‘ఎంజే’ ఇక లేరు
మైదుకూరు : పేద ప్రజల గొంతుక తానై నిరుపేదల, కార్మికుల, మహిళల హక్కులకోసం వారి పక్షాన అవిశ్రాంత పోరు సల్పిన రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎంజే సుబ్బరామిరెడ్డి(60) గురువారం కన్నుమూశారు. వీరు ఎంజేగా సుపరిచితులు.
నమ్మిన సిద్ధాంతాల కోసం బతికిన ఎంజే మరణించాడన్న వార్త అయన సన్నిహితులకే కాక, రైతులు, పేద ప్రజలందరినీ కలతకు గురిచేసింది. రెండు వారాల కిందట రేణిగుంట రైల్వే స్టేషన్‌లో గాయపడిన ఎంజే స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1953 జూలైన 1న ఖాజీపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఆయన జన్మించారు. విద్యార్థిదశలోనే ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టు యోధులు ఎద్దుల ఈశ్వరరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కమ్మూ సోదరుల ప్రభావంతో వామపక్ష భావాలకు ఆకర్షితుడై ప్రజా ఉద్యమాలను నిర్మించారు.1972-73లో జరిగిన ఆంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1978 నవంబరులో వచ్చిన దివిసీమ ఉప్పెనలో ఆయన చేసిన సేవలు నిరుపమానం.
సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ రాజకీయాల పట్ల ఎంజే ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అనుబంధ రైతు-కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అలాగే విరసం సభ్యుడిగా కొంతకాలం ఉన్నారు. కొంతకాలం పాత్రికేయుడిగా పనిచేశారు. రాయలసీమ గ్రామీణ విలేకరుల సంఘం నాయకుడిగా పనిచేశారు.
1992లో జరిగిన సంపూర్ణ మద్యనిషేధ ఉద్యమానికి జిల్లాలో సారధ్యం వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సమస్యలు, కేపీ ఉల్లి రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు నడిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా అనేక ఆందోళనలు చేపట్టి పలుమార్లు అరెస్ట్ అయ్యారు. లాఠీ దెబ్బలు, సంఘ విద్రోహ దాడులను చవిచూశారు. రాయలసీమకు సాగునీరు అందాలన్న తలంపుతో రాయలసీమ జలసాధన సమితి ఏర్పాటు చేసి సీమకు నికర జలాల్లో న్యాయమైన వాటా కావాలని అనేక వేదికలలో తమ గొంతు బలంగా వినిపించారు. చెన్నూరు చక్కర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉద్యమంలో పాల్గొన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను లక్ష క్యూసెక్కుల స్థాయికి పెంచాలని అనేక మార్లు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టారు. దండోరా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. కడవరకు ఉద్యమమే ఊపిరిగా ప్రస్థానం సాగించారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితుల ఊచకోతకు నిరసనగా చేపట్టిన ఉద్యమానికి వెళ్లి వస్తూ రేణిగుంట వద్ద రైలు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఊపిరి వదిలాడు. ఉద్యమాలు, ప్రజా సమస్యలపై సమరమే ఊపిరిగా జీవించిన ఎంజే వివాహం చేసుకోలేదు.