విపక్షనేత ఇంట్లో పోలీసు సోదాలు

విపక్షనేత ఇంట్లో పోలీసు సోదాలు

ఎలాంటి వారంటూ లేకుండా వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో శనివారం నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు సోదా చేశారు. పోలీసులు అలా సోదాలు చేసింది ఆ పార్టీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ.

 ఈ నెల 5న తెదేపా వారి రభస కారణంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపధ్యంలో 8 నుంచీ జెడ్పీటీసీలంతా  జగన్ కు చెందిన ఇడుపులపాయ అతిధిగృహంలో మకాం వేశారు. వాయిదా పడిన నెల్లూరు జిల్లా పరిషత్‌ ఎన్నిక మళ్లీ ఆదివారం నాడు జరగనున్న నేపథ్యంలో కావలి జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను, ఇందుకూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణయ్యను సైతం చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కిడ్నాప్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి :  వైకాపా ధర్నా విజయవంతం

ఆ కేసుల్ని ఆసరాగా తీసుకుని నెల్లూరు పోలీసులు శనివారం మూకుమ్మడిగా ఇడుపులపాయకు వెళ్లారు. ఉదయం 10.30 సమయంలో నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డితో పాటు మరో 100 మంది పోలీసులు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలకు దిగారు.

సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారంటూ నెల్లూరు జెడ్పీటీసీలు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు గట్టిగా ప్రశ్నించారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం నడిచింది. ఇంతలో తమకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయని.. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇడుపులపాయలో ఉంచారన్న సమాచారం మేరకు, వారి బంధువుల సమక్షంలో సోదాలు చేస్తున్నామని చెప్పారు.

చదవండి :  రేపు వైకాపా జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

ఇడుపులపాయ చుట్టుపక్కలి ప్రాంతాలతో పాటు తోటల్లో, పార్కుల్లో పోలీసులు కలియతిరిగారు. ఎక్కడైనా జెడ్పీటీసీలు ఉన్నారేమోనని అనుమానంతో వెదికినట్లు చెప్పారు. అక్కడితో ఆగకుండా… జెడ్పీటీసీలంతా నెల్లూరుకు బయల్దేరగా, ఆ బస్సులో కూడా తనిఖీలు చేశారు. చివరికి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు చెప్పిన జెడ్పీటీసీలు అక్కడ లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *