ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

    ఒంటిమిట్ట కోదండ రామాలయం

    ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

    ఒంటిమిట్, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందిట.

    ఒక రోజు ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన కంపనరాయలు అనే రాజు ఇప్పుడు ఒంటిమిట్ట ఉన్న ప్రాంతానికి తన సైన్యంతో సహా వచ్చినాడు. ఇది అప్పట్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక లోయ. ఇక్కడికి చేరే సమయానికి కంపనరాయలు, ఆయన సైన్యం దాహంతో ఉంటారు. వారికి నీళ్ళు కనిపించకపోతే అక్కడే ఉన్న  ఒంటడు, మిట్టడులు వారికి రామతీర్థాన్ని చూపుతారు.

    చదవండి :  కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

    రామతీర్థంలో దాహం తీర్చుకున్న రాజు గారు సంతోషించి వారిద్దరి (ఒంటెడు – మిట్టెడు)  పేరుతో అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి, ఊరికి దక్షిణం వైపున ఒక పెద్ద చెరువును  తవ్వించాడనీ –  ‘ఒంటెడు – మిట్టెడు’ పేరుతో నిర్మించిన ఊరు కాస్తా కాలక్రమేణా ‘ఒంటిమిట్ట’ అయిందని ఒక కథనం.

    ఒంటిమిట్టను నిర్మించిన కంపనరాయల వారు అక్కడ రఘురామునికి ఒక ఆలయాన్ని సైతం నిర్మించినారు. ఇదే విషయాన్ని ఒంటిమిట్ట కైఫీయతు కూడా స్పష్టం చేస్తోంది.

    ఒంటిమిట్ట చుట్టూ పాలకొండలు ఉండటం చేత ఈ ప్రాంతం ఒక లోయ లాగా కనిపించేది. ఆ లోయ ప్రాంతంలో ఉన్నఒకే ఒక గుట్ట వలన ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చి ఉండవచ్చును అనేది మరో అభిప్రాయం.

    చదవండి :  ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి

    రాయలసీమ ప్రాంతంలో ఒకటిని ఒంటి అని పిలవటం పరిపాటి. ఒక్కరే అని చెప్పేదానికి ఒంటిగాడు, ఒంటిది లాంటి పదాలు వాడుకలో ఉన్నాయి. మిట్ట అంటే చిన్న కొండ లేదా తిప్ప అని అర్థము. ఒంటి (ఒక) + మిట్ట (తిప్ప) అనే వాడుకలో ఈ ఒంటిమిట్ట పేరు వాడుకలోకి వచ్చి ఉండవచ్చు (పుట 77 – టెంపుల్స్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్)

    ఒకే రాయి మీద కోదండ రామాలయం ఉండటం వలన ఈ ప్రాంతానికి ‘ఒంటిమిట్ట’ అనే పేరు వచ్చినట్లు చెప్పినా దానికన్నా పై రెండు కథనాలే ‘ఒంటిమిట్ట’ పేరుకు బాగా సరిపోలుతాయి.

    చదవండి :  బడి పిల్లోళ్ళు రాయాల్సిన భాగవత పద్యాలివే!

    అయితే కవులు అనేక మంది ఈ ప్రాంతాన్ని ‘ఏక శిలా నగరం’ అని పేర్కొనడాన్ని బట్టి చూస్తే వీళ్ళంతా ఒకే శిలలో కొలువైన ‘సీతా రామ లక్ష్మణుల’ కారణంగా ఒంటిమిట్ట ప్రసిద్ధం కావడంతో ఈ ప్రాంతాన్ని’ఏకశిలానగరం’ అని వ్యవహరించి ఉంటారనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేసినారు (‘భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో’ – కట్టా నరసింహులు).

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *