
కీ.శే.నారాయణ స్వామి
సుంకులుగారిపల్లె అచలపీఠం
9న సద్గురు నారాయణరెడ్డి స్వామి వార్షిక ఆరాధన
సుంకులుగారిపల్లె: భగవద్గీత మార్గదర్శకంగా,ధర్మసంస్థాపనే ఆశయంగా మైదుకూరు మండలం సుంకులుగారిపల్లెలో వెలసిన బృందావన ఆశ్రమంలో అచలసిద్ధాంత ప్రచారం జరుగుతోంది. శ్రీమదచల సద్గురు అట్లసాధు నారాయణ రెడ్డి తాత ఆరాధనోత్సవాలు ఈ ఆశ్రమంలో ప్రతియేటా మార్గశిర మాసం బహుళ తదియ నాడు జరుగుతాయి.
ఈ ఆశ్రమ చరిత్ర, నేపథ్యం ఇలా ఉంది. చిత్తూరు జిల్లా వడమాలపేటలో సుమారు 160 యేళ్ళ కిందట హజరత్ బురహనూల్ షా ఖాద్రి పీఠాధిపతిగా అచల సిద్ధాంత పీఠం ఏర్పాటైంది. తర్వాత ఖాద్రి శిష్యుడైన నాదమునేంద్రస్వామి అచల సిద్ధాంత ప్రచార బాధ్యతలను స్వీకరించారు. నాదమునేంద్ర స్వామి శిష్య పరంపరలో ఒకరైన నంబి వేమనార్యుల శిష్యుడైన నారాయణ రెడ్డి తాత సుంకులుగారిపల్లెలో ఆశ్రమాన్ని స్థాపించారు.
ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన అట్ల లింగారెడ్డి, నాగమ్మ దంపతులకు నారాయణ రెడ్డి జన్మించారు. తన 24 యేళ్ళ వయసులో వడమాలపేటలోని సద్గురు నంబి వేమనార్యుల గురుబోధ తీసుకున్నారు. 20 యేళ్ళపాటు అక్కడే ఉంటూ తాత్విక, వేదాంత అధ్యయనాన్ని సాగించారు. అచల సిద్ధాంత ప్రచారం కోసం 50 యేళ్ళ పాటు దేశాటనం చేశారు. ఈయన 50 సంవత్సరాల పాటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాదులోని గురుపుత్రులకు బోధనలు చేశారు. వీరి ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది గురుపుత్రులు అచలపీఠంలో ప్రవేశం పొందారు.
“పరిపూర్ణ సుథానిధి”, “గురుప్రబోధ తారావలి” అనే గ్రథాలను వీరు రచించారు. 1995 డిశంబరు 7 వ తేదీన తన 97 సంవత్సరాల వయసులో శ్రీ నారాయణ రెడ్డి తాత నిర్యాణం చెందారు. ప్రస్తుతం శ్రీ వాదన పిచ్చయ్యార్యులు అశ్రమాన్ని నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు.
9న సద్గురు నారాయణరెడ్డి స్వామి వార్షిక ఆరాధన
మైదుకూరు మండలం సుంకులుగారిపల్లె లో శ్రీ మదచలపీఠ బృందావన ఆశ్రమంలో మార్గశిర బహుళ తదియ తిధిని పురస్కరించుకుని ఈ నెల 9 వతేదీన సద్గురు అట్లసాధు నారాయణరెడ్డి స్వామి నవదశ (19 వ)వార్షిక ఆరాధనోత్సవాలు జరుగుతాయని ఆశ్రమ పీఠాధిపతి వాదన పిచ్చయ్యార్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మధ్యహ్నం 2 గంటలనుండి ఆథ్యాత్మిక ఉపన్యాసాలు ఉంటాయని, పాణ్యం రామిరెడ్డి, యెలిసెట్టి కృష్ణయ్య, కుప్పన్నగారి రాఘవరెడ్డి లు గురుబోధ చేస్తారని వివరించారు. అనంతరం రాత్రి యడవల్లి రమణయ్య భాగవతార్‌చే హరికథా కాలక్షేపం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో సంగీత కచ్చేరి కార్యక్రమాలు జరుగుతాయని పిచ్చయ్యార్యులు తెలిపారు.