
కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు
జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం
కడప: రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
స్థానిక పురపాలిక మైదానంలో శనివారం ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాలు మరియు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… జిల్లా అంతటా వివిధ రకాల ఉద్యానవన పంటలు పండిస్తున్నారన్నారు. వరిసాగు చేస్తే ఎకరాకు రూ.15-20 వేలు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే చీనీ కాయలు సాగుచేస్తే ఎకరాకు రూ.4-5 లక్షల వరకు ఆదాయం వస్తుందని, జిల్లాలోని 4.15 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు వేస్తే, ఇక్కడి రైతులకు తిరుగు ఉండదన్నారు. పరోక్షంగా కడప జిల్లాలో వరి సాగు వద్దు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
దేశ స్థాయిలో అత్యధికంగా ఇక్కడ అరటి దిగుబడి వస్తోందని, అరటి ఆధారిత పరిశ్రమలను ఆహ్వానించి ఇక్కడకు తీసుకొస్తామన్నారు. జిల్లాలో బనానా కోల్డ్ చైన్‌లింక్ కోసం రూ.10 కోట్లు ఇచ్చామన్నారు. కడప జిల్లాలో రూ.1655 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు.
రైతులు గతంలో కరెంటు కోసం పడిగాపులు కాసేవారని, ఇపుడు మే నెలలో సైతం ఎటువంటి కోతలు లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. అలాగే గతంలో ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. ఎవరైనా వ్యవసాయ అధికారి రాలేదని ఫిర్యాదు చేస్తే వెంటనే తొలగిస్తామని సీఎం తెలిపారు.
గత ఏడాది సతీష్‌రెడ్డి విజ్ఞప్తితో పులివెందుల ప్రాంతానికి నీరిచ్చి చీనీ తోటలను కాపాడామని వివరించారు. అనంతపురం జిల్లా మాదిరిగా ఇక్కడి ఉద్యానరైతులకు కూడా ఇప్పుడు ఇస్తున్న 70శాతం రాయితీతో కాకుండా 90 శాతం రాయితీతో డ్రిప్ పరికారాలు అందజేసేలా అధికారులను ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
వర్షపు నీటిని ఆపి, భూగర్భజలాలను పెంచేందుకు వీలుగా పాపాఘ్ని నదిలో భూగర్భ జలాశయాలు (సర్‌సర్ఫేజ్ డ్యామ్స్) నిర్మిస్తామని, ఇందుకు రూ.30 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తొలుత ఒక జలాశయం రెండు నెలల్లో పూర్తిచేస్తామని, అది విజయవంతమైదే రాష్ట్రమంతా ఇటువంటివి నిర్మిస్తామని చెప్పారు.
ఒంటిమిట్ట, దేవుని కడప, పెద్ద దర్గా, గండికోటలను ముఖ్య పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ జిల్లాలో ఖనిజాలు, ఉద్యానవనం, పర్యాటకం ఎంతో కీలకమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.