ఆరవేటి శ్రీనివాసులు – కళాకారుడు

జానపద కవిబ్రహ్మ ఆరవేటి శ్రీనివాసులు కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం చిన్న రంగాపురం గ్రామంలో ఆరవేటి వెంకటరమణ, అశ్వర్ధమ్మలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు. ఆరవేటి శ్రీనివాసులు తండ్రిగారైన వెంకటరమణ వృత్తిరీత్యా ఉపాధ్యాయులే అయినప్పటికీ ప్రవృత్తి హార్మోనిస్టుగా ఆనందించడం. సంగీతం పట్ల అభిరుచి, సంగీతపు విలువలు తెలిసిన వ్యక్తిగా తిరుపతి సంగీత కళాశాలలో చేర్పించారు. బాల్యమంతా ప్రొద్దుటూరులో గడచిపోయింది. 1963వ సంవత్సరంలో గొల్లపూడి మారుతీరావు రచించిన ‘రాగరాగిణి’ అనే నాటకంలో ‘కన్న’ అనే మూగ బాలుని పాత్రను ధరించి, ప్రేక్షకులను రంజింపచేసి జాతీయస్థాయిలో ప్రత్యేక బహుమతిని పొంది ఆ తదుపరి వేనుచూడకుండా నటనా జీవితాన్ని ప్రారంభించారు. హాస్యబ్రహ్మ అమపళ్ళదిన్నె గోపీనాద్ రగిలించిన స్ఫూర్తి జానపదగీతం వైపు ఆయనను అడుగులు వేయించింది. ఆరవేటి శ్రీనివాసులు నటుడిగా, గాయకుడిగా, రచయితగా – బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేర్కొనవచ్చు. ఆరవేటి శ్రీనివాసులు రచించిన జానపదగీతం ‘కొడుకో మానంది రెడ్డి’ జానపదుల నాలుకపై విన్పిస్తుంటుంది.

ఆరవేటి శ్రీనివాసులు
ఆరవేటి శ్రీనివాసులు

‘శీను అండ్ శీను’ పేర కళాలయ అనే సంస్థను శ్రీ రాళ్ళబండి శ్రీనివాస్‌తో కలిసి స్థాపించి ఇరువురూ కలిసి ‘మొహంజోదారో’ అనే సాంఘిక నాటకాన్ని దిగ్విజయంగా ప్రదర్శించారు. ఆరవేటి శ్రీనివాసులు పరంధామయ్య పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. 1975వ సం||లో ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా ఉద్యోగంలో చేరి రాయలసీమ యాసను రేడియోలో మొట్టమొదటగా పరిచయం చేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. వినూత్న ప్రక్రియలకు ఎల్లప్పుడూ ద్వారాలు తెరుస్తూ వందకి పైగా రేడియో నాటకాలను, రూపకాలను నిర్వహించి శ్రోతల ప్రశంసలు అందుకొన్నారు. 1985లో స్వయంగా రచించి నిర్వహించిన ‘ఈ కథ మార్చండి’ అనే నాటకం 18 భాషలలో ప్రసారమయ్యి ఆయనకు జాతీయ బహుమతిని తెచ్చిపెట్టింది. మూడుసార్లు జాతీయ బహుమతిని పొందిన వ్యక్తీ ఆరవేటి శ్రీనివాసులు.

మద్రాసు తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కారాన్ని అందుకున్న వ్యక్తీ ఆరవేటి శ్రీనివాసులు. రేడియోలో అనౌన్సర్ నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి ఆ తదుపరి పదోన్నతుల ద్వారా ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి ఇన్చార్జి స్టేషన్ డైరెక్టర్ గా (కేంద్ర నిర్దేశకులు) వ్యవహరించారు. పల్లెపల్లెలో జానపద సాహిత్యాన్ని సేకరించి రేడియోలో శ్రావ్య రూపాన్ని కలిగించిన వ్యక్తి. రచయితగా, నాటక ప్రయోక్తగా, ప్రసిద్ధ రంగస్థల నటులుగా, వ్యాఖ్యాతగా, ధ్వన్యనుకరణ కళాకారుడిగా వారి సేవలు కడప జిల్లాలో చిరస్మరణీయం. ఆం.ప్ర.రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్న సేవలను గుర్తించి 1981వ సం||లో ఆం.ప్ర.నాటక అకాడమీ సభ్యునిగా ప్రతిపాదించి సత్కరించింది. కడప జిల్లాలో (Gosca) గోస్కా పేరిట ఒక సంస్థను ప్రారంభించి అందులో ప్రభుత్వోద్యోగులందరికీ అవకాశాలు కల్పించి ఎన్నో నాటిక,నాటక ప్రదర్శనలను ఇచ్చి తనదైన శైలిలో ఒక ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి….

“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమందిలో ఆరవేటి ఒకడు!

చదవండి :  భరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)

నన్ను చూస్తూనే లేచి సాదరంగా ఆహ్వానించాడు. ఒకరి ఎదురుగా ఒకరం కూర్చున్నాం. మా మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కరిగిపోయాయి! “మామా! ఎప్పుడో ఏండ్ల కిందట దూరదర్శన్ పై మోజులో ఆప్షన్ ఇచ్చాను. ఇప్పటికడి ఫలించింది – నా పాలిటికొక శాపంగా! ఆకాశవాణిని వదులుకోలేను. ఏం చేస్తావో నీ ఇష్టం మామా” అంటూ చేతులు పట్టుకొన్నాడు. కొన్ని క్షణాలు ఆలోచించాను. అప్పుడు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గైక్వాడ్. ఫోన్ చేతికి తీసుకొన్నాను. ఆరవేటి కుటుంబ పరిస్తితిని… సర్వ సమర్ధుడైన ఆరవేటి వంటి వ్యక్తి సేవలు తిరుపతి ఆకాశవాణికి అత్యవసరమైన స్థితిని వివరించాను. డైరెక్టర్ జనరల్ గైక్వాడ్ నా మాట మన్నించాడు. ఆరవేటి రెండు చేతులు జోడించాడు. ఆ అనుబంధం నలభై వసంతాలు పండించుకొన్న ఆత్మీయానుబంధం.

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ఆరవేటి కాదు శ్రీనివాసులు – శ్రీనివాసులు తి.తి.దే సంగీత కళాశాలలో విద్యార్థి. అప్పుడు నేను కామధేనువు లాంటి రైల్వే ఉద్యోగాన్ని కాలదన్ని నాటకరంగం ఊపిరిగా ఊరేగుతున్నవాణ్ణి! ఏదో నడమంత్రపు సిరిలాగ నా జీవితంలో మూడు పదుల వయస్సు జారిన తరువాత రంగు దుర్దపుడితే – శ్రీనివాసులు విద్యార్థి దశలోనే బాల నటుడిగా భాసించిన వ్యక్తి. మేము ఇంత సన్నిహితులం కావడానికి ఇద్దరూ ఆరాధించిన నాటక కళ ఒక కారణం కావచ్చు! ఆ రోజుల్లో ఒకరికొకరు ఎదురుపడ్తే నాటకాలకు సంబంధించిన ఎన్ని ఛలోక్తులో? అన్నట్టు శ్రీనివాసులు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. నటుల మాటతీరు యదాతధంగా అనుకరించి కడుపుబ్బ నవ్వించేవాడు! అనుకుంటే కండ్లనీల్లు తెప్పించేవాడు!!

ఆ గతం – ఒక మధుర స్మృతి. ఆ తరువాత శ్రీనివాసులు ఆకాశవాణి కడపలో అనౌన్సర్‌గా చేరడం తన జీవితంలో ఒక గొప్ప మలుపు! సంగీతంలో ప్రవేశం ఉంది. కంఠంలో మాధుర్యం ఉంది. మనిషిలో ఆరని తపన ఉంది.

రాయలసీమలో జానపద నిక్షేపం ఉంది. శ్రీనివాసులు దృష్టి జానపదుల వైపు మళ్ళింది. పల్లె – పల్లె తిరిగాడు – జానపద వాణిని బాణిని ఒడిసి పట్టుకొన్నాడు. ఆకాశవాణి సహకరించింది. శ్రీనివాసులు జానపద గీతాలు తెలుగు శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిన మంత్రాలు! ‘ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శ్రీనివాసులు అక్కడితో ఆగలేదు! మీడియాను చాలా చక్కగా వినియోగించుకొన్న మేధావి శ్రీనివాసులు. ఆ ప్రయోగాల్లో శ్రీనివాసులు తెరమరుగుకు వెళ్లిపొతే – ఆరవీటి నాకు నేనే సాటి! అంటూ విజృంభించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరవేటి బహుముఖ ప్రజ్ఞాశాలి.

నాటికలు నాటకాలు రాసి ఒప్పించాడు – నటించి మెప్పించాడు – ప్రయోక్తగా రాణించాడు – పాటను పరవళ్ళు తోక్కించాడు – మిమిక్రీతో అలరించాడు – కథలతో ఆలోచింపజేశాడు. కథ చెప్పి ఎదుటివాళ్ళను మెప్పించడంలో గొల్లపూడి మారుతీరావు అందెవేసిన చేయి అని విన్నాను. అనుభవానికి రాలేదు. అయితే ఆ అద్భుత ప్రయోగాల్లో ఆరవేటి తనకు తానే సాటి.

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

ఒకదినం మేమిద్దరం మా మేడ మీద కూర్చున్నాం. ఆరవేటి మందు నంజుకుంటూ “మామా నువ్వు “గైడ్” సినిమా చూశావా?” అని అడిగాడు. “లేదు” అన్నాను.

అంతే! ఆరవేటి కథ చెప్పలేదు. ఊహా తెరమీద ‘గైడ్’ సినిమా ప్రదర్శించాడు. పూర్తి అయ్యేసరికి గుండెలు కండ్లల్లో కరిగితే చెంపలు తడిమడికయ్యలయ్యాయి.

ఇలా ఎన్నని చెప్పను? నా దృష్టి శంకరంబాడి సుందరాచారి జానపదం వైపు మళ్లిస్తే రాయలసీమలో ఎంకికి ధీటైన అమ్మి ఆవిర్భవించింది. అయితే నేను జానపదాల సేకరణ జోలికి పోలేదు. ఆరవేటి సేకరించిన పదాల్లోనే కొన్నింటిని గ్రహించాను. ఈ రోజు జానపదాలు పాడి కొద్దో గొప్పో మాట్లాడగలుగుతున్నానంటే అది ఆరవేటి ఇచ్చిన స్ఫూర్తి.

ఆరవేటి రాయలసీమలో, లేదు ఆంధ్రరాష్ట్రానికో పరిమితమైన వ్యక్తి అనుకొంటే పప్పులో కాలువేసినట్టే. ఆరవేటి జాతీయస్థాయికి ఎదిగిన కళాకారుడు. న్యూడిల్ల్లీ ఆకాశవాణి వివిధ ప్రక్రియల్లో జాతీయస్థాయి పోటీ నిర్వహిస్తుంది. ఆ పోటీలు ఒక విశిష్టమైన స్థాయిలో నిర్వహిస్తారు. ఆకాశవాణిలో ఉద్యోగులైన కళాకారులు జాతీయ స్థాయి బహుమతిని అందుకోవడం గౌరవప్రదంగా భావిస్తారు. ఒకటి రెండు పర్యాయాలు జాతీయ స్థాయిలో మెంబర్ జ్యూరీగా పాల్గొనే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తాను. ఆరవేటి రూపకాలు, నాటికలు రాసి ప్రయోక్తగా రూపొందించి జాతీయస్థాయిలో బహుమతులు సాధించి కడప ఆకాశావాణికే కీర్తి తెచ్చిన ప్రజ్ఞాశాలి!

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఒక కవిత సంపుటిని కాని, ఒక రచయిత కథా సంపుటిని కానీ ప్రచురిస్తే అది ఒక గర్వకారణం గా భావిస్తారు. కారణం ఆ సంస్థ పాటించే సాహితీ విలువలు, అలాంటి విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఆరవేటి కథా సంపుటిని ప్రచురించిందంటే – ఆరవేటి కథాస్థాయి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకనాటి ఉదయం నడక నుంచి తిరిగి వస్తున్నాను. ఆరవేటి ఎదురుపడ్డాడు. నా కండ్లు నాకే అబద్దం చెబుతున్నాయి? అన్న సందేహం. రేడియో స్టేషన్లో ఎదురుపడ్తే కూనిరాగంతో నవ్వుల్ని కలపోసి లేడిపిల్లలాగా గంతులువేసే ఆరవేటి ఎక్కడ? ఎదురైన ఆరవేటి ఎక్కడ? అదే ఆలోచిస్తూ ఉంటే – “రెండు మూడు ఆపరేషన్లు అవసరం అయ్యాయి మామా! ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాను.” వృద్ధాప్యం నిర్దాక్షిణ్యంగా ఎక్కితోక్కితే మాగిన పండులా మనిషి, నాకు తెలియకనే ఆవేదన నా మొగంలో చోటుచేసుకొంటే. శరీర సౌష్టవం తగ్గినా గళంలో తగ్గలేదులే మామా! అంటూ నాకు ఇష్టమైన “పచ్చఛత్రీ శాతపట్టి..” నడిరోడ్డులో నిలబెట్టి వినిపిస్తాడా? ఉదయం నడక సందర్భంలో, రేడియో స్టేషన్ ప్రాంతంలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉన్నాడు. కలిసి మాట్లాడుకొంటూనే ఉన్నాం. మనిషి దినదినానికి కొంత తీసిపోతున్నట్టే కనిపించాడు.

శనివారం (12.07.03) నాడు మా అమ్మాయి ప్రపూర్ణ ఫోన్ చేసి “నానా! ఆరవేటి సార్ గారికి సీరియస్‌గా ఉంది. స్విమ్స్ లో చేర్చారు” అని చెప్పింది. ఆ మాట వినడమే తరువాయి. సిరికిన్జెప్పడన్నట్లుగా స్విమ్స్‌లో వాలాను. ఏమి జబ్బో? ఏ వార్దో తెలుసుకోలేదు. కదా? పరపతి పణంగా పెట్టి అన్ని వార్డులూ గాలించాను. చివరికి ఆరవేటిని చూడకనే చెవులు యాలేసుకొని ఇల్లు చేరాను.

చదవండి :  వదిమాను సేనుకాడ : జానపదగీతం

అప్పుడు రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి ఏ వార్డులో ఉన్నాడో అడిగి తెలుసుకొన్నాను. మళ్ళీ నాలుగు గంటలకి స్విమ్స్ కి వెళ్ళాను. ఆ వార్డులో సిస్టర్ని అడిగితే “మూడు గంటలకే చనిపోయాడండీ” అన్నది.

ఎలా నమ్మను? అంతకు ముందు మూడే మూడు రోజుల క్రితం. ఆకాశవాణిలో ఉన్న మా అల్లుడు విజయరాఘవరెడ్డి తో పనిపడి స్టేషన్ కి వెళ్ళాను. రాణి, వేణుగోపాల్ రెడ్డి, నా కూతురు అనౌన్సర్ అమృత, అందరూ డ్యూటీ రూంలో కూర్చొని ఉన్నారు. నన్ను చూస్తూనే ఆరవేటి లేచి “రా మామా!” అంటూ నవ్వుతూ పలకరించాడు. మొగం కలకలలాడుతూ ఉన్నది.

“ఏం వాయ్? మనం మొగాలకు రంగు పట్టించుకోని ఏండ్లు గడిచిపోయాయి కదా? మొగం ఒక్క వెలుగు వెలిగిపోతూ ఉందే? పౌడరేమన్నా దట్టించావా?” అన్నాను హేళనగా.

అదేం లేదు మామా! ఆరోగ్యం పుంజుకొంటూ ఉన్నాను” అన్నాడు తెంపుగా. “ఏం పుంజుకొంటున్నావో? ఎక్కడిదక్కడ సళ్ళూడిపోతుంటే” ఆ మాటతో ఠీవీగా నిలబడ్డాడు. కుడిచేతిని వంచాడు. దారుడ్యాన్ని రెట్టలోకి ఎక్కించాడు. రెట్టమదాన్ని పట్టి చూసుకోమంటూ పంతానికి దిగిన మనిషి ఊహించలేని విధంగా పోయాడంటే ఎలా నమ్మను? నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఆ నిజం గుండెను పిండితే రెండు కన్నీటి ముత్యాలు ఆరవేటి పడుకొన్న పడక మీద!

నన్ను ఆకాశావాణికి పరిచయం చేసిన సహృదయమూర్తి రాళ్ళపల్లి విశ్వనాధం. ఆయన కడపలో ఉండగా ఎప్పుడూ ఆరవేటిని పేరుపెట్టి పిలవలేదు. ఆప్యాయంగా ‘చిరంజీవి’ అని పిలిచేవాడు. అంత మనిషీ వాక్కు కూడా ఫలించలేకపోయిందే!

సీమలో చిన్నబోయిన జానపదం నన్ను చూసి వెక్కిరిస్తుంటే, వెక్కి వెక్కి ఏడుస్తూ – మూడు రోజులకు ముందు సరసోక్తులాడుకొన్న గొంతు మూగబోతే చూడలేక ఒక్క పూలమాలతో నివాలులర్పించుకోన్నాను. అది కూడా నా అల్లుడు మాధవరెడ్డి చేతుల మీదుగా!

రచయిత గురించి

కీ.శే పులికంటి కృష్ణారెడ్డి (జ.1931 – మ.2007) గారు కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. వీరు 1931 జూలై 30న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించారు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాశారు. రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన వీరు ‘గూడుకోసం గువ్వలు’, ‘పులికంటి కథలు’, ‘పులికంటి దళిత కథలు’, ‘పులికంటి కథావాహిని’ పేర సంపుటాలను వెలువరించారు.వీరు రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి. వీరి ‘అగ్గిపుల్ల’ నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్‌ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించారు.  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఆయనను గౌరవ డాక్టరేట్‌‌తో  సత్కరించింది.

ఇదీ చదవండి!

దూరం సేను

వదిమాను సేనుకాడ : జానపదగీతం

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా …

2 వ్యాఖ్యలు

  1. చాలా కాలం తరువాత శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారిని,శ్రీ ఆరవేటి శ్రీనివాసులు గారి గురించి తలుచుకుంటే ఒక రకమైన ఉద్వేగం కలుగుతోంది. వీళ్ళందరూ రాయలసీమ మట్టిలో పుట్టిన వజ్రాలు. ఈ వ్యాసం చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: