ఎద్దుల ఈశ్వరరెడ్డి

ఎద్దుల ఈశ్వరరెడ్డి (1986 ఆగస్టు 3) అంతిమ శ్వాస విడిచి, 27 సం||లు అయ్యింది. 27వ వర్థంతి సందర్బంగా ఆయన గురించిన స్మృతులను నెమరు వేసుకోవడం, నేటి పరిస్థితులను మదింపు చేసుకోవడం అత్యంత అవసరం. ఈశ్వరరెడ్డిగారు నిజంగా కీర్తిశేషులే. ”గాడ్‌ ఈజ్‌ క్రియేటెడ్‌ బై మాన్‌” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న ధవళ వస్త్రాల్లో ఉన్న రాజకీయ సన్యాసి కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి.

1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో ఎద్దుల ఈశ్వరరెడ్డి జన్మించారు. 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో నిత్యం కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టినా, తన వర్గ స్వభావాన్ని వదులుకొని కడ వరకు కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని నిష్కళంకంగా కొనసాగించారు.

మానవేతిహాసంలో మార్క్సిజం అనే మహత్తర సిద్ధాంతం వ్యక్తులను మహోన్నతులుగా, మహా మనుషులుగా, త్యాగమూర్తులుగా, అకుంఠిత దీక్షాదక్షులైన ప్రజా సేవకులుగా మల్చింది. ప్రజారాశులు దోపిడీకి వ్యతిరేకంగా మహోజ్వల పోరు సలపడానికి బ్రహ్మాండమైన భూమికను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ ఆణిముత్యం కీ.శే. ఎద్దుల ఈశ్వరరెడ్డి 50సం||ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా దర్శనమిస్తుంది.

1940 – 50 దశకం అటు అంతర్జాతీయం గానూ, ఇటు జాతీయంగానూ ఉద్యమాల హోరుతో తడిసి ముద్దయిన కాలం. అంతర్జాతీయంగా ఫాసిజాన్ని ఎదుర్కొనడానికి ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టు సేనలు ప్రాణాలకు తెగించి పోరుతున్న సమయం. భారతదేశంలో ‘క్విట్‌ ఇండియా ఉద్యమం’ ఉరకలు వేస్తున్న తరుణం. కమ్యూనిస్టు యోధులపై నిర్బంధాలు, నిషేధాలు కొనసాగుతున్న సమయం. రెండవ ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని లెనిన్‌ గ్రాడ్‌ రెడ్‌ ఆర్మీ ప్రతిఘటిస్తున్న సమయం. తెలంగాణా సాయుధ పోరాట విజృంభణకు బాసటగా సీమ జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఈశ్వరరెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు.

చదవండి :  వైఎస్ అంతిమ క్షణాలు...

1936వ సంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసి వచ్చిన ఈశ్వరరెడ్డి గ్రామంలో విద్యాధిక యువకులతో కలిసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా, అలాగే గ్రామాల్లో ఉన్న భూస్వామ్య పెత్తందారీ శక్తులకు వ్యతిరేకంగా పోరు సలపడానికి ”మిత్రమండలి” ఏర్పాటు చేసి, తద్వారా తన రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు.

1938 సం||లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా ఉండి, దాని మితవాద విధానాలతో విరక్తి చెంది రమణ మహర్షి బోధనల పట్ల మొగ్గుచూపి, రాజకీయాలకు దూరంగా ఉండినారు. ఆ సమయంలో ‘ఇటువల పాడు’ కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల ప్రేరణతో సమరయోధులు టేకూరు సుబ్బారావు ప్రోద్బలంతో కమ్యూనిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులైనారు.

1942 సం||లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత బహిరంగంగా పనిచేయడానికి దొరికిన అవకాశంతో జిల్లా అంతటా రైతులను సమీకరించడం, పార్టీ నాయకులు సంగమేశ్వరరెడ్డి, పొన్నతోట వెంకటరెడ్డి, కె.వి.నాగిరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, పంజెం నర్సింహారెడ్డి, నంద్యాల వరదారెడ్డి తదితరులతో సాన్నిహిత్యం, సమన్వయం పెంచుకోవడం, రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో నిమగమైనారు.

1952 సం|| సాధారణ ఎన్నికల నాటికి పార్టీపై రెండవసారి విధించిన నిషేధం పూర్తిగా తొలగింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఈశ్వరరెడ్డి కడప పార్లమెంటు స్థానంనుండి ఘనవిజయం సాధించారు. 1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. పార్లమెంటు సభ్యులుగా వ్యక్తిగత క్రమశిక్షణతో సమావేశాల్లో సమయానికి ఖచ్చితంగా పాల్గొనడం, సమస్యలను ప్రస్తావించడం వగైరాలతో నెహ్రూ ప్రశంసలకు పాత్రుడైనాడు.

కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈశ్వరరెడ్డి కృషిని జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేరు. పార్లమెంటు డిబేట్స్‌ను గ్రంథస్తం చేయించి, జిల్లా గ్రంథాలయానికి సమర్పించి, భావితరాలకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కృషి చేశారు. ప్రధానంగా ఈశ్వరరెడ్డి పార్టీ నిధుల సమీకరణ, రాజకీయ శిక్షణ శిబిరాల నిర్వహణ, పార్టీ ఆఫీసుల నిర్వహణ, విశాలాంధ్ర ఇతర పార్టీ పత్రికలకు చందాదారులను చేర్పించుటలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. యువకులుపార్టీలో పనిచేయానికి ప్రోత్సహించడమే కాక, వారి ఆర్థిక అవసరాలను తాను వ్యక్తిగతంగా సమకూర్చేవారు.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

అన్నింటికి మించి ఈశ్వరరెడ్డి నిత్య విద్యార్థి. విపరీతంగా చదివే అలవాటుతో పాటు అనేక రకాల క్లాసిక్స్‌, లిటరేచర్‌, సిద్ధాంత గ్రంథాలను సేకరించి ‘హోచిమిన్‌ భవన్‌’లో ఉన్న పార్టీ లైబ్రరీ (ప్రస్తుతం రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) లైబ్రరీగా రూపాంతరం చెందింది)కి సమకూర్చి పెట్టారు. ఈశ్వరరెడ్డి హరిజనుల, బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కొరకు, హక్కుల సాధనకొరకు అహర్నిశలు కృషి చేశారు. రామనపల్లెలో భూస్వాములు హరిజనుల కొట్టాలను (గుడిసెలు)కాల్చి వారిని గ్రామ బహిష్కరణ చేస్తే, ఆ పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఈశ్వరరెడ్డి గట్టిగా నిలబడ్డారు. హరిజనులను తిరిగి గ్రామంలో ప్రవేశింపచేసి, వారిలో ఆత్మస్థైర్యం, సంఘ నిర్మాణాన్ని ప్రోది చేయుటలో చిరస్మరణీయమైన కృషి చేశారు.

రచయితలు, కవులు, కళాకారులను గౌరవించడం, వారికి కావాల్సిన సౌకర్యాలు, వనరులు కల్పించడం ఈశ్వరరెడ్డికి మంచి అలవాటుగా ఉండేది. కమ్మూ-శ్యామల కళాకారుల బృందాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రా.రా., గజ్జెల మల్లారెడ్డి, వైసివి రెడ్డి, సొదుం సోదరులు, రామప్పనాయుడు, కేతు విశ్వనాథరెడ్డి, శివారెడ్డి, లచ్చప్ప, ఆర్‌విఆర్‌ లాంటి అభ్యుదయ కవులతోపాటు ప్రాచీన, ప్రబంధ సాహిత్యాలతో సంబంధమున్న రచయితలను కూడా ప్రోత్సహించేవారు. ఈ కోవలో సరస్వతీపుత్రులు డా||పుట్టపర్తి నారాయణాచార్యులు, పెద్దలు జానమద్ది హనుమశ్ఛాస్త్రి లాంటి వారు వస్తారు. ఎవరినైనా ‘ఒరేరు’ అని సంబోధించే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఈశ్వరరెడ్డిని అన్నా అని పిలవడం చూస్తే, అన్న వ్యక్తిత్వం ఏంటో అర్థమౌతుంది. కడప కేంద్రంగా రాజకీయ పత్రిక ‘సవ్యసాచి’, సాహితీ త్రైమాసిక పత్రిక ‘సంవేదన’ అనే నిప్పురవ్వల వంటి పత్రికలు వెలువడటం, వాటికి రాష్ట్రస్థాయిలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంతరించుకొనటం వెనుక ఈశ్వరరెడ్డి అండదండలు, ప్రోత్సాహం మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులో మరణించారు. ఆదెమ్మ, రమణయ్యలు అన్నకు అన్ని రకాల సేవలు చేసి, పార్టీ ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు. ఈశ్వర్‌రెడ్డి పేరుమీద జిల్లా పార్టీ మెమోరియల్‌ ట్రస్టును ఏర్పాటు చేసింది. దీనిద్వారా ప్రతి సంవత్సరం ఆయన వర్థంతి సందర్భంగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అంశాల పట్ల ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని పిలిపించి, స్మారకోప న్యాసాలు ఇప్పించడం, వారిని సత్కరించడం క్రమం తప్పకుండా చేస్తున్నది.

చదవండి :  'నాది పనికిమాలిన ఆలోచన'

ఈశ్వరరెడ్డి నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగనిరతిని గుర్తించి, దివంగత ముఖ్యమంత్రి డా||వైయస్‌.రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి( గండికోట) ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ప్రాజెక్టుగా నామకరణ చేశారు. ఈశ్వరరెడ్డి సహచరుడు శంకర్‌రెడ్డి కుమారుడు జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ అధ్యక్షులు దేవగుడి నారాయణరెడ్డి సౌజన్యంతో, జమ్మలమడుగులో ప్రతిష్ఠించిన ఈశ్వరరెడ్డి విగ్రహాన్ని డా||వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించి, ఈశ్వరరెడ్డి పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. కడపలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈశ్వరరెడ్డి పేరుమీద సాంస్కృతిక వైజ్ఞానిక కేంద్రం స్థాపించే కృషి ప్రారంభమైంది.

నాటి తరం నాయకులు సముపార్జించిన స్వాతంత్య్ర ఫలాలు పేద, సాధారణ ప్రజలకు చెందకుండా ”కర్ర ఉన్న వాడిదే బర్రె” అన్న రీతిగా వ్యవస్థ మారిపోయింది. దేశభక్తి, ప్రాంతాల అభివృద్ధి, ప్రజావికాసం అన్న పాతతరం నాయకుల ఆదర్శాలు, విలువలు నేడు పాతివేయబడుతున్నవి. అధికార పదవులు అక్రమ పద్ధతుల్లో డబ్బు దండుకోవడానికే అన్నట్లు పాలన తయారయ్యింది. ప్రకృతి ప్రసాదితమైన సహజవనరులు భూమి, ఖనిజ సంపద, గనులు వంటి వాటిని అధికార బలంతో కొంతమంది వ్యక్తులు కైవసం చేసుకుంటున్నారు. అందునుండి మాఫియాలు పుట్టుకొచ్చి ప్రజలకు చెందాల్సిన సంపదలను కొల్లగొట్టుకుపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో విలువలు కలిగిన, దేశభక్తి మూర్తీభవించిన, ప్రజల మనిషి అయిన ఈశ్వరరెడ్డి లాంటి నాయకుల త్యాగాలను, పోరాటాలను, శ్రమజీవుల ఉద్యమంపట్ల, మార్క్సిస్టు సిద్ధాంతంపట్ల వారికున్న నిబద్ధత, అంకితభావాలను స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఆ వారసత్వ వెలుగులో కష్టజీవుల, బడుగు జీవుల ఉద్ధరణకు కమ్యూనిస్టు ఉద్యమం పునరంకితం కావడానికి నేటి పరిస్థితులను తులనాత్మకంగా మదింపు చేసుకొని…

”వెనుక తరముల వారి వీర చరితములు
నార్వోసి, త్యాగంపు నీర్వెట్టి పెంచరా”

అన్న సూక్తిని ఆచరించడానికి సమాయత్తం కావడం నేటి తరం కర్తవ్యంగా ఉండాలి!

జి.ఓబులేసు

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: