అన్నమయ్య

అన్నమయ్య కథ : 4వ భాగం

అలమేలు మంగమ్మ – అనుగ్రహం

అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా “తల్లీ! నాకు కళ్ళు కనిపించడం లేదు” అన్నాడు.

మంగమ్మ బాలుని ఊరడిస్తూ “బాబూ ఈ కొండ సాలగ్రామ శిలలతో కూడుకొన్నది. చెప్పులు తొలగించి చూడు” అన్నది. అన్నమయ్య పాదరక్షలు (చెప్పులు) తీసివేసినాడు. పర్వతమంతా తేజస్సుతో విరాజిల్లుతున్నది. చెట్టుచెట్టులో మునిపుంగవులు కనిపిస్తున్నారు. మృగాలలో దేవతలు గోచరిస్తున్నారు. హరి దశావతారాలు క్రమంగా కనిపిస్తున్నాయి. వేదఘోషలు వినిపిస్తున్నాయి.

చదవండి :  అన్నమయ్య 512వ వర్థంతి ఉత్సవాలు మొదలైనాయి

అన్నమయ్య ఆశ్చర్యంతో, ఆనందంతో ఆ పవిత్ర పర్వతానికి నమస్కరించినాడు.  అలమేలు మంగమ్మ అన్నమయ్యను దగ్గరకు తీసుకుని ప్రసాదాలు తినిపించింది. అన్నమయ్యలో సరస్వతీదేవి అంశ ప్రవేశించింది. తనకు తెలియకుండానే కవిత్వం పెల్లుబికింది. ఆవేశంతో ఆశువుగా ఒక శతకాన్ని అలమేలు మంగమ్మకు అంకితం చేశాడు. ఆ శతకంలో చంపకమాల, ఉత్పలమాల వృత్తాలు మాత్రమే ఉన్నాయి. అంటే సంపెంగలు, కలువలు అన్నమాట. పూలవంటి పద్యాలతో పూవు మీద పుట్టిన మంగమ్మ పాదాలను అర్చించినాడు. ‘అలమేలు మంగ’ అంటే ‘పువ్వు మీద నిలచిన యువతి’ అని అర్థం.

“అమ్మకు తాళ్ళపాక ఘను
డన్నడు పద్య శతంబు సెప్పె, కో
కొమ్మని వాగ్ప్రసూనముల
కూరిమితో అలిమేలు మంగకున్
నెమ్మది నీవు చేకొని య
నేకయగంబుల్ బ్రహ్మకల్పముల్
సమ్మది మంది వర్థిలుము
జవ్వన లీలల వేంకటేశ్వరా !”

చదవండి :  దేవుని కడప రథోత్సవం వైభవం తెలిపే అన్నమయ్య సంకీర్తన

పుష్కరిణీ స్నానం:

tirumala pushkarini
స్వామి పుష్కరిణీ

తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య నేరుగా పుష్కరిణి వద్దకు వెళ్ళినాడు. దీనిని స్వామి పుష్కరిణి అంటారు. ఇది సరోవరాలలో మహారాజు లాంటిది.  ఈ పుష్కరిణిలో కొన్ని వేల పుణ్య నదుల నీళ్ళు కలుస్తాయట. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలై పోతాయట. అన్నమయ్య ఆ పవిత్ర జలాలలో స్నానం చేసినాడు.

వరాహ క్షేత్రం:

అన్నమయ్య కొండెక్కి బాగా అలసిపోయాడా! అక్కడ స్నానం చేస్తూనే అతనికి అన్ని నొప్పులూ తొలగిపోయాయి. మనస్సు ఎంతో నిర్మలంగా ఉంది. నేరుగా వరాహస్వామిని దర్శించున్నాడు. తిరుమలకు వరాహక్షేత్రం అని పేరు. అక్కడ ఆది వరాహస్వామి నివసించేవాడు. ఇతడే వెంకటేశ్వరస్వామి ఉండటానికి అనుమతి ఇచ్చాడు. దానికి కృతజ్ఞతగా తొలుత వరాహస్వామి దర్శనం చేసుకొన్న తర్వాతనే తన దర్శనం అని వేంకటేశ్వరస్వామి కట్టడి చేశాడు. ఇప్పటికీ తోలి పూజా నైవేద్యాలు వరాహస్వామికే.

చదవండి :  దేవుని కడప

(ఇంకా ఉంది)

– కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి

రచయిత గురించి

తితిదే వారి ‘శ్రీనివాస బాలభారతి’ పుస్తకమాలలో భాగంగా ప్రచురించిన ‘అన్నమాచార్యులు’ పుస్తకం కోసం కామిశెట్టి శ్రీనివాసులు గారు పరిశోధించి రాసిన కథ ఇది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే పట్టా పొందినారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వద్ద శిష్యరికం చేసిన వీరు చాలా కాలం పాటు తితిదేలో పనిచేసినారు. తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టుకు, శ్రీ వెంకటేశ్వరా దృశ్య శ్రవణ ప్రాజెక్టుకూ డైరెక్టరుగా వ్యవహరించినారు. అన్నమాచార్య సంకీర్తనలకు వ్యాఖ్యానాలు రాసినారు. తాళ్ళపాక కవుల జీవిత చరిత్రను రాసినారు.

ఇదీ చదవండి!

మారాబత్తుడు

పీనాసి మారాబత్తుడు

తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: