి. మామూలు వైద్యుడుగాదు.

ఎక్కడెక్కన్నుండో… దూరాబారమైనా బండ్లు గట్టుకొనొచ్చి ఆయనకాడ వైద్యం జేపిచ్చుకొని పోతాంటరు. ఎట్టాటి రోగమైనా అవదాన్లయ్య శెయ్యి పడితే, అంతే పారిపోతది. గద్వాల్ మారానికి ఎందో రోగమొచ్చే అవదాన్లయ్యను పిల్సక రమ్మని కారు పంపిచ్చే. మూడు రోజులు అవదాన్లయ్య ఇంటిముందు వున్నెది ఇంపాలకారు. గద్వాల్‌కు పొయినంక మహరాజు కోటలో రాణిగారిని చూసేముందు రాణి శేతికి దారంగట్టి కిటికీలో నుండి ఆ దారాన్ని బయటకు తీసి, దారం బట్టుకొని రాణి నాడి సూడమన్నారంట.

చదవండి :  కథకుల సందడితో పులకరించిన నందలూరు !

ఆ దారం పట్టుకొని జూసి, ఇది మనుసులనాడిగాదు పిల్లి నాడి అని అవదాన్లయ్య జెప్పిండంట. అప్పుడు రాణి, ఓయమ్మ ఈ మనిషి మంచి వాకళ్లయిన మనిషే అనిజెప్పి, లోపలికి పిలిపిచ్చి ఆమె రోగం గురించి చెబితే, అవదాన్లయ్య అంతా ఇని నేను వైద్యం జేచ్చే శియ్యలు శాపలు తినకుండా ఉండాలి అని శెప్పినాడంట. నేను నాలిక సంపుకొని ఉండలేను అని జెప్పిందింట మారాణి.

ఈన్నే మా సంస్తానంలోనే వైద్యునిగా ఉండమంటే ఆయన ఒప్పుకోలేదంట. ఆనక ఆమె ఒక పల్లెం నిండ బంగారు నాణాలు, నోట్ల కట్టలు తీసకచ్చి అవదాన్లయ్యకు ఇచ్చే. నేను నీకు వైద్యం జెయ్యలేదు గదమ్మ, ఇయన్నీ నాకు వద్దు అని తీసుకోకుండా వచ్చినాడంట. అంత వాకళ్లయిన మనిషి అవదాన్లయ్య. అప్పుడు ఆమె వంద ఎకరాల ఆవుల మాన్యం అవదాన్లయ్యకు రాసిచ్చింది అని శెప్పుకునిరి.

అట్టనే ఒకసారి తాడిపత్రి బీడీ కంపెనీ సాయిబులాయన్ను వాళ్ల పెండ్లాం తీసుకోని వచ్చిందంట. ఆ సాయిబుల మనిషికి ముప్పయి అయిదు గూడా ఉండవు. మెడ కనపడకుండా బలిసినాడంట. ఆ మనిసిని మామూలుగా జెయ్యమని ఆ సాయిబు పెండ్లాం బూబమ్మ అవదాన్లయ్యను అడిగినాది. సరే రెండు నెలలు నా కాడ ఇడ్సిపో, రెండు నెళ్లదాంక రాగాకు అని ఆమెకు జెప్పి, ఆ సాయిబులాయన్ను ఇంటి ఎదురుగా ఉన్నె ఓ ఇంట్లో పెట్టి, రోజూ పచ్చ శెనిగరొట్టె ఉల్లిగడ్డ కారం పెట్టి సన్నబడేటట్లు జేసినాడంట.

రెండు నెళ్లయినంక బూబమ్మ వచ్చి జూసి మొగున్ని కనుక్కోలేకపోయిందంట. అంత తగ్గిచ్చినాడంట. బూబమ్మ వాళ్లాయన్ను జూసుకోని, మళ్లా రెండు రోజుల్లో కొత్త అంబాసిడర్ కారు కొనుక్కోని వచ్చి, అవదాన్లయ్యకు కారు బీగంశెవులు ఇచ్చే. అవదాన్లయ్య నాకు వద్దమ్మా అని తీసుకోలేదంట. నేను నీకు బహుమానంగా ఇచ్చాండ అయ్యవారు తీసుకోండి అనంటే, నా శెళ్లెలు లాంటిదానివి. నువ్వు ఆనందపన్నావు, అంతకంటే నాకు ఏమి వద్దులేమ్మా అన్నాడంట.

ఇట్ట శెప్పుకుంటా పోతే శానా ఉండాయి.
అవదాన్లయ్య తెల్లార్జామున నాలుగ్గంటలకే లేసి, నీళ్లు పోసుకోని సంద్యావందనం జేసి దేవతార్చన జేచ్చడు.

అవదాన్లయ్య నిద్దర లెయ్యక ముందే కొందరు రహస్య రోగాలు శెప్పుకోవడానికి వచ్చరు. కొందరైతే అవదాన్లయ్య ఆరుబయట మంచం ఏసుకుని పండుకుంటే సుట్టూ సాపలు పర్సుకోని పండుకుంటరు. అవదాన్లయ్య ఎంటంబడి ఏట్లోకి పొయి, ఒక్కొక్కరూ ఓ శెట్టు కింద కూకోని వాళ్ల రోగాలను శెప్పుకుంటాంటరు.

ఒకసారి తెల్లార్తదనంగా సగిలేట్లేకి పొయి వచ్చా తాపలు ఎక్కుతా వుంటే, ఆడ ఎవురో గల్ల ఊసిపొయినాడు. అది జూసి, ఆయన ఎంటంబడి ఉండే వాళ్ల తిట్టు జూసి మీరెవురైనా వూసినారా అని అడిగినాడు. వాళ్లు మేమెవ్వరమూ ఉయ్యలేదని శెప్పినారు. దాంతో అవదాన్లయ్య ఎవుడు ఊసిండో వాడు సాయంత్రానికల్లా సచ్చడు. వాని రోగమేందో ఆ గల్ల జూచ్చే తెలుచ్చాంది అన్నెడంట.

సాయంత్రానికల్లా సావు బతుకుల మీద ఉన్నె మంగలి పెద్దయ్యను మంచం మీద ఎత్తుకోని అవదాన్లయ్య ఇంటికాడికి తెచ్చినారు. ఆయన్ను జూసి పొద్దన ఏట్లో ఇంత గల్ల ఊసింది నువ్వేనారా? అనడిగితే ఎగబుస దిగబుస పెడతాన్న పెద్దయ్య అవును అన్నట్టు తలకాయ ఊపినాడు. ముందే వచ్చింటే ఏదన్నా జేసేవాళ్లం. ఇంగ లాబం లేదు, తీసకపోండి అని జెప్పిన అరగంటకే, ఇంటికి దీసకపొయ్యే దావలోనే సచ్చిపోయినాడు మంగలోల్ల పెద్దయ్య.

రోగాన్ని ఇట్టనే కనిపెడ్తడు గాబట్టి ఆయన వైద్యం మీద అందరికీ బో గురి. ఆయన ఇంటికాడ ఎప్పుడూ పొయ్యి ఎలుగుతానే ఉంటది. వాటెమీద గంగోళాలు ఉంటయి. ఒక పక్క వచ్చినవాళ్లకు తినడానికి వండుతా వుంటే… ఇంగొక పక్క మందులు ఉడకపెడతా వుంటరు. ఆయన కాడికి వచ్చే రోగులకు ఆయన తెల్లబాయకారెం, రాగిరొట్టె లేకుంటే సొద్దలో జొన్న రొట్టెనో తినమని జెప్తాంటడు. శియ్యలకూర తినాల్సి వచ్చే మంగలిండ్లల్లో వండిచ్చి తెప్పిచ్చడు. పత్తానికి మూడేండ్ల నాటి పాత బియ్యం తినమంటాడు.

వాళ్ల కాడ లేకుంటే ఆయనే ఇచ్చడు. అవదాన్లయ్య ఇంట్లో ఉండే గాదె కింద ఉండే ఎలక పెంటికలు ఊడ్సుకొని పొయి, సీసాలో బోసి, అవదాన్లయ్య దాసిచ్చిన మందులతో పాటు, ఈ ఎలక పెంటికలు కూడా అమ్ముతడు మలిపెద్దు సుబ్రహ్మణ్యం. సన్నబిల్లోల్లకు కడుపునొప్పి లేచ్చే, అదేందో మందులో ఈ ఎలక పెంటికలు కలిపి నూరి తినిపియ్యమని జెప్తే… అట్టజేచ్చే తగ్గుతాన్నెదంట.

కడప జిల్లా కలెక్టర్‌కు ఏందో రోగమొచ్చే. కారేసుకుని వచ్చి, కారును కోంటోళ్ల బజార్లోనే ఇడ్సిపెట్టి నడ్సుకుంటా అవదాన్లయ్య ఇంటికాడికి వచ్చి, అక్కడున్నె అరుగుమీద రోగుల మద్దెన కూకోని, తన వొంతు వచ్చినంక లోపలికి పొయి సూపిచ్చుకొని పొయినాడు. అవదాన్లయ్య లెక్కున్నోడు, లెక్క లేనోడు, ఎక్కువ కులమోడు తక్కువ కులమోడు అని సూడ్డు. అందరినీ ఒకే రకంగా సూచ్చాడు. లెక్కున్నవాళ్లు ఇచ్చే తీసుకొని, లెక్కలేని వాళ్లకు పెట్టే మనిషి.

చదవండి :  కూలిన బురుజు (కథ) - కేతు విశ్వనాధరెడ్డి

అవదాన్లయ్య ఒకసారి టేకూరు పేట కొండల్లో ఎద్దులబండిలో పోతాంటే జోరున వాన కుర్సడం తిరుక్కున్నెది. గూడుబండి అయిందాన తడ్సకుండా కూకున్నాడు. ఎద్దులబండి నడిపే ఉసేన్ ‘అయ్యా, ఎద్దు బెదురుతాంది’ అనంటే శెట్టుకింద ఆపు అని జెప్తే ఆపినాడు. ఆ జోరు వానలో నెత్తిన గోతం సంచి కప్పుకొని, బండికాడికి వచ్చి ఎవురో లోపల అని అరిసినాడు గజదొంగ మేట్రెడ్డి రామన్న.

అవదాన్లయ్యను జూసి ‘అయ్యా నువ్వా’ అని కాళ్లు మొక్కి, ఇంత రాతిర్లో ఇక్కడుండడం పమాదం. నేను బండి ముందు నడుచ్చా పా అని బండిని ఊరి పొలిమేర్ల దాకా ఇడ్సి, మల్లా కాళ్లకు దండం పెట్టి ఎల్లబారి పొయినాడంట. ఆ గజదొంగకు సన్నపిల్లోనప్పుడు సచ్చేంత రోగమొచ్చే ఈయన బతికిచ్చినాడంట. అట్ట ఆ సుట్టు పక్కల ఆయనంటే దేవుడితో సమానం.

ఇంగ అసలు ఇషయానికి వచ్చే… సగిలేరు దాటి తెల్లబాడు దాంబడి నడ్సుకుంటా పోతాండారు. ముందు నారయ్య, ఆ మనిషి ఎనకాల అవదాన్లయ్య. నారయ్యకు, అవదాన్లయ్యకు మద్దెన అవదాన్లయ్య కుక్క ఉంది. అవదాన్లయ్య కుక్క ఆయన ఊర్లో యాడికి పొయినా ఎంటంబడి పోతాంటది.

ఆయనకు ఆ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరు, ఎనక ఇద్దరు నడుచ్చా ఉండారు. వాళ్లతో అవదాన్లయ్య శెతురు మాటలు మాట్లాడతాన్నాగాని… లోపల మాత్రం జిల్లేడుపాలు పొడ్సుకుంటే కంటిసూపు రాడమేంది అనుకుంటా ఉండాడు. ఆ ఆలోశన సుడి తిరుగుతా వుంది. నారయ్య ఆ జిల్లేడు శెట్టు కాడికి తీసకపొయినాడు.

అవదాన్లయ్య జిల్లేడు శెట్టును బాగా పరీచ్చగా చూసినాడు. శెట్టు ఒక్క రవ్వ తేడాగా ఉంది. మామూలుగా ఆ బరకల్లో ఒక శెట్టు అంత ఎత్తుగా పెరిగి నిగనిగలాడ్డమంటే మామూలు ఇషయం గాదు. శెట్టు తిట్టు తిరిగినాడు. కొమ్మలు కింద నుండి కుచ్చులు కుచ్చులుగా జడల మాదిరి అల్లుకోనుంది. మొదులు కనపడ్డం లేదు. ఇంతలో నారయ్య నాలుగు రోజులు కంట్లో పాలు పొడ్సుకున్నే ఆకులు ఏరకచ్చి సూపిచ్చినాడు.

ఆన్నే దంతెపొద కాడ ఉన్నె రాళ్ల దిన్నెమింద అందరూ కూచ్చుండిరి. ఇప్పుడు అవదాన్లయ్య ఏమి జేచ్చాడా? అని సూచ్చాండిరి. ‘నారయ్యా! మీ ఊరికి పొయి ఇద్దరు మనుసుల్ని తీసకచ్చి, ఈ శెట్టు సుట్టూ తవ్వియ్య’మని శెప్పినాడు. సరే సోమీ అని ఊర్లోకి పొయినాడు నారయ్య. అవదాన్లయ్య తన ఎంటంబడి ఉండే మనుసులకు జెప్పి, ఇంటికాడ నుండి ఆడికే బువ్వ తీసకరాండని పురమాయించినాడు.

నర్సయ్య ఇద్దరు మనుసుల్ను తీసకచ్చినాడు. వాళ్లు గడ్డపారలు, పారలు తీసుకోని వచ్చినారు. శానా జాగర్తగా శెట్టుకు ఏ మాత్రం దెబ్బ తగలకుండా ఏర్లకాడికి సుట్టూ తవ్వండని శెప్పినాడు. వాళ్లు తవ్వుతాండగానే ఇంటికాడ నుండి బువ్వ వచ్చింది. అందరూ తిన్నెంక మిగిలింది నారయ్యకు, కూలోల్లకు ఇచ్చినారు.

సుట్టూ నడుముల్లోతు తవ్వినంక అవదాన్లయ్య జూసి, మెల్లగ శెట్టు తట్టు తవ్వుమని శెప్పినాడు. గుంతలో నాలుగడుగుల లోతులో ఓ రాయి తొట్టి తగిలింది. ఆ తొట్టిలో ఈ శెట్టు మొలిసింది. శెట్టు ఏర్ల నిండా కుప్పకట్లు ఉండాయి. అయి జూసి అవదాన్లయ్య నవ్వినాడు. ఈ కుప్పకట్ల మద్దెన పెరిగింది గాబట్టి దీనికి అవుషదగుణం వచ్చింది. అందుకే నారిగానికి కండ్లు కనపడ్తా ఉండాయి అన్నెడు.

ఇంతకు కుప్పకట్లంటే ఏంది అనేది ఆడుండే వాళ్లకు బోదపడకపాయ.
ఆయుర్వేద వైద్యులు లోహ సంబందంగా ముందు తయారు చేసిపెట్టి, గునాదుల్లో పూడ్సి పెడతారు. అవి ఎంత పాతబడితే అంత బాగా పనిజేచ్చయి. శిన్నతనాన వాళ్ల ఇంటిగోడ వానలకు పడిపోతే ఇప్పదీసి కడ్తాంటే ఈ కుప్పకట్లు బయట పన్నెయంట. అవదాన్లయ్య శిన్నతనాన వైద్యుడయినంక అయి దొరకడం, ఆయన అస్తవాసి బాగుండడంతో, ఈ కుప్పకట్లతో ఆయనకు మంచి వైద్యుడిగా పేరుబడింది.

ఈ కుప్పకట్లు ఎప్పుడో వందేండ్ల కింద కలసపాడు తెల్లపాడుకు పొయ్యే దావలో ఉన్నెదంట. అయితే అప్పుడు వాగు వచ్చినప్పుడల్లా ఊళ్లోకి నీళ్లు వచ్చాండయని ఎత్తుగా ఉన్నెతిట్టుకు పొయి ఇండ్లు కట్టుకున్నారంట. అప్పుడు ఈడ ఎవురన్నా వైద్యుడు పాతిపెట్టి పొయింటాడు. అయి ఇప్పుడు బయటపడినయి.

ఈ కుప్పకట్లల్లో… వాతవిధ్వంసి, మహావాతరాక్షసం, గజకేశరి, ఆనందభైరవి, సూతికాభరణం అనే గుణాలు ఉంటాయి. అయి దొరికితే అదృష్టం పట్టినట్టే. అయితే అయి అందరికీ పనికిరావు. అయి ఎట్ట వాడాల్నో తెలియాల.

ఈ కుప్పకట్ల మందుతో మూర్చ, పక్షవాతం, మేహపొడలు, బాలింతజబ్బులు, సన్నపిల్లోల్ల జబ్బులు నయం అయితయి. ఈ యిషయాన్ని అవదాన్లయ్య తన ఎంటంబడి వచ్చిన నేస్తులకు శెప్పినాడు. నారయ్యను మెచ్చుకున్నాడు. అప్పుటిదాకా నారయ్య ఏమి శేచ్చాంటడో కూడా తెలియని అవదాన్లయ్య ‘నీకు ఏమి కావాలో శెప్పరా’ అంటే, ‘నాకు ఇంగేమి గావాల సోమి, కండ్లు బాగా కనపడేతట్టు జేసినవు’ అన్నాడు. ‘కొంగలాపురం పొయ్యే దావకాడ మనది పొలం ఉంది. ఓ ఎకరా జేసుకో పోరా’ అన్నాడు. ‘శిన్నతనం నుండి కట్టెలు కొట్టకచ్చుకోని బతికేటోన్ని, నాకు ఎవసాయం రాదు సోమి’ అన్నెడు నారయ్య.

చదవండి :  సాహితీలోకానికి ఘన కీర్తి పద్మశ్రీ పుట్టపర్తి

కూలోళ్లతో ఆ శెట్టుతో పాటు రాయితొట్టిని ఎద్దులబండ్లో ఏసుకోమని శెప్పి, కల్సపాడుకు బయలు తేరినాడు అవదాన్లయ్య. ఆయన ఎంట వచ్చిన మనుసులు, కుక్క అందరూ ఎల్లబారినారు. కుప్పకట్ల గురించి దాని యిలువ గురించి తెలియని నారయ్య, తెల్లబాడుకు బయలుదేరినాడు.

ఇంటికి పోయిన నారయ్యకు అవదాన్లయ్య అన్న మాటనే మతికి వచ్చాంది. ఎకరం పొలం తీసుకోమన్నాడు. ఆయన ఒక్క పైసా తీసుకోకుండా కంటిసూపు వచ్చేటట్టు జేసినాడు. ఆయన రుణం ఎట్టనో ఒక తట్టు తీర్చుకోవాల అనుకున్నెడు.

అప్పుడే సమితులు ఏర్పడినయి. సమితికి ప్రసిడెంటు ఎవురైతే బాగుంటదని అన్ని పార్టీలవాళ్లు ఆలోశనజేసిరి. తతిమ్మిశెట్టి కాశయ్య, శ్రీరాములు, భవనాసి రామయ్య, ఇట్ట అందరూ తల మాంచి తూకమైన నాయకులు. అట్లాటోళ్లంతా కలసి పోరుమామిళ్ల బ్లాక్‌కు అవదాన్లయ్యను సమితి ప్రసిడెంట్‌ను జేసిరి. ఇటు వైద్యం అటు రాజకీయంతో అవదాన్లయ్య జనానికి బాగా దగ్గరైనాడు. జనాలు ఆయన కాడికి ఇట్ట వైద్యానికి అట్ట పనులు జేయించుకోడానికి వచ్చాండిరి.

నారయ్య కండ్లు బాగా కనపడతాండయి. ఇప్పుడు ఆ మనిషి కట్టెలమోపు గూడా ఒక్కరవ్వ పెద్దదైంది. అవదాన్లయ్య ఇంటికి నారయ్య కట్టెలు ఎయ్యడం తిరుక్కున్నెడు. లెక్క ఇచ్చే తీసుకుంటా ఉన్నెడు, లేకపోతే అడిగేవాడు గాదు. అయితే అవదాన్లయ్య మాత్రం నారయ్యకు వారానికింత ఇయ్యమని పురమాయిచ్చినాడు పెద్దకొడుకు శేషాద్రిశర్మకు.

కాలం అట్టనే గడుచ్చాన్నెది. ఒకరోజు కొంగల రామాపురంలో యారో పెద్దయ్య గుడికాడ ద్వజస్థంబం ఎత్తుతా ఉంటే, ఆడికి అందరితో పాటు పొయినాడు అవదాన్లయ్య. అది ఐపోతానే అర్జంటుగా కలెక్టర్ రమ్మన్నెడు అని మనిషి వచ్చి శెప్పినాడు.

ఆదలబాదల రోడ్డు మిందికి వచ్చినాడు. అప్పుడు బస్సులు శానా తక్కవ. కొంగలాపురం రోడ్డు పక్కనే అరుగుకాడికి వచ్చారక, మనిషి కాలు శెయ్యి పడిపోయి మతి సొట్టబోయింది. పక్కనుండే మనుసులు అప్పుడే వచ్చిన బస్సులో పోరుమామిళ్లకు ఏసుకొని పొయిరి.

ఎంతమందికో శాన్నాళ్ల నుండి ఉంటాన్నె రోగాలను బాగుజేసిన అవదాన్లయ్య, ఆ మనిసికి వచ్చిన రోగాన్ని కనిపెట్టలేకపాయ. పోరుమామిళ్లలో బోడెమ్మగారి ఆసుపత్రిలో చేర్చిరి. ఏమి శెప్పలేమని డాక్టర్లు శెప్పిరి. అవదాన్లయ్యకు తెలిసిన వాళ్లందరూ ఆయన్ను సూడ్డానికి రాడం తిరుక్కుండిరి. బోడెమ్మగారి ఆసుపత్రి వచ్చి పొయ్యే జనంతో కిటకిటలాడింది. వారం రోజులయింది. ఏ వైద్యం జేచ్చే తిరుక్కుంటడో అవదాన్లయ్యకు తెల్సు. అయితే శెప్పడానికి మాట పడిపొయినాది.

నారయ్య రోజూ కట్టెలమోపి తెచ్చి అవదాన్లయ్య వాళ్ల గొడ్ల కొట్టంలో ఏచ్చా వుండడు. తనకు కంటిసూపు తెచ్చిన అవదాన్లయ్యను సూడాలనుకున్నాడు గాని… ఇంటికాడ అయితే అందరు రోగం సూపిచ్చుకోను వచ్చా వుంటరు. వాళ్లతో పాటు పోతే రోగి-వైద్యుడు గాబట్టి అంటు-ముట్టు ఉండదు. ఇప్పుడు ఆయన పరిస్తితి వేరు.

అవదాన్లయ్య ఆసుపత్రిలో పన్నాల నుండి ఆ ఇంటి ముందు జనం లేరు. పొయ్యిలు ఆరిపొయినయి. ఈదంతా బోసిపోయింది. ఎవరువున్నా లేకపొయినా నారయ్య కట్టెలమోపు తెచ్చి, అయన్నీ నరికి గొడ్లకొట్టంలో పేరుచ్చానే ఉండడు. వారానికి అయి రెండు బండ్లు అయినయి. ఉన్నెట్టుండి మూడు రోజులు వాన ఇదలకుర్సింది.

వాన ఇడ్సింది. అవదాన్లయ్య పానమిడ్సినాడు. ఊరు ఊరంతా ఏడ్సినారు. నారయ్య శానా బాదపన్నాడు. అయితే అవదాన్లయ్య మంచంలో ఉన్నెప్పుడు సూడాలనే కోరిక మాత్రం తీరకపాయ.

అవదాన్లయ్య పీనిగను ఊరికి తెచ్చిరి. ఆచారం పకారం కాలుజ్జామంటే అన్ని కట్టెలు యాన్నుండి వచ్చయి, మూడు రోజులు వాన పన్నెది గదా అనె కాటికాపరి. ఎవురో ఇంట్లో గొడ్లకొట్టంలో నారయ్య ఎత్తకచ్చి పేర్సిన కట్టెల గురించి శెప్పిరి. సగిలేటి గడ్డన శ్మశానంలో రెండు బండ్ల కట్టెలు పేర్చి దానిమింద అవదాన్లయ్యను పడుకోబెట్టిరి. పెద్ద కొడుకు శేషాద్రిశర్మ తలకొరివి పెట్టినాడు.

కాష్టం కాలేదాంక శ్మశానం కాన్నే నిలబడుకోని తెల్లబాడు తిట్టు మెల్లగా దావబట్టినాడు నారయ్య. నారయ్య గుండె బరువుగా ఉంది. ఎంతోమందికి వైద్యం జేసి ఎన్నో రోగాలను నయం జేసిన అవదాన్లయ్యకు నేను తెచ్చిన కట్టెలు ఔషదంగా పనికొచ్చినయి… ప్చి… అనుకుంటా ఇంటికి పొయ్యార్క పొద్దుగూకింది. అప్పుడే అందరూ బువ్వలు తిని పడుకుంటాండరు.

నారయ్య ఇంటికి పొయి నులక మంచం వాల్సుకోని నెత్తికింద పైగుడ్డ పెట్టుకోని, మంచం కోడుమింద తలకాయ పెట్టుకోని పండుకుని కండ్లు మూసుకున్నాడు. కండ్లలో అవదాన్లయ్య మెదలాడ్తాండాడు. కండ్లు తెర్సి ఆకాశం కేసి సూసినాడు. ఆకాశం నిండా సుక్కలు మిన మిన మెరుచ్చాండయి. ఉన్నెట్టుండి ఓ సుక్క జారి పడినాది. అదే అవదాన్లయ్య సుక్క అనుకున్నాడు. అవదాన్లయ్యకు కట్టెలు ఇచ్చిన నారయ్య కుక్కిలి మంచం మీద పండుకోని, తెల్లారాలక కట్టెయినాడు.

 (సాక్షి  దినపత్రికలో  ప్రచురితం )

రచయిత గురించి

వృత్తి రీత్యా పాత్రికేయుడైన బత్తుల ప్రసాద్ మంచి రచయిత కూడా. కడప జిల్లాలోని కలసపాడు వీరి స్వస్థలం. వీరు రాసిన కథలను ‘సగిలేటి కథలు’ పేర సంకలనంగా వెలువరించారు.

ఇదీ చదవండి!

Kuchipudi

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు …

ఒక వ్యాఖ్య

  1. కథ బాగా ఆసక్తికరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: