“కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

ఒంటిమిట్ట కోదండ రామాలయం

“కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు.

ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని ప్రస్తుతం శిధిలం. ఆయన దున్నిన మడికూడా రామసరోవరం పక్కనే ఉంది. ఆలయంలోజయ విజయుల విగ్రహాలప్రక్కన పోతన విగ్రహం ఉంది. ఇంకొక విశేషం- ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావుగారు (వాసుదాసస్వామి) సంస్కృతం నుంచి సరాసరి ఇరువైనాలుగువేల పద్యాలతో “మందరం” అనబడే తన తెనుగు రామాయణాన్ని ఇక్కడే వ్రాసారు. ఆయన నిరాడంబరపవిత్రజీవి. తపోమయజీవితాన్ని గడపుతూ కొన్నేళ్ళు ఇక్కడే పోతనఉన్న ఇంటిలోనే నివసించారు. తరువాత ఊరివారి మూర్ఖపుప్రవర్తన మొరటుతిట్లకు విసిగి ఊరువిడచి తెనాలిదగ్గర అంగలకుదురులో ఉన్నారు.

ఈ దేవాలయాన్ని దర్శించి శ్రీరాముని సేవించి తరించిన మహనీయులు, కవులు, భక్తులు, ఎందఱో ఉన్నారు. వారిలో ముఖ్యులు “రామాభ్యుదయం” వ్రాశిన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, అన్నమయ్య, వీరబ్రహ్మం గారు, ఉప్పుగుండూరు వెంకటకవి,వరకవి, ఇమాం బేగ్, భవనాసి మాలఓబన్న, ఆంధ్ర వాల్మీకి వాసుదాసస్వామి, సద్గురుసమర్థనారాయణ మహారాజ్, సాయం వరదదాసు మొదలగువారు.

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - రెండో భాగం

[box type=”shadow” ]

వీరిలో అయ్యలరాజు రామభద్రుడు పదినెలల చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక ఉత్సవ సమయంలో, అతన్ని తల్లిదండ్రులు దేవాలయంలోమర్చిపోతే, అర్చకులు కూడా చూచుకోకుండా దేవాలయానికి తాళంవేసి ఇంటికి పోతారు. తెల్లవారి చూడగా పాపడు గర్భ గుడిలో సీతామాతవిగ్రహం పాదాలవద్ద నిద్రిస్తూ ఉండటము, బాలునికి పాలుద్రాపిన చారికలు బుగ్గపై ఉండటము చూస్తారు. సీతమ్మతల్లి ఏడుస్తున్నపిల్లవానికి పాలిచ్చి రాత్రంతా కాచినది. ఆ మహాత్మ్యమో ఏమో ఆయన పెద్దవాడై మహాకవి అయ్యాడు.

ఇక పోతనామాత్యులు ” పలికెడిది భాగవతమట “అంటూ తన తెనుగు భాగవతాన్ని ఇక్కడి శ్రీరామునకే అంకితం ఇచ్చాడు. ఆయనకు ఇక్కడే శ్రీరామదర్శనం కలిగింది. తాళ్ళపాక అన్నమయ్య ఇక్కడ శ్రీరాముని దర్శించి ” జయజయ రామా సమరవిజయరామా భయహర నిజభక్త పారీణ రామా” అనే కీర్తనను రచించాడు. ఇక్కడి కోదండరాముని పోతులూరి వీర బ్రహ్మంగారు దర్శించినట్లు వారి చరిత్రలో ఉంది. బ్రహ్మంగారి మటం ఇక్కడకు ఎనభై కి.మీ దూరంలో ఉంది.

పోతనామాత్యుని విగ్రహం వద్ద ఈ పద్యం వ్రాసి ఉంది.

|| ఇమ్మను జేస్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముం బాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ
బమ్మెర పోత రాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ ||

చదవండి :  భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

ఉప్పుగుండూరు వెంకటకవి “దశరధ రామ “మకుటం తో శతకం చెప్పారు. వారి శతకం లో మచ్చుకు ఒకపద్యం.

||నిగ నిగ మెరయు కిరీటము
ధగ ధగమను పట్టు దట్టి తగిన కటారున్
భుగ భుగ వాసన నీకే
తగు తగురా యొంటి మిట్ట దశరధ రామా ||

వరకవి “కోదండరామ శతకం” వ్రాశాడు. అది ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధనశాఖ వద్ద ఉన్నది. 1670 లో కడప నవాబు ప్రతినిధి ఇమాంబేగ్ ఇక్కడకొచ్చి దేవుని పిలువగా ఆయన పలికాడని, ఇమాం బేగ్ రామభక్తునిగా మారి ఇక్కడ బావి తవ్వించి, గోపురాలు కట్టించాడు.

భవనాసి మాలఒబన్న సంకీర్తనలో తన్మయంచెందే భక్తుడు. పూజారులు ఆయన్ను మాలవాడని తరుమగా విగ్రహాలు ఆ తరిమిన వైపుకు తిరిగాయట. అంతట పూజారులు తప్పుగ్రహించి ఆయన్ను గర్భగుడిలోకి రావించి మహాభక్తునిగా గౌరవించారని గాధ.

ఇక వాసుదాసస్వామి విషయం అద్భుతం. ఆయన అపర వాల్మీకి. మచ్చుకు ఆయన పద్యం ఒక్కటి.

ఉ ||ఖండిత పాతకోత్కర నఖండ యశోజయ భాగ్యశాలి మా
ర్తాండ కుల ప్రకాండు నహితాన్దజ పన్నగ వైరి సత్క్రుపా
మండన భూషితుం గడపమండలవాసుని నొంటిమిట్ట కో
దండ రఘూత్తము న్నియత దాస్యమున న్భజియింతు భక్తిమై ||

చదవండి :  400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

1652 లో మన దేశాన్ని దర్శించిన ప్రెంచియాత్రికుడు “టావెర్నియర్” ఒంటిమిట్ట కోదండ రామాలయం భారతదేశంలో చూడవలసిన అద్భుతకళా ఖండాలలో ఒకటి అని వర్ణించాడు.

ఇక్కడ మహాద్భుతమైన తపోతరంగాలున్నాయి. కవితామయ నిరాడంబరజీవితాన్ని గడపిన మహాభక్త తపోధనుల ఆత్మలు ఇక్కడనే ఉన్నవా అనిపిస్తుంది. దేవాలయంలో కూర్చొని ధ్యానించి కొంతసేపు వారినిగూర్చి ఆలోచనలోపడిన నా నోటివెంట అరవై పద్యాలు వెల్లువలా ఉబికివచ్చాయి.

ఇది నా జీవితంలో ఈమధ్యన జరిగిన అద్భుతాలలో ఒకటి. రామానుగ్రహమే దీనికి కారణంతప్ప వేరొకటి కాలేదు. ఈ ఆలయం నేను దర్శించిన అతి ప్రభావవంతములైన దేవాలయాలలో ఒకటి అని నిస్సందేహంగా నమ్ముతున్నాను. మామూలుమనిషినైన నా నోటివెంట ఇలా వరదలా ఇన్ని పద్యాలా? ఇక్కడి దైవశక్తికి అప్రతిభున్నైనాను.

“కడప దేవుని గడప” అని ఎందుకంటారో ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయం చూస్తె చాలు అర్థంఅవుతుంది. ఈ దేవాలయంలో కోతిమూకలు అసంఖ్యాకం. భక్తులకంటే అవే ఎక్కువగా ఉంటాయి. కాని అపకారం చెయ్యవు. కొత్తవాళ్ళు  వాటిని చూచి భయపడుతూ ఉంటారు.

– సత్యనారాయణ శర్మ

Email: ssarma04@gmail.com

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *