ఆయన ఒక్కడే అవినీతి పరుడా?

రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది.ఆమాటకు వస్తే అన్ని విషయాలలోను పరస్పర వైరుధ్యాలతో మన సమాజం కొట్టుమిట్టాడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని నెత్తికెత్తుకుని లబ్ది పొందాలని చూస్తున్న కొందరు రాజకీయ నాయకులు తామే హజారే తర్వాత హజారేలమంటూ బాగానే హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా అవినీతి నిర్మూలనకు కరెన్సీ నోట్లు రద్దు చేయాలంటూ పాటలు మొదలు పెట్టారు.పాపం ఈ ఆలోచన రిజర్వ్ బ్యాంకు వారికి కానీ ఆర్ధిక వేత్త అయిన మన ప్రధానుల వారికి కానీ వచ్చినట్లు లేదు.బహుశా వైకాపాను చికాకు పెట్టగలిగిన అంశమైన అవినీతి తన 2014 కలను సాకారం చేస్తుందని భావిస్తున్నట్లున్నారు. బాబు గారి ఊపు చూస్తుంటే పాపం నల్లధనాన్ని జనాలు ఖర్చుపెట్టే వరకూ నిద్ర పోయేలా లేరు.

ఇంకొక పక్క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ విచారణ జరుగుతున్న తీరు సందేహాస్పదంగా ఉంది. జగన్ బెయిల్ విషయంలో న్యాయస్థానాలలో వెలువడుతున్న తీర్పులు న్యాయవాదులకు సైతం అంతుబట్టకుండా ఉన్నాయి. ఇదంతా పద్దతి (చట్టం) ప్రకారమే జరుగుతోంది అని  తెదేపా వాదిస్తుంటే – కోర్టులను నేరుగా విమర్శించకుండా ఎక్కడో ఏదో జరుగుతోంది అన్న అనుమానాన్ని వైకాపా వ్యక్త పరుస్తోంది. పైగా ఇదంతా బాబు దర్శకత్వంలో జరుగుతోన్దేమోనని వారి అనుమానం.

జగన్
జగన్

మరోపక్క హఠాత్తుగా సొంత మంత్రులను సాగనంపి అవినీతి మకిలి తొలగించుకోవాలని కాంగ్రెసు ఉబలాటపడుతోంది. పనిలో పనిగా కుమ్ములాటలను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చాటానికి వారికి ఇంతకూ మించిన మార్గం కనిపించనట్లుంది. సందట్లో సడేమియా మాదిరి కొంతమంది ఆశావాహులు మంత్రిగిరీ కోసం  మంత్రాగం   నెరిపే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. పాపం ఆనం వంటి వారు కిరణ్ను నమ్ముకుని లాభం లేదనుకున్నారో ఏమో … మంత్రిగిరీ ఉన్నతి కోసమని లేని కోపాన్ని తెచ్చుకుని జైల్లో ఉన్న వైకాపా అధినేతపైన ఒంటికాలు మీద లేస్తున్నారు.  ఒక్కోసారి ఆనం వారి భాషణం శృతి మించుతోంది.

జగన్ అరెస్టై ఒక సంవత్సరం అవుతోంది. ఈ  సందర్భంలో –  గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు రాసిన ఒక వ్యాసం నుండి కొంత భాగం దిగువన ఇస్తున్నాం.

ఇప్పుడు సాగుతున్న ఒక వ్యవహారం చూస్తుంటే మన రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవినీతి పరుడు,ఆయన వల్లే రాష్ట్రం అంతా అవినీతి మయం అయిపోయిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. అలాంటి భావన కలిగించడానికి తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలు, కొన్ని ..కాదు మెజారిటీ మీడియా సంస్థలూ విశ్వ యత్నం చేస్తున్నాయి. మంచిదే.అందులో తప్పు లేదు.ఎవరు అవినీతికి పాల్పడినా దానిని ఎండగట్టవలసిందే.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కుంభకోణాలు జరిగిన మాట నిజమే కావచ్చు. వాటివల్ల కొందరు లబ్ది పొంది ఉండవచ్చు.వారిలో జగన్ కూడా ఉండవచ్చు.కాదు. ఉన్నారు . మరి అలాంటప్పుడు వారికి శిక్ష పడడంలో తప్పేముంది ? తప్పేమి లేదు.

నిజంగా జగన్ కాని, ఆయన తండ్రి కాని అవినీతికి పాల్పడలేదని, వారే మీ సంపాదించుకోలేదని జనం ఎవరూ అనుకోవడం లేదు.అయినా ఎందుకు జగన్ కు మద్దతుగా కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దపడ్డారు? వారికి నైతిక విలువలు లేవా? అంటే మామూలుగా అయితే లేవనే సమాధానం రావాలి. కాని ఇప్పుడు విలువలు మారిపోయాయి.

ఒకరికి నైతిక విలువ అన్నది మరొకరికి కాకుండా పోయింది. ఒకరికి అధర్మం అన్నది మరొకరికి ధర్మం అవుతోంది. ఎందువల్ల? ఎందువల్లనంటే మానవ నైజంలోనే ఒక బలహీనత ఉంటుంది. ఒక ఘటన జరిగితే, అందులో అనేక మంది పాత్ర ధారులు ఉన్నప్పుడు వారినెవ్వరిని కాదని, కేవలం ఒక్కరినే లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అదీ కాక అతనివల్ల రాజకీయంగానో, మరో రకంగానో నష్టం కలుగుతుందన్న భావనతోనో అతనిని అణచి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న సందేహం కలిగినప్పుడు ఇలాంటి సానుభూతి వ్యక్తం అవుతుంది.

చదవండి :  నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉననప్పుడు ఇవే ఆరోపణలను ప్రధాని మొదలు అందరికి అందచేసినప్పుడు పట్టించుకోకపోవడం ద్వారా వారు కూడా బాధ్యులు అవ్వడం లేదా?జగన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఆ తర్వాతే ఇవన్నిజరుగుతున్నాయన్న అనుమానం వచ్చినా ప్రజలలో సానుభూతి రావడానికి ఆస్కకారం కలుగుతోంది.జగన్ కేసును వివరంగా చూద్దాం.

2004 లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి బంధుకోటి అనేక మంది ,స్నేహితులు,  సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది బ్రహ్మండంగా బాగుపడ్డారు.అయినా ఆ రోజులలో ఇదే కాంగ్రెస్ మంత్రివర్గంలోని వారంతా వై.ఎస్.కు వీర మద్దతుదారులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా, పోటీపడి ఖండించారు. ఎదురుదాడి చేసేవారు. రాజశేఖరరెడ్డి అంతటి నీతిమంతుడు లేడని వీరంతా వాదించారు.జగన్ కేసును తానే వాదించానని ప్రస్తుత ముఖ్యమంత్రి , అప్పటి ఛీప్‌ విప్‌ అయిన కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు.అంటే అప్పట్లో ఎవరికి కావవలసింది వారు చేసుకున్నారు . అందువల్ల అప్పట్లో ఏది అవినీతిగా కనిపించలేదు. ఏదీ నేరంగా కనిపించలేదు. ఆ రోజులలో జగన్ కు వ్యతిరేకంగా అనేక కధనాలు వచ్చేవి. అయినా వాటన్నిటిని కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చేవారు. ఇక తెలుగుదేశం పార్టీ వారి రాజకీయంలో భాగంగానే కావచ్చు.. రాష్ట్రపతి, దేశ ప్రధాని , కేంద్ర హోం మంత్రి తో సహా పలువురికి పెద్ద పెద్ద గ్రంధాలు ఇచ్చి వచ్చారు. మరి వాటన్నిటిని అంత పెద్ద బాధ్యతలలో ఉన్నవారు చెత్తబుట్టలో ఎందుకు పారేశారు. అప్పట్లో వారెవ్వరికి అవినీతి కనిపించలేదా?అంతేకాక కోర్టులలో సైతం రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన దాఖాలాలు పెద్దగా లేవు.

మరి అలాంటిది ఇప్పుడు ఇంత సడన్ గా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా లేఖ రాయడం, హైకోర్టు స్పందించడం, దానిపై సిబిఐ వేగంగా పని ఆరంభించడం, అందులో కొందరికి మినహాయింపు లభిస్తోందన్న భావన వ్యాపించడం, ఇదేదో కావాలని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ అనే ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని వ్యవహారం నడుస్తున్నదన్న అభిప్రాయం రావడం వల్ల ఇదంతా వివాదాస్పదంగా మారింది. కోర్టులను కూడా తప్పు పడతారా అని ఇప్పుడు తెలుగుదేశం,కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఒకప్పుడు ఇదే సమస్య ఎన్.టి.ఆర్.కు వచ్చింది. నిజానికి ఎన్.టిఆర్ పై అంత తీవ్రమైన అభియోగాలు రాలేదు. కాని హైకోర్టు మాత్రం ఏవో కొన్ని చిన్న ,చిన్న కేసులలో తప్పు పట్టింది. అవి కాంగ్రెస్ వారికి ఆయుధాలుగా మారాయి.ఆ సమయంలో ఎన్.టి ఆర్ తో సహా టిడిపి నేతలంతా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.కాని చిత్రంగా ఎన్.టి.ఆర్ ఆ ఎన్నికలలో ఓడిపోయారు. అంతమాత్రాన ఆయన అవినీతి పరుడు అయిపోలేదు. ఆయన అవినీతిపరుడు కాదని చాలామంది నమ్ముతారు. కాని ఏమి చేస్తాం కోర్టు ఆయనకు అక్షింతలు వేసింది.

ఇక జగన్ కేసులో ఇందుకు విరుధ్దంగా జరిగింది. కడప ఉప ఎన్నికలలో జగన్ ఐదు లక్షల నలభై వేలకు పైగా మెజార్టీతో గెలవడమే కాకుండా, ప్రత్యర్ది కాంగ్రెస్,టిడిపిలకు డిపాజిట్ రాకుండా పోయింది. ఆ తర్వాత ఈ సన్నివేశం మొదలవడంతో జనంలో ఒక అనుమానం.ఒక సందేహం. అయితే కోర్టులను అనకుండా జాగ్రత్తగా సిబిఐ మీద, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, జగన్ మద్దతుదారులు పూనుకున్నారు. అయితే ఇక్కడ హైకోర్టు జగన్ పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశాన్ని ఇవ్వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. అలాగే ఎలాంటి ఉద్దేశ్యాలను ఆపాదించరు.

చదవండి :  ముఖ్యమంత్రి గారొచ్చారు, కొత్త బిరుదిచ్చారు

కాకపోతే హైకోర్టు వారు కూడా మరి ఎందువల్ల అలా చేశారో తెలియదు కాని, సిబి ఐ నుంచి ప్రాధమిక విచారణ నివేదిక కోరి, అది వచ్చాక, దానిని పరిగణనలోకి తీసుకోకుండా శంకరరావు, ఇతరులు వేసిన పిటిషన్ల లోని అంశాల ఆధారంగానే పూర్తి విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు.మరి వారి వద్ద ఇంకేదైనా సమాచారం ఉండి ఉండవచ్చు. మంచిదే.అవినీతికి వ్యతిరేకంగా వారు బాగా స్పందించారని అనుకున్నారు. అలాగే మరికొందరిపై కూడా ఇలాంటి కేసులు ఉన్న పక్షంలో వాటిని కూడా చేపడితే బాగుంటుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

అదే సమయంలో ప్రభుత్వంలో అసలు ఏమి జరిగిందో కూడా విచారణకు ఆదేశిస్తే, లేదా హైకోర్టు ఆదేశాలను గమనంలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంలో ముందుగా ఏ, ఏ నిర్ణయాలు జరిగాయి. వాటి ప్రకారం అసలు ప్రభుత్వం ద్వారా ఈ పారిశ్రామికవేత్తలకు ఏ, ఏ లబ్ది కలిగింది? అది పద్దతి ప్రకారం జరిగిందా?స్థలాలు, లేదా ఇతరత్రా ఏవైనా రాయితీలు పారిశ్రామికవేత్తలు అనుచితంగా పొందారా? లేదా అన్నది పరిశీలించినట్లు కనబడకపోవడం తో కూడా సందేహాలకు తావిస్తోంది. ఇక కొందరిని మినహాయిస్తున్న తీరు కూడా ప్రశ్నలకు అవకాశం కలిగిస్తోంది.

లగడపాటి శ్రీధర్ లబ్ది పొందలేదని నిర్ధారణకు వచ్చాం కనుక ఆయన పేరు తీసివేశామని సిబిఐ చెప్పింది. మరికొందరిని కూడా తొలగించారు. కాని వారు కూడా పది రూపాయల షేర్ ను మూడువందల ఏభై రూపాయలకు కొన్నారు కదా?వారు కొంటే తప్పు లేదన్నప్పుడు, మిగిలినవారు కొంటే అది లాభం పొందడం వల్లనే కొన్నారన్న నిర్ధారణకు ఎలా రాగలుతారు?అన్నది కొందరి ప్రశ్న. సిబిఐ రాజకీయ ఒత్తిడులకు లొంగుతోందన్న భావన కలగనివ్వరాదు. అలా చేయాలంటే ముందు తలనుంచి దర్యాప్తు ఆరంభించి తోక వరకు వస్తే బాగుండేది. అందుకు విరుద్దంగా జరుగుతోందనిపిస్తోంది.

అలా చేసినా తప్పు లేదు. కాని దర్యాప్తు వెళ్లవలసిన అన్ని చోట్లకు వెళ్లడం లేదని అందరికి తెలిసిపోయేలా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ ను ఎలా బుక్ చేయాలన్నదానిపైనే దృష్టి పెట్టారని, దీనికి కారణం కేంద్రంలోని నేతలే నన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని సోనియాగాంధీ అహ్మద్ పటేల్ లకు తెలియకుండానే రాజశేఖరరెడ్డి ఇన్ని అవినీతి పనులు చేశారని మనం నమ్మాలి. అలాగే రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో ఉన్న వారెవ్వరికి సంబంధం లేకుండానే ఇవన్ని జరిగిపోయానని నమ్మాలి.అధికారంలో లేని జగన్ ఒక్కరే ఇవన్ని చేశారని అంటే నమ్మాలి. మళ్లీ రాజశేఖరరెడ్డి కి జగన్ అప్రతిష్ట తెస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు అంటారు.అసలు రాజశేఖరరెడ్డే దీనంతటికి కారణమని మరికొందరు కాంగ్రెస్ నేతలు అంటారు. వారిలోనే వైరుధ్యం. తండ్రి,కొడుకులు కలిసి కుట్ర పన్నారని సిబిఐ చెబుతుంది.అధికారంలో లేకపోయినా జగన్ ఒక్కడే అవినీతికి పాల్పడ్డారని,అధికారం ఉన్నవారెవ్వరూ ఇందులో భాగస్వాములు కాకపోవడం కూడా చిత్రంగానే ఉంటుంది.

ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వారి వ్యూహం ఏమైనా కావచ్చు. ఎక్కడా మంత్రులనుకాని, ఇతర ముఖ్యులను కాని విమర్శించడం లేదు. కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ వారు చెప్పే విషయాలనే తెలుగుదేశం వారు చెబుతున్నారు. తెలుగుదేశం వారు చెప్పే అంశాలనే కాంగ్రెస్ వారు వివరిస్తున్నారు.దీనితో ఇదేదే కావాలని వీరిద్దరూ కలిసి చేస్తున్నారన్న భావనకు వీరు అవకాశం ఇస్తున్నారు.

చదవండి :  కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

అలాగే ఎమ్మార్ వ్యవహారంలో కూడా అసలు ఆ ప్రాజెక్టు మొదలైనప్పట్టి నుంచి పరిశీలించి ఎవరి తప్పు ఎంత ఉందన్నది, ఎవరెవరికి ఆ కుంభకోణంలోని నిందితులకు సంబంధాలు ఉన్నాయన్నదానిపై సిబిఐ దర్యాప్తు చేసే పరిస్థితిలో ఉందా అన్న అనుమానాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.వీరి అనుమానాలను కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది. కేవలం కొందరిని బలిపశువులు చేసి మిగిలినవారిని , అదీ కూడా అధికార పక్షంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారైతే ఇబ్బంది ఉండదన్న అభియోగానికి అవకాశం ఇస్తే అది అవినీతిని అరికట్టాలన్న లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుంది.

అక్కడి కి జగన్ ఒక్కడే అవినీతి పరుడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనవల్లే పాడైపోయినట్లు, అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారంతా కడిగిన ముత్యాలు అన్నట్లుగా జగన్ పై దాడి జరుగుతుండడం వల్ల ప్రజలలో సానుభూతి పెరుగుతోందనిపిస్తోంది. ఇక్కడ మరో కోణం కూడా ఆలోచించాలి.రాష్ట్రం అంతా ఒక సంక్షోభంలో ఉంది. తెలంగాణ సమస్య కారణంగా, ఉద్యమాల కారణంగా పరిశ్రమలు రావడం లేదు.

జగన్ కేసు కారణంగా ఈ పరిశ్రమలన్నిటిపై దాడి చేసి , వారిని ఇబ్బంది పెడితే అది మరింత ప్రమాదం జరుగుతుంది. రాజకీయ కక్షలకు రాష్ట్రాన్ని పరిశ్రమలను బలిచేయవద్దు. ఎవరైనా తప్పు చేస్తే దానివరకు పరిమితం కావాలి కాని, వేలాది మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలు మూతపడే రీతిలో కనుక సిబిఐకాని, ప్రభుత్వం కాని, రాజకీయ పార్టీలు కాని వ్యవహరిస్తే అది రాష్ట్రానికి మరింత తీరని నష్టం కలిగిస్తుంది. నిజానికి రాష్ట్రంలోకాని, దేశంలో కాని అవకతవకలు లేకుండా నడిచే పరిశ్రమ ఒక్కటి లేదన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

అంతదాకా ఎందుకు 2జి వ్యవహారంలో టాటా అంతటి వ్యక్తిపైనే ఆరోపణలు వచ్చాయి. అలాగే రిలయన్స్ అంబానీల ఎదుగుదల లో ఎన్నో అవినీతి కోణాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అలా అని అవినీతిని సమర్ధించడం కాదు. కాని మన దేశంలో ఇది ఒక విష వలయంగా మారింది. అవినీతిని అరికట్టదలిస్తే చిత్తశుద్దితో చేయాలి. అంతే తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం వల్ల నష్టం కలుగుతుందని చెప్పడమే ఉద్దేశం. కచ్చితంగా అవినీతి ఎక్కడా ఉన్నా అడ్డుకోవాలి. అయితే అది కొందరికే పరిమితం కారాదు.

ఒక్కటి మాత్రం వాస్తవం. జాతీయ జెండా పుచ్చుకుని అవినీతికి వ్యతిరేకంగా పాదయాత్రలో, ఇంకో యాత్రలో చేసినంత మాత్రాన ఎవరూ నీతిమంతులైపోరు. అలాగే జనం మద్దతు ఉన్నంత మాత్రాన ఎవరూ నీతిమంతులైపోరు. ఎవరైనా ఆచరణలో నిజాయితీని ఆచరించి చూపితేనే నమ్ముతారు. చంద్రబాబు నాయుడు ను ఒక విద్యార్ధి ఒక ప్రశ్న వేశాడు. ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టకుండా నేతలు ఉండలేరా?అని అడిగితే,ఆయన ఏమి చెప్పారో తెలుసా? జనం డబ్బులు తీసుకోకుండా ఉంటే నేతలు ఖర్చు పెట్టరని అన్నారు. నిజమే ఇది విత్తు ముందా? చెట్టు మందా అన్న రీతిగా మారింది. ఈ నేతలు మారరు. ఈ జనమూ మారరు. ఏదో మధ్యలో ఇలాంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాలన్నీ మనల్ని మనం సంతృప్తి పరచుకోవడానికి ఆడుకునే నాటకాలేనా?

ఇదీ చదవండి!

రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్

వైఎస్ అంతిమ క్షణాలు…

రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: