గండికోట వద్ద బహిరంగ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
పాత హామీల ఊసెత్తని ముఖ్యమంత్రి
కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని పరిశీలించారు. తరువాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ప్రణాళికబద్దంగా పూర్తిస్థాయిలో అభివృద్ధిచేస్తామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ఇళ్లను ఖాళీచేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన స్థానికులు ఒక్కొక్కరికీ రూ.లక్షన్నరతో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నామన్నారు.
తిరుపతి, ఒంటిమిట్ట, కాణిపాకం, శ్రీకాళహస్తిలను ఓ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే రాజంపేట పురపాలికను రూ.20 కోట్లతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
మొత్తానికి ముఖ్యమంత్రిగారు ఒంటిమిట్ట, రాజంపేటలకు సంబంధించిన కొత్త హామీలకు మాత్రమే పరిమితమై ప్రసంగాన్ని పూర్తి చేయడం విశేషం. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కాని, తరువాత శాసనసభలో, ఆ తరువాత కోడూరు సభలో, చివరగా గండికోట వద్ద జిల్లాకు ఇచ్చిన హామీల అమలును గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఈ సభలో పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.