కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ కిందట 2006లో కడప.ఇన్ఫో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో కడప.ఇన్ఫోలో కొన్ని వ్యాసాలను/అభిప్రాయాలను ప్రచురించిన నేపధ్యంలో వివిధ అంశాల మీద కొంతమంది వీక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ స్పందించారు.ముఖ్యంగా మూడు రకాలైన ప్రశ్నలను/ఆరోపణలను విజ్ఞులైన వీక్షకులు లేవనెత్తారు.

అందులో మొదటిది ముఖ్యంగా రాయలసీమకు/కడప జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపైన ప్రచురించిన వ్యాసాలు/అభిప్రాయాలు ఇతర ప్రాంతాల మీద విషం చల్లేవిగా ఉన్నాయన్నది వారి ఆరోపణ. ఇక రెండవది తెదేపాకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామట, వైకాపాకు ఇబ్బంది కలిగే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదుట. మూడవది కడప జిల్లాకు సంబంధం లేని వ్యవహారాలు కడప.ఇన్ఫోలో ఎలా ప్రచురిస్తారు? (ఉదా. రోజా సస్పెన్షన్ వ్యవహారం) అన్నది.

ఈ రకమైన ప్రశ్నలు ఇంకా కొంతమంది వీక్షకులకు కూడా ఉండవచ్చు. అందువల్ల పై సందేహాలను తీర్చితే ఉపయుక్తంగా ఉంటుందని మేము భావించాం.

రాయలసీమకు/కడప జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపైన ప్రచురించిన అంశాలు ఇతర ప్రాంతాల మీద విషం చల్లేవిగా ఉన్నాయి…

కడప జిల్లాకు లేదా రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని గురించి గణాంకాలతో సహా చెపితే విషం చిమ్మినట్లా? అభివృద్ది చెందిన ప్రాంతాలను కాకుండా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చెయ్యమని అడగటం తప్పవుతుందా? గణాంకాల ఆధారంగా ఒక ప్రాంతం యొక్క వెనుకబాటుతనం ఎంత అని చూసే క్రమంలో ఇతర ప్రాంతాలతో పోలిక అనివార్యమవుతుంది. ఈ అనివార్యతలో ఎవరికైనా దురుద్దేశాలు కనిపిస్తే అది మా తప్పు కాదు. ఒకవేళ ప్రచురించిన అంశాలపైన ఆరోపణలు కాకుండా భిన్నాప్రాయాలుంటే వ్యాఖ్యల ద్వారా స్పందించవచ్చు. అటువంటి భిన్నభిప్రాయాలను తప్పనిసరిగా ప్రచురిస్తాం.

ఇకపోతే కోస్తాంధ్ర ప్రాంతంపైన లేదా ఆ ప్రాంత ప్రజలపైన మాకు వ్యక్తిగతమైన రాగద్వేషాలు లేవు. ఉన్నదల్లా ఆ ప్రాంతం వారికి లబ్ది చేకూర్చి రాయలసీమ/కడప జిల్లా వారికి ద్రోహం చేసే కుట్రల పైనే. ఈ క్రమంలో కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన మిత్రులు అటువంటి వాటిని వ్యక్తిగతంగా తీసుకుని బాధపడి, మేము విషం చిమ్ముతామని ఆరోపించిడం సహేతుకం కాదు.

చదవండి :  'నేను ఉన్నప్పుడు నా విలువ మీకు తెలియదు'..శ్రీమాన్ పుట్టపర్తి

కడప జిల్లా అస్తిత్వాన్ని, వెనుకబాటు తనాన్ని చాటి చెప్పటమే కాదు, ఈ ప్రాంతం పట్ల జరిగే కుట్రలనూ, కుతంత్రాలనూ, గోబెల్స్ ప్రచారాన్ని ఎండగట్టడంలో కడప.ఇన్ఫో తప్పక తనదైన పాత్రను పోషిస్తుంది. ఇందులో స్వపర బేధాలు ఉండనక్కరలేదు.

తెదేపాకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామట, వైకాపాకు ఇబ్బంది కలిగే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదుట…

వైకాపా మొదటి సారి జనంలోకి వచ్చిన పార్టీ, అదీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. కడప జిల్లాకు చెందిన జగన్ సారధ్యంలో ఉన్న ఈ పార్టీ వాళ్ళు ఇప్పటికి ఒక్కసారి కూడా అధికార పీఠం ఎక్కలేదు. పన్నెండేళ్ళు అధికారంలో ఉన్నబాబు గారి తేదేపా కడప జిల్లాకు చేసిన మేళ్ళను గురించి రాయటానికే ఏమీ లేదు. అలాంటిది ప్రతిపక్ష పార్టీ చేసిన మేళ్లను లేదా కీడును ఏమని రాయగలం? కనీసం కడప జిల్లాలో ఈ పార్టీ శాసనసభ్యుల మాట వినే అధికారి కూడా లేకుండా ప్రభుత్వం జాగర్త పడుతోంది. అలాంటప్పుడు వీళ్ళు అధికారులను తిడుతున్నారని రాయల్నా?

ప్రతిపక్షం కడప జిల్లాకు లేదా రాయలసీమకు ప్రాజెక్టులు మంజూరు చెయ్యట్లేదు అని కథనాలు రాయాల్నా? లేక అధికార పార్టీ కడప జిల్లాకు మంజూరు చేసిన కేంద్ర విద్యాలయాలు, అభివృద్ది ప్రాజెక్టులను అడ్డుకొంటోంది అని రాయాల్నా? లేక కడప జిల్లా ప్రాజెక్టులకు సాగునీరు ప్రభుత్వం ఇస్తోంటే అడ్డుకుంది అని రాయాల్నా? అసలు అధికార పార్టీ ఈ పార్టీ వాళ్ళను కడప జిల్లాలో ఎదో రకంగా ప్రలోభాలకు గురి చేస్తున్నా వారి అధ్యక్షుడు ఆపలేకపోయాడు అని అగ్రశ్రేణి తెలుగు దినపత్రికల తరహాలో కథనాలు రాయాల్నా? లేదంటే వైకాపా అధినేతపైన అప్పుడెప్పుడో తెదేపా పుంఖానుపుంఖాలుగా చేసిన ఆరోపణలను (కోర్టు పరిధిలో ఉన్నా కూడా) అగ్రశ్రేణి దినపత్రికల తరహాలో రాయాల్నా?

చదవండి :  జై రాయలసీమ (కవిత) - సొదుం శ్రీకాంత్

ఇక తెదేపాకు అనుకూలంగా ఏమని రాయాలి. కడప జిల్లాకు బోలెడు ప్రాజెక్టులు మంజూరు చేశారనా? రాయలసీమ సాగునీటి పథకాలకు బడ్జెట్లో కావలసినంత డబ్బులిచ్చారని రాయాల్నా? ‘పట్టిసీమ‘ నీళ్ళు తెచ్చి శ్రీశైలంలో నీళ్ళను నిలబెట్టి రాయలసీమ కరువు పారద్రోలారు అని రాయాల్నా? కడప జిల్లా వాళ్ళను, రాయలసీమ వాళ్ళను సందు దొరికినప్పుడల్లా పొగిడారు అని రాయల్నా? కడప జిల్లాకు దండిగా పరిశ్రమలు మంజూరు చేశారు అని రాయాల్నా? కడప జిల్లా ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిన కలెక్టర్ గారి పైన తక్షణమే చర్య తీసుకున్నారు అని రాయాల్నా? స్వపర బేధాలు లేకుండా తెదేపా భాద్యులను శాసనసభ్యులుగా గుర్తించి నిధులు విడుదల చేసారు అని రాయాల్నా?

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక్కడ వామపక్షాలను ప్రజాశక్తి, విశాలంధ్రల మాదిరిగా, వైకాపాను సాక్షి మాదిరిగా, తెదేపాను ఈనాడు, ఆంధ్రజ్యోతిల మాదిరిగా మోసే శక్తి కానీ, యుక్తి కానీ కడప.ఇన్ఫోకు లేదు. ఉన్నదల్లా కడప జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటే గుండె ధైర్యమే!

కాబట్టి ఆయా పార్టీల అభిమానులు, సానుభూతి పరులు ఈ విషయాన్ని గ్రహించవలసినదిగా మనవి.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

కడప జిల్లాకు సంబంధం లేని వ్యవహారాలు కడప.ఇన్ఫోలో ఎలా ప్రచురిస్తారు?

ఇది ప్రధానంగా కడప జిల్లా కోసం పనిచేసే వేదికే అయినా ఇందులో మిగతా అంశాలకూ చోటుంటుంది. రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని ప్రధాన ఘట్టాలకు ఇక్కడ చోటుంది. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన రచయితలూ, పాత్రికేయులూ రాసే వాటికి తప్పక చోటుంటుంది.

అయితే పెద్ద వెబ్ పత్రికలు, దినపత్రికల లాగా ఇలాంటి అన్ని ఘటనలనూ, ఘట్టాలనూ నిక్షిప్తం చేసేందుకు గానీ, రాసేందుకు గానీ మాకు పూర్తి స్థాయిలో వనరులు (పాత్రికేయులు, ఆఫీసు, సిబ్బంది, కంప్యూటర్లు గట్రా) అందుబాటులో లేవు. మాకు అందుబాటులో ఉన్న వనరులు, పరిమితుల దృష్ట్యా వీలైనంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కట్టా నరసింహులు, తవ్వా ఓబులరెడ్డి, గాలి త్రివిక్రమ్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , సొదుం శ్రీకాంత్, తవ్వా సురేష్ రెడ్డి లాంటి కొందరు వారి తీరిక సమయాలలో ఆయా అంశాలపైన తమ అభిప్రాయాలు/వ్యాసాలను టైపించి పంపుతున్నారు. అలాగే కొంతమంది సమాచార హక్కు ఉద్యమకారులు కూడా సమాచారం పంపుతున్నారు. ఇలాగే ఎవరైనా స్వచ్చందంగా ఈ సమాచార సేకరణలో తోడ్పడితే వారి సహాయం కూడా తీసుకుంటాం. అయితే ఈ ప్రచురణల విషయంలో తుది నిర్ణయం మాత్రం కడప.ఇన్ఫో దే.

కడప జిల్లాకు చెందిన సాహితీకారుల రచనా వ్యాసంగాన్ని, కడప జిల్లా చరిత్రను ఇక్కడ నిక్షిప్తం చేసే పని కూడా జరుగుతోంది.

www.kadapa.info కడప జిల్లా వాసుల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం మాత్రమే కాదు, అది కడప జిల్లా చరిత్రకు సజీవ సాక్ష్యం కూడా!

ఇదీ చదవండి!

కడప జిల్లాలో నేరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: