
పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’
కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుమారు 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుంది.
ఇక్కడ శాస్త్రవేత్తల ద్వారా అరటిలోని అన్నిరకాలపై పరిశోధనలు చేస్తారు. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన రకం ఏది, తెగుళ్లను తట్టుకోవడంతో పాటు దిగుబడి నాణ్యత పెరిగేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండటంతో అరటికి వ్యాపించే తెగుళ్లు, ఇతర సమస్యలకు సత్వరం పరిష్కారం లభించనుంది.
జూన్ 8న (సోమవారం) ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గండి క్షేత్రంలో ఈ పరిశోధనా కేంద్రానికి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.
కడప జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన అరటి రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇక్కడ అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
గండిక్షేత్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులతోపాటు ఈ పరిశోధన కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రం కార్యరూపం దాలిస్తే అరటిరైతులకు మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
అరటి ఎగుమతులకు జిల్లాలోని పులివెందుల, రైల్వేకోడూరు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు.