
రాయలసీమ ఉద్యమ నేతల అరెస్టు
బరితెగించిన తెదేపా ప్రభుత్వం
పోలీసుల అదుపులో బొజ్జా
గృహనిర్భందంలో భూమన్
ప్రభుత్వానికి మద్ధతుగా బరిలోకి దిగిన పచ్చ నేతలు, మీడియా
కడప: శాంతియుతంగా సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం సిద్ధమవుతున్న రాయలసీమ రైతు నాయకులపైకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యుక్తులవుతున్న నేతలను కర్నూలు జిల్లాలో పలుచోట్ల పోలీసులు సోమవారం గృహనిర్భంధం చేశారు.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ముందస్తు వ్యూహంలో భాగంగా బొజ్జా అర్జున్ ను ఆత్మకూరులో పోలీసులు అదుపులోకి తీసుకోగా, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్, న్యాయవాది శివారెడ్డి, రాఘవ శర్మలను నందికొట్కూరులో గృహనిర్భందం చేసినారు. బైరెడ్డి ముఖ్య అనుచరుడైన మాబుసాబ్ కూడా పోలీసుల నిర్భంధంలో ఉన్నారు. వీరే కాకుండా అక్కడక్కడా పలువురు రైతు నాయకులను కూడా పోలీసులు గృహనిర్భందం చేసినారు.
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపనను అడ్డుకునేందుకు నందికొట్కూరు మండలంలో 144 సెక్షన్ విధించారు. కార్యక్రమంలో పాల్గొనే రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులు, అధికారులు నందికొట్కూరు మండలంలో 144 సెక్షన్ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇవాల్టి సాయంత్రం నుండి ప్రభుత్వ అనుకూల మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించారు.
నందికొట్కూరు సమీపంలోని ఒక అతిధిగృహంలో భూమన్ ను గృహనిర్భందం చేసినట్లు అక్కడి సిఐ సమాచారమిచ్చారు. అతిధిగృహం చుట్టూ సుమారుగా 20 మంది పోలీసులను కాపలాగా నియమించారు. ఆళ్లగడ్డకు చెందిన వైద్యుడు సురేంద్రను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయన ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వైఖరిని సమర్ధించేందుకు తెదేపా పెద్దలు రాయలసీమకు చెందిన పార్టీ నేతలను పురమాయించారు.
దుర్మార్గమైన చర్య
[divider style=”normal” top=”10″ bottom=”10″]
రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా భావిస్తున్న సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపనకు వస్తున్న నేతలను, రైతు నాయకులను ప్రభుత్వం అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. గతంలో రాయలసీమ ఉద్యమంలో మేము పాదయాత్ర చేపట్టినప్పుడు కానీ, లక్ష మందితో సభ పెట్టినప్పుడు కానీ ప్రభుత్వం ఇలాంటి దుస్సాహసానికి పూనుకోలేదు. శాంతియుతంగా రాయలసీమ సాగునీటి కోసం ఒక అలుగు నిర్మించమని అడుగుతూ, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను తెలియచెప్పేందుకు ఒక కార్యక్రమం పెట్టుకుంటే దానిని ప్రభుత్వం పోలీసుల సాయంతో కట్టడి చేయాలని చూడటం సిగ్గుచేటు. రాయలసీమ ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు.
– భూమన్
ఇదేమన్నా నియంత పాలనా?
[divider style=”normal” top=”10″ bottom=”10″]
రాయలసీమకు చెందినవాడిగా చెప్పుకునే ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా కోస్తా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పని చేయడమే కాకుండా ఇక్కడి ప్రజల ఆకాంక్షలను పోలీసుల సాయంతో అణచివేయాలని చూడటం బాధాకరం. ప్రజలు శాంతియుతంగా జరుప తలపెట్టిన ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం. రాయలసీమ విషయంలో ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. అరెస్టు చేసిన రాయలసీమ నాయకులను తక్షణమే విడుదల చెయ్యాలి. రేపటి కార్యక్రమానికి ప్రభుత్వం సహకరించాలి.
– రాయలసీమ ఎన్నారై ఫోరం