కడప లోక్‌సభ ఏడుసార్లు వైఎస్ కుటుంబ హస్తగతం
కడప : కడప లోక్‌సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.
ఈ ఎన్నికలలో కందుల ఓబులరెడ్డికి 2.32,315 ఓట్లు రాగా రామిరెడ్డి 2,24,789 ఓట్లు వచ్చాయి. అదే విధంగా 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల ఓబుళరెడ్డి,జనతాపార్టీ అభ్యర్థి పివియస్ మూర్తిపై 50,646 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే 1984లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డి ఎన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల ఓబుళరెడ్డిపై 54,323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత 1989 సంవత్సంలో వైయస్ కుటుంబం నుంచి దివంగత రాజశేఖర్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి రమణారెడ్డిపై 1,66,752 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తిరిగి 1991లో జరిగిన ఉప ఎన్నికలలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామచంద్రయ్యపై 4,18,925 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 1996లో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజమోహన్‌రెడ్డిపై కేవలం 5,445 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 1998లో రాజశేఖర్‌రెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డిపై 53,881 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తిరిగి 1999 సంవత్పరం జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజమోహన్‌రెడ్డిపై 26,597 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మైసూరారెడ్డిపై 1,31,647 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2009 కడప లోక్‌సభ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిపై 1,78,846 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడంతో పాటుగా ఎంపి పదవి కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రత్యేకంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో కడప లోక్‌సభ బరి తిరిగి హస్తగతం అవుతుందా లేక జగన్ వశం అవుతుందా అనే రసవత్తర పోరు మే నెల 8వ తేదీ నాటి ఉప ఎన్నికల పోలింగ్ తేలనుంది.