ఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా

etukadu

ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు.

బీడీ- అడుగుతాడు ఏసోబు.

సిగరెట్టు తీసుకో ఏటుకాడా- అని అతడి పాదాల దగ్గర పెడతారు.

ఇదే ఏసోబు నిన్న మొన్నటి దాకా పూచిక పుల్ల. గాలికి పోయే ధూళి. వీధికుక్క. కాని ఇప్పుడో? పులి. ఎందుకు? ఇది పంటలకాలం. పంట ఇంటికి తరలివచ్చే కాలం. అంతేనా? బండ్ల మీద మేత కదిలివచ్చే కాలం. పంటను దాచుకోవడం అందరికీ తెలుసు. మేతను దాచి పెట్టడం, మళ్లీ మేతకాలం వచ్చే వరకూ దానిని వామి వేసి నిలబెట్టడం ఒక్క ఏసోబుకే తెలుసు.

అందుకే వాడు పంట లేనప్పుడు పీనుగు. పంట వచ్చినప్పుడు ఏనుగు.

ఏసోబు వాళ్ల నాన్న సామేలు కూడా ఏటుకాడే. వాములు నిలబెట్టడంలో మొనగాడు. కాని ఏసోబు రంగంలో దిగాక, వాములు వేయడం మొదలుపెట్టాక, అబ్బను మించిపోయాడు కొడుకు అని ‘కొడుకు’ను ఇంకో అర్థంలో కూడా వాడి తిడుతూనే మెచ్చుకుంటారు రైతులు.

ప్రతి ఊళ్లో ప్రతి పనిలో చిల్లర పనిగాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్లు పని చేస్తే వంకర. లేకపోతే టింకర. అందుకనే వాళ్లు వినయం నటిస్తూ బాబ్బాబూ అని పని అడుక్కుంటూ ఉంటారు. ఏసోబుకు ఏం ఖర్మ? వాడు పనిమంతుడు. నైపుణ్యవంతుడు. మేత తక్కువగా ఉంటే- వామిని ఆంజనేయస్వామి విగ్రహంలా నిలబెడతాడు. మేత ఎక్కువగా ఉంటే లండన్ బ్రిడ్జిలాగా నిర్మిస్తాడు. వాడు ఎంత పెద్ద వామి ఏసినా అది ఎంత పెద్ద వానకూ ఒరిగిపోదు. నడిమధ్యన నీళ్లు దిగి కుంగిపోదు. ఇది పెద్ద విద్య. ఇంజనీరింగు. ఏసోబుకు అబ్బింది. అందుకనే వాములేసే కాలంలో వాడి కింద పని చేయాలంటే కూలోళ్లకు బలే సంబరం. వాడి కళ చూడటం ఒకటి. వాడి చేత తిట్లు వినడం ఇంకొకటి. ఒకటే నవ్వు. పని పండగలాగా ఉంటుందా?

చదవండి :  రాతిలో తేమ (కథ) - శశిశ్రీ

అయితే ఈ కాలం గడిచిన వెంటనే ఏసోబు- ఖాళీ చేసిన సత్రంలా తయారవుతాడు. ఒక కళా ఉండదు. ఒక కాంతీ ఉండదు. ఏసోబుకు వ్యవసాయం ఉంది. చేయడు. వాడికి రాదు కూడా. పెళ్లాం, కొడుకు, కోడలు ఆ పని చేస్తుంటే ఊళ్లో బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు. ఏరా… పని చేయవా అని ఎవరైనా అడిగితే- నేను సేద్యం చేసే ఎద్దుని కాదు, పందెపు కోడెను అంటాడు పౌరుషంగా. రైతులు దున్నడం కోసం ఎద్దులను పెంచుతారు. పండగలప్పుడు, ఉత్సవాలప్పుడు బండలాగి తమ పరాక్రమాన్ని చూపడానికి పందెపు కోడెలను విడిగా పెంచుతారు. దున్నే ఎద్దులు బండ లాగలేవు. బండలాగే ఎద్దులు దున్నలేవు. ఏసోబుది బండలాగే జాతి. సీజను వస్తేనే ఆ జాతికి పరపతి.

చదవండి :  తరం-అంతరం (కథ) - చెన్నా రామమూర్తి

మళ్లీ సీజను వచ్చింది. పంటలకాలం వచ్చింది. ఊరికి గడ్డిబండ్ల కళ వచ్చింది. ఒకటే హడావిడి. ఎంత డిమాండింగు ఉన్నా ఏసోబు ఎవర్నీ నొప్పించకుండా అందరికీ వంతులవారీగా వాములు వేసి పెడుతున్నాడు. తాను వామి వేస్తేనే కదా, రైతులు సంవత్సరం పొడుగూతా తమ పశువులకు నోటికింత మేత అందించగలుగుతోంది? ఆ ఆలోచనే చాలు ఏసోబుకి. ఎంతో తృప్తి.

కాని, ఇవాళ అనుకోకుండా గట్టి ఎదురు దెబ్బ.

ఏసోబు ఆ రోజు ఎంకటసామి వామి వేసినాడు. పని ముగిశాక కూలోళ్లు కింద పడిన దుబ్బునూ,

పరకనూ ఊడుస్తున్నారు. ఏసోబు కోడలు, ఈ మధ్యనే పుట్టింటి నుంచి తెచ్చుకున్న తన బర్రెగొడ్డు కోసం, చిన్న గంప ఎత్తుకొని వచ్చింది. మామ వాము వేసే చోట గడ్డికేం కొదవ. ఏసోబు కూడా స్వతంత్రంగా వెళ్లి కొంచెం గడ్డి తీసుకొని గంపలో కూరాడు. కోడలు బయలుదేరబోయింది. ఎక్కడున్నాడో ఏమిటో, వెంకటసామి చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి- నీ మొగుడు వామి వేసినాడనా కులుకతా వచ్చావు గంపనెత్తుకొని- అని తిట్టాడు. అంతటితో ఊరుకోక, మేత అక్కడే పెట్టేసి పో అన్నాడు.

చర్నాకోలతో కొడితేనే దెబ్బ తగలదు. ఒక్క మాట చాలు- మనసు మీది పెచ్చు లేచిపోవడానికి.

ఏసోబు ఏమీ మాట్లాడలేదు. నేరుగా వచ్చి కోడలి గంపలోని గడ్డి అక్కడ పడేసి ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి వాడు అన్నం తినలేదు. నిద్రపోలేదు. పగలు పనికీ పోలేదు. నొప్పిగా ఉందా అంది పెళ్లాము, ఏదైనా నొప్పి చేసిందేమోనని. అవును. నొప్పిగానే ఉంది. కాని, ఎక్కడని చెప్పడం?

చదవండి :  సెగమంటలు (కథ) - దాదాహయత్

ఎవరో వామి వేయించుకోవడానికి గడప దగ్గరకు వచ్చారు. పిలిచారు.

రానని చెప్పు అన్నాడు ఏసోబు.

ఇవాళ ఒంట్లో బాగలేదు, రేపు వస్తాడు అని చెప్పనా అంది పెళ్లాం.

ఏసోబు నిలబడ్డాడు. కోపంతో ఒణుకుతూ నిలబడ్డాడు. పౌరుషంతో రగిలిపోతూ నిలబడ్డాడు. ఎలాగో శక్తి కూడగట్టుకొని నిలబడి అన్నాడు- ఇనే… ఇను. ఇవరంగా సెప్తాండా ఇను. ఈ పొద్దే కాదు ఏ పొద్దూ యింగ నేను వాములేయను పోను… పోనంటే పోను… ఆ మాట అని వాడు ఎరగ్రా కూర్చున్నాడు.

ఎందుకనో- పెళ్లానికి మాత్రం వాడు ఏడుస్తున్నట్టుగా అనిపించింది.

రచయిత గురించి

పోసా రామకృష్ణా రెడ్డి గారు  రాయలసీమ రచయితల్లో ప్రసిద్ధులు. నిశితంగా రచన చేయడంలో నేర్పరి. కడప జిల్లాలోని హనుమనగుత్తి వీరి స్వస్థలం. కడప మాండలికంలో వీరు రాసిన ‘పెన్నేటి కథలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి. ‘పెన్నేటి కథలు’ సంపుటిగా వెలువడ్డాయి. ‘మనిషి-పశువూ’ వీరి మరో కథా సంపుటి. సుదీర్ఘ కాలం పాత్రికేయునిగా పని చేసి పదవీ విరమణ పొందిన వీరు  ప్రస్తుతం విజయవాడలో నివశిస్తున్నారు. చిరునామా: 404, జె.బి.ఎస్.రెసిడెన్సి, సాలిపేట రోడ్, పోరంకి, విజయవాడ – 521137

ఇదీ చదవండి!

కడప జిల్లా కథాసాహిత్యం

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన …

ఒక వ్యాఖ్య

  1. good short story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: