Pedarikam

అదేనా పేదరికం అంటే?

యువరాజా వారు నిద్ర లేచారు. అదేంటోగానీ రాత్రుళ్ళు ఎంతసేపు నిద్రపోయినా వారికి లేచేసరికి బద్ధకంగానే ఉంటుంది. బలవంతాన లేచినా రోజంతా ఏం చెయ్యాలో తోచిచావదు. నాన్నగారు పోయిన తర్వాత ఒక ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పట్నించి నోరూవాయీలేనివాడొకణ్ణి ప్రధానమంత్రిగా పెట్టుకుని రాజ్యవ్యవహారాలు అమ్మగారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ వ్యవహారాల్లో ఒక్కటీ తన బుర్రకెక్కి చావవు. పరివారమూ, వందిమాగధులు మాత్రం తననే సింహాసనం మీద కూర్చోమంటారు, అమ్మేమో ఇంకా సమయం రాలేదంటుంది. ఈలోగా కొరుక్కుతినడానికి గోర్లు కూడా మిగల్లేదు. బోరు కొడుతోందంటే పెళ్ళి చేసుకోమంటారు. పెళ్ళంటే ఎందుకో తెలీదుగానీ తనకు భయమేస్తుంది. అప్పుడప్పుడూ అమ్మాయిలతో స్నేహం చేసి వాళ్లతో బలాదూరుగా తిరగడం బానే ఉంటుంది. కానీ అలా తిరిగితే అప్రతిష్ట అని అందరూ కలిసి అదీ మాన్పించేశారు. దాంతో యువరాజావారికి వొళ్ళుమండిపోయి నేనసలు పెళ్ళే చేసుకోను పొమ్మని చెప్పేశారు. దాంతో అందరికీ తిక్క కుదిరింది. అప్పట్నుంచి తనకు సలహాలు చెప్పే సాహసం ఎవరూ చెయ్యలేదు.

అదంతా గుర్తొచ్చి అప్పటి తన ఘనకార్యానికి ఇప్పుడు తనే మురిసిపోతూ యువరాజా వారు బద్ధకంగా బయటికి నడిచారు. ముందు గదిలో ఎవరో ప్రభుత్వాధికారులు కొన్ని నివేదికలు అమ్మగారికి సమర్పించడానికి వేచిచూస్తున్నారు. తోచీతోచని యువరాజావారు “ఏమిటవి?” అని అడిగారు. పేదరికం లెక్కల గురించి అంతా గొడవ గొడవగా ఉందని మొదలుపెట్టి ఏమిటేమిటో గణాంకాలు, అవి సేకరిచిన పద్ధతులు, పేదరికాన్ని కొలిచే కొలమానాల గురించి ఓపిగ్గా వివరించారు. పేదరికాన్ని కొలవడానికి విభిన్న పద్ధతున్నాయంటారు, ఏ పద్ధతిలో ఏయే కొలమానాలు వాడాలో రకరకాల అభిప్రాయాలున్నాయంటారు, వాటిలో ఏ కొలమానానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో భిన్నాభిప్రాయాలున్నాయంటారు. అవన్నీ అటుంచి అసలు పేదరికమంటే ఏమిటన్నదే యువరాజా వారి బుర్రకెక్కలేదు. వాళ్ళనే అడిగితే రెండురకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే గంభీరంగా తల పంకిస్తూ ఉండిపోయారు. ఆ పద్ధతులను రూపొందించినవారి పేర్లు చెప్పినప్పుడు వాటిలో సురేశ్ టెండూల్కర్ అన్న పేరు వినగానే యువరాజా వారి మస్తిష్కంలో మెరుపు మెరిసినట్లైంది. రమేశ్ టెండూల్కరో సురేశ్ టెండూల్కరో టెండూల్కర్, గవాస్కర్ వీళ్ళు పాటించిన పద్ధతులు, సాధించిన గణాంకాలే అన్నిటికంటే గొప్పవి. తాను రాజు కాగానే వీటినే అధికారిక గణాంకాలుగా పరిగణించమని చట్టం చేస్తాడు అని నిశ్చయించుకుని గబగబా బయటికి నడిచారు.

చదవండి :  ప్రమాణ స్వీకారం చేసినారు...ఆయనొక్కడూ తప్ప!

బయటికి వచ్చాక ఏదో గుర్తొచ్చి, తన వెంట ఉన్న వంది మాగధులను “పేదరికం ఎక్కడ ఉంటుంది?” అని అయోమయంగా అడిగారు. కాసేపు ఆలోచించి, “గుడిసెల్లో ఉంటుంది ప్రభూ” అని వాళ్ళు భక్తిగా బదులిచ్చారు. “దాన్ని నేను చూడాలి” అన్నారు యువరాజా వారు గంభీరంగా. విషయం అమ్మగారికి తెలియజేయబడింది. తెలుసుకున్న అమ్మగారు తన తనయుడు దారిలో పడుతున్నాడని మురిసిపోయి వెంటనే అనుమతిచ్చేశారు. కానీ తీరా పేదరికాన్ని చూసి అక్కడ వీడేమైనా అవకతవకగా మాట్లాడుతాడేమోనని అక్కడేమైనా కావాలనిపించినా, సందేహమొచ్చినా వెంటనే అడిగెయ్యకుండా సంయమనం పాటించమని గట్టిగా వార్నింగులు మరియు అక్కడెలా ప్రవర్తించాలో, ఏమేం మాట్లాడాలో ట్రెయినింగులు ఇచ్చి మరీ పంపారు. బయలుదేరడానికి ముందు “పేదరికం అంటే ఏమిటి?” అనే మౌలికమైన ప్రశ్న అబ్బాయి గారు అడగాలేదు, “ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రాజ్యాధికారం మన చేతిలో లేకపోవడమే మన కుటుంబానికి పేదరికం” అని అమ్మగారు చెప్పాలేదు. ఐతే పేదరికాన్ని ఎక్కడ కలవాలి అన్న ప్రశ్న ఎదురైనప్పుడు మన రాజ్యంలో మనం పేదరికాన్ని కలవడం మంచి శకునం కాదని, ఏ విదర్భలోనో, విదేహలోనో కలిస్తే మంచిదేమో అని ప్రకాశంగా సందేహించారు అమ్మగారు. ఐతే మనకు అడ్డేమిటి? అక్కడే కలుస్తాను అని బయలుదేరారు యువరాజా వారు. అలా పేదరికాన్ని కలవడానికి రాజుగారు రోడ్డున పడ్డారు. విదర్భ చేరారు. అక్కడ కనబడిన ఒక గుడిసెలో దూరారు. ఆ గుడిసెలో ప్రభావతి అనే ఒక పేదరాలు తన కుటుంబంతో సహా నివసిస్తోంది. యువరాజా వారు ఆ ఇంటిని, ఆ ఇంట్లోవాళ్ళు తినే భోజనాన్ని పరిశీలించారు. ఎన్నో దేశాల వంటకాలు రుచి చూసిన యువరాజా వారికి ఆ భోజనం సహించలేదు. పైగా గుడిసెలోకి ప్రవేశించాక యువరాజా వారికి చాలా సందేహాలు కలిగాయి.

చదవండి :  సొంత భజనతో తరించిన ముఖ్యమంత్రి

ఇల్లు ఇంత శిథిలావస్థలో, ఇంత ఇరుగ్గా ఉందేమిటి?

కూర్చోవడానికి సోఫాలు, పడుకోవడానికి బెడ్లు ఏమీ లేవేమిటి?

ఉక్కగా ఉన్నప్పుడు ఏసీ వేసుకోకపోతే ఎలా?

ఆ ఇల్లు, ఆ ఇంట్లో భోజనం…ఏమిటంత వింతగా ఉన్నాయి?

అదేనా పేదరికం అంటే?

అనుకుంటూ అసంతృప్తిగా, అసహనంగా బయటికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ గుడిసెలో తను చూసిన పేదరికం యువరాజావారికి అసలేం నచ్చలేదు.

అంతఃపురానికి చేరుకున్నాక దీర్ఘంగా ఇలా ఆలోచించారు – తను పేదరికాన్ని కలవాలనుకున్నాడు, కలిశాడు. ఇక చాలనుకున్నాడు, వచ్చేశాడు.

చదవండి :  ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

మరి ఆ ప్రభావతి కుటుంబం అన్ని ఇబ్బందులు పడుతూ అక్కడే ఎందుకున్నారో, బయటికి ఎందుకు వచ్చెయ్యలేదో యువరాజా వారికి అర్థం కాలేదు ఎన్నేళ్ళు గడిచినా…

(గమనిక: ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు. మా మాట నమ్మక మీకు తెలిసినవారిని ఉద్దేశించే అవాస్తవాలు రాశామని భావించి మీకై మీరు మీ మనోభావాలు దెబ్బతీసుకుంటే మా ప్రమేయమేమీ లేదని, దెబ్బ తగిలిన చోట హైడ్రోజన్ పెరాక్సైడుతో శుభ్రం చేసుకొమ్మని మా సలహా.)

– త్రివిక్రమ్

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: