ఉరుటూరు

ఉరుటూరు గ్రామ చరిత్ర

ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది.

ఉరుటూరుపూర్వం ఈతచేట్లు, తాటిచెట్లు విరివిగాఉన్న ప్రాంతంలో ఉండిన ఈ గ్రామానికి ఈతలపల్లె పేరు ఉండేది. ప్రజలు రోగగ్రస్తులు కావడంవల్ల ఈతలపల్లె ఉన్న ప్రాంతానికి పడమర వూరు కట్టుకుని ఊరట పొందినందున అప్పటి నుండి ఉరుటూరు అనే పేరు కలిగినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. “ఉరు” అంటే గొప్ప , ప్రాశస్త్యం గలిగిన అనే అర్థాలున్నాయి. అందువల్ల ఉరు+ఊరు= ఉరుటిఊరు అవుతుంది. గొప్ప చరిత్ర కలిగిన “ఉరుటి ఊరే” కాలక్రమంలో “ఉరుటూరు” అయి ఉండే అవకాశం కూడా ఉంది. కరికాలచోళ మహారాజు రామేశ్వర యాత్ర అనంతరం గ్రామం మీదుగా మంది మార్బలంతో వెళ్తూ ఉరుటూరు గ్రామంలో మజిలీ చేశాడు. ఈ సందర్భంగా గ్రామానికి ఉత్తరాన మాధవరాయ, గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర, రామేశ్వర ఆలయాలను కట్టించాడు. ఈ ఆలయాలకు భూములను మాన్యంగా ఇచ్చాడు. ఆతర్వాత విజయనగర కాలంలో హనుమంతుని ఆలయం నిర్మితమైంది. తర్వాత “మీరమహారాజు” అనే రాజు ఈప్రాంతాన్ని పాలించినట్లు గ్రామానికి ఉత్తరంవైపున సోప్పవాగు గోడ నిలువరాతిపై హలేకన్నడ శాసనం వేయించాడు. ఆ శాసనం శిధిలంగా మిగిలింది. అయితే ఈరాజు ఏ కాలం వాడో ఏ వంశపు రాజో తెలియడంలేదు.

చదవండి :  నంద్యాలంపేట
ఉరుటూరు
బురుజు

ఆ తర్వాత విజయనగర చక్రవర్తి ప్రౌఢ దేవరాయలు ఈగ్రామాన్ని “మహాలక్ష్మీపురం” పేరుతో నెరియనూరి కోనేశ్వరభట్టు, సిద్ధవటం సుబ్భాభట్లు, వనం గోపాలభట్లు అనే బ్రాహ్మణులకు సర్వాగ్రహారంగా ఇచ్చాడు. ఇందుకు ఆధారంగా గ్రామానికి దక్షిణంవైపున తూర్పున పొలిమేరలో విలాస స్తంభాలు వేయించాడు. గ్రామానికి దక్షిణంలోని చెరువును ప్రౌఢదేవరాయలు తవ్వించాడు. గ్రామంలోని మాధవరాయ, ప్రసన్న వెంకటేశ్వర, రామేశ్వర, హనుమంతరాయ ఆలయాలకు నైవేద్యానికి, దీపారాధనకు, పుష్పాల సేవకు, దేవుని నగరికి గానూ ఇందుకూరి గ్రామ చెరువుకు తూర్పున, రావిమాను తోట, పుష్పాలతోట లను మాన్యపు భూములను కేటాయిస్తూ విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో  క్రీస్తు శకం 1560 “క్రోధన” నామసంవత్సరం పుష్యమాసం శుద్ద ఏకాదశి నాడు శాసనం వేయించాడు.

పెనుగొండ రాజధానిగా వెంకటపతిరాయలు పాలనా చేస్తున్న కాలంలో కూడా ఉరుటూరు గ్రామం బ్రాహ్మణ అగ్రహారంగా నడిచింది. ఆతర్వాత కాలంలో రామేశ్వర దేవళం శిధిలమై ఉండగా అగ్రహారీకులు , భండారం నాగినాయుడు అనే గ్రామస్తుడి సహకారంతో ఆలయానికి రాళ్ల మండపం కట్టించారు. మండపం కట్టిన వడ్ల రామాబత్తుడు అనే వ్యక్తికి ఇందుకూరు చెరువు కింద మాన్యం ఇస్తూ క్రీ.శ. 1609 శ్రావణ మాసంలో శాసనం వేయించారు. ఉరుటూరికి దక్షిణం చెరువు తూముపై కూడా మరో శాసనం లభించింది. భండారం నాగప్ప అనే వ్యక్తి ఉరుటూరి కాపులకు బీటిగుత్త మాన్యం ఇస్తూ క్రీ.శ. 1609 లో ఈ శాసనాన్ని వేయించాడు. బీళ్ళు దున్నేందుకు ప్రతిఫలంగా ఎనిమిది ఏళ్లపాటు ఈ మాన్యం ఇచ్చినాడు. బీటిగుత్త మాన్యం ఒప్పందాన్ని తప్పిన వారు కుక్కమాంసం తిన్నవారితో సమానం అవుతారనే హెచ్చరికను కూడా ఆశాసనంలో రాయించినాడు. ఉరుటూరి చరిత్రకు సంబంధించిన రేనాటి చోళుల కాలంనాటి మరో శాసనం గ్రామానికి ఉత్తరం బావివద్ద వేయబడింది. ఇది చిల కొండయ్య అనే వ్యక్తికి మాన్యం ఇస్తూ వేసిన శాసనం . అయితే శాసనం శిధిలావస్థలో ఉన్నట్లు Epigraphia Indica సంకలనంలో నమోదైంది.

చదవండి :  దివిటీల మల్లన్న గురించి రోంత...

గండికోటలో పెమ్మసానితిమ్మానాయుడు రాజ్యపాలన చేస్తుండగా కూడా ఉరుటూరు బ్రాహ్మణులకు అగ్రహారంగానే నడిచింది. వేములకు చెందిన కూనపులి వంశీకులైన పాలేగార్ల ఏలుబడిలో నడిచింది. పాలేగార్ల కాలంలోనే గ్రామంలో బురుజు నిర్మించబడింది. తర్వాత గ్రామానికి చెందిన చాలామంది బ్రాహ్మణులూ గ్రామం విడిచి వెళ్లారు. కడప మయానా నవాబు అబ్దుల్ నబీఖాన్ కాలంలో నిట్టూరి గోపాలయ్య అనే బ్రాహ్మణుడు కమలాపురం ప్రాంత గ్రామాల వ్యవహారం చూస్తూ మిగిలిన పదిమంది బ్రాహ్మణులకు చాతుర్భాగ అగ్రహారంగా నడిపించాడు. ఆ విధంగా టిప్పుసుల్తాన్ పాలనాకాలందాకా కొందరు బ్రాహ్మణులకు అగ్రహారంగా నడిచింది. ఈ గ్రామ పరిసరాల్లో పసుపుల ఓబయ్యపల్లె , ఎర్రిపాపయ్యపల్లె అనే వూర్లు ఉండేవి. తర్వాత పాడై పోయాయి. గ్రామానికి పడమర వెలమకూరి పాపిరెడ్డి అనే రైతు గ్రామాన్ని కట్టించినందున దానిని వెలమకూరివారిపల్లె అంటారు. మయానా నవాబు కాలంలో ఉరుటూరికి పడమరన వంకకు కాలువను తొవ్వించారు.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

//సాహిత్యంలో ఉరుటూరు//

ఉరుటూరి గ్రామానికి చెందిన సొదుం గోవిందరెడ్డి , సొదుం జయరాం, సొదుం రామమోహన్ లు అనేక రచనలు చేసి ప్రసిద్ధ సాహిత్యకారులుగా పేరుగాంచారు. వీరు ముగ్గురు ఇప్పుడు కీర్తిశేషులు . వీరిని సొదుం సోదరులుగా పిలిచేవారు. వీరినివాసం “చైతన్యభారతి” నాలుగు దశాబ్దాలపాటు సాహిత్య కేంద్రంగా విలసిల్లింది.

సొదుం గోవిందరెడ్డి
సొదుం గోవిందరెడ్డితో వ్యాసరచయిత( ఫైల్ ఫోటోలు )

– తవ్వా ఓబుల్‌రెడ్డి

(+91-9440024471)

ఇదీ చదవండి!

నంద్యాలంపేట

నంద్యాలంపేట

నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: