కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు

చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ గుర్తుకొచ్చే జిల్లాలోని కాంగ్రెస్ నేతలు తెదేపా గూటికి చేరారు కాబోలు …

కడప జిల్లాపై బాబు గారి చూపు ఎటువంటిదో తెలిపే కొన్ని ఉదాహరణలు …

జీవో నెంబరు 69

1996లో బాబు గారి తెదేపా ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడు సహా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు అందకుండా ఉండాలని విద్యుత్ పేరు చెప్పి జీవో నెంబరు 69 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబరు 69 ప్రకారం శ్రీశైలం కనీస నిర్వహణ నీటిమట్టం 834 అడుగులు. శ్రీశైలంలో కనీస నీటిమట్టం  854 అడుగులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే రాయలసీమకు నీరందే అవకాశం ఉంది – తాగునీటితో సహా. ఈ జీవో నెంబరు 69 విషయమై శ్రీశైల కనీస నిర్వహణా నీటి మట్టాన్ని సడలించాలని కోరుతూ కడప కర్నూలు జిల్లాలలోని రైతాంగం 1996 నుండి 2004 వరకు పలు మార్లు చంద్రాబాబు నాయకత్వంలోని తెదేపాను అభ్యర్తించారు. కరువు కోరల్లో చిక్కుకొని తాగునీటికీ  ఇబ్బంది  పడుతున్న సమయంలో రైతులు పలుమార్లు జాతీయ రహదారులను సైతం దిగ్బందించారు.

చదవండి :  తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

ఇవేవీ బాబు గారి హైటెక్కు మనస్సును కరిగించలేకపోయాయి. ఫలితంగా సీమలో అంతో ఇంతో సాగునీటితో పచ్చగా కనిపించే కే.సి కెనాల్ ఆయకట్టు సైతం ఆరు తడి పంటల సాగుకు కూడా నోచుకోలేక అల్లాడిపోయింది.  అయితే వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జీవో నెంబరు 69ని రద్దు చెయ్యలేకపోయినా శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నిర్వహణా నీటి మట్టాన్ని సవరిస్తూ  జీవో నెంబరు 107 తీసుకొచ్చారు.

కె.పి ఉల్లి రైతుల ఘోష:

కె.పి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని మైదుకూరులో రోడ్డెక్కిన రైతులను కనికరం లేకుండా అరెస్టు చేయించడం కూడా బాబు గారికే చెల్లింది.

కర్మాగారాల మూసివేత 

నష్టాల బాట పట్టాయని చెప్పి కడప సహకార చెక్కెర కర్మాగారాన్ని, ప్రభుత్వ ఆధీనంలోని ప్రొద్దుటూరు పాల కర్మాగారాన్ని మూయించేసి వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేశారు. అదేమని అడిగితే సంస్కరణలు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని బాబుగారు 1999లో ప్రయివేటు పరం చేశారు. 2001లో ఒక కంపెనీ నుండి మరో కంపెనికీ చేతులు మారిన ఈ కర్మాగారం 2004లో పూర్తిగా మూలన పడింది.

నీటి దోపిడీ పేర హంగామా:

ఎట్టకేలకు 2004 తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన తెదేపా కడప జిల్లాపై కక్ష కట్టినంత పని చేసింది. తెదేపా నేత కోడెల శివప్రసాద్ అయితే శ్రీశైలం నీల్లన్నీ వైఎస్ కడపకు దోచుకెలుతున్నాడంటూ నానా హంగామా చేశారు.  కాలువలో నీళ్ళు పారే వీడియోలు తీసి ఇదిగో కావాలంటే చూడండి అంటూ మీడియా ముందు పెట్టి  గోల చేశారు. దోచుకెల్లడానికి కడప జిల్లాలో ఎన్ని సాగునీటి కాల్వలున్నాయి? ఎన్ని ప్రాజెక్టులున్నాయి?  వాటి కింద ఎంత ఆయకట్టు సాగులో ఉంది? ఇవేవీ చెప్పరు. ఎందుకంటే అవి వాస్తవాలు చెబుతాయి కాబట్టి.

చదవండి :  'ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు'

పోతిరెడ్డిపాడు ఉసురు తీయాలనుకున్నారు:

రాయలసీమ జిల్లాలలో మిగులు లేదా వరద జలాలపై ఆధారపడి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరందించేందుకు గాను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సైజును పెంచేదానికి వైఎస్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటే తెదేపా వాళ్ళు చేసిన రభస అంతా ఇంతా కాదు. ఓ పక్క నాగం, రేవంత్ మరో పక్క దేవినేని ఉమ, కోడెల – ముందు మీడియా దగ్గర – ఆ తర్వాత అఖిలపక్షంలో – ఆనక శాసనసభలో చేసిన గోల అంతా ఇంతా కాదు.  కనుసైగతో పార్టీని శాసించగలిగిన బాబుగారు తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాన్ని నిలువరించకుండా  మౌనముద్ర దాల్చారు. పై పెచ్చు ఆయా నేతలను ఉద్యమించమని ప్రోత్సహించారు కూడా!

అంతా కడపకేనా అంటూ అక్కసు :

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడిపోయిన కడప జిల్లా కోసం ముఖ్యమత్రిగా ఉన్న జిల్లా వాసి వైఎస్ కొన్ని అభివృద్ది ప్రాజెక్టులను కేటాయిస్తే  వాటిని పట్టుకొని అంతా కడపకే అంటూ కొన్ని మీడియా సంస్థలు విమర్శిస్తే అది పట్టుకొని తెదేపా నేతలు చేసిన యాగీ అంతా ఇంతా కాదు.

ట్రిపుల్ ఐటీ ఎందుకు?

చదవండి :  27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు

అసెంబ్లీ సాక్షిగా కడపలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటును అడ్డుకునేందుకు నాడు తెదేపా శతధా ప్రయత్నించింది. ‘ఇడుపులపాయ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? అక్కడ ట్రిపుల్ ఐటీ పెట్టకూడదా?’ అని వైఎస్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పడం నిజం. ‘చంద్రబాబూ! నీ తొమ్మిదేళ్ళ హయాంలో కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ మ్యాపులో ఉన్నట్లు మీకు కనబడితే కదా!!’ అంటూ చంద్రబాబుకు గుర్తు చేయడం వాస్తవం.

బ్రహ్మణి పుట్టి ముంచారు:

గాలి జనార్ధన్ రెడ్డికి చెందినదని చెప్పి  బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసే వరకు తెదేపా మరియు దాని అనుబంధ మీడియా సంస్థలు వదల్లేదు. బ్రాహ్మణి విషయంలో పొరపాట్లు లేదా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దమని ప్రభుత్వాన్ని అడగకుండా ఏకంగా రద్దు చెయ్యాలంటూ బాబు గారి నేతృత్వంలో అసెంబ్లీ సాక్షిగా తెదేపా నేతలు పట్టుబట్టారు.

ఫలితంగా బ్రాహ్మణి  జిల్లా వాసులకు అడియాశే అయ్యింది. బ్రాహ్మణిని రద్దు చెయ్యకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని చేపట్టాలని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తెదేపా కోరి ఉండొచ్చు కదా !

అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణి గురించి వామపక్షాలు ఉద్యమిస్తుంటే స్థానిక తెదేపా నేతలు  రెండు రోజులు సంఘీభావ దీక్షలు చేశారు. ఎందుకంటే బ్రాహ్మణికి ఎన్నికల వేళ ప్రాముఖ్యత వస్తే మేము కూడా పోరాడాం అని చెప్పుకోవచ్చని.

ఆగిపోయిన అభివృద్ది కనబడలేదా?

వైఎస్ హయాంలో అంతా కడపకే అంటూ కొన్ని మీడియా సంస్థలు విమర్శిస్తే అది పట్టుకొని యాగీ చేసిన తెదేపా నేతలు వైఎస్ మరణాంతరం ఆగిపోయిన అభివృద్ది పనులను గురించి మాట్లాడితే ఒట్టు.

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

ఒక వ్యాఖ్య

  1. చంద్రబాబు లాంటి అబద్దాల కోరు, నమ్మించి గొంతు కోసే మనిషి మరోక్కరుండరు. ఈ మేధావిగా చెప్పబడుతున్న వెన్నుపోటుదారుడు కడప జిల్లాకు చేసింది శూన్యం – పచ్చ చొక్కాలను మేపడం తప్ప! కడప జిల్లాను సర్వనాశనం చేసినాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: