
పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ
కడప : మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆది కాంగ్రెస్ లో ఉన్నారు. 2014లో వైకాపా తరపున శాసనసభ్యునిగా గెలిచిన ఆది పార్టీ ఫిరాయించి తెదేపాలో చేరి మంత్రి పదవి పొందారు. అధికారం పోయాక ఇప్పుడు సైకిల్ పార్టీని వదిలిపెట్టి పువ్వు పార్టీలో చేరారు.
పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు 2019 ఎన్నికల్లో ఆయనకు గుణపాటం నేర్పారు. జమ్మలమడుగులో ఆయన బలపర్చిన రామసుబ్బారెడ్డిని ఓడించారు. కడప ఎంపీగా పోటీచేసి పరాజయం మూటగట్టుకున్నారు.
చంద్రబాబే కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇదే పంథాలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వంతయింది. ఇన్నాళ్లు పార్టీలో అన్నిరకాల పదవులు అనుభవించి నేతలు పార్టీని వీడి వెళుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు. దీన్నిబట్టి మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారం ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ గా మారింది.