బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి

బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి

వాణిజ్య ప్రకటనల యవనిక పై
ఏ సూడో రైతు నాయకుడో
వెండితెర వేలుపో ప్రత్యక్షమై
బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు
చితికిన కొబ్బరి రైతు సాక్షిగా
బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి
కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు

ఖాజీపేట గోళీసోడా,
మైదుకూరి నన్నారి షర్బత్‌,
అనాగరిక పానీయాలంటున్నారు
పులియో గరే, కుర్‌ కురే, పిజ్జా, బర్గర్లను
మహాప్రసాదాలుగా అభివర్ణిస్తున్నారు

చింతకుంట సాయిబులు
ఒంటెద్దు బండ్లో ఉప్పునూ
వంకమర్రి వాళ్లు
చెంబుల పిండినీ అమ్మొచ్చినప్పుడు
వీధుల్ని అలుముకునే జీవన నాదాన్ని
నిర్ధాక్షిణ్యంగా నులిమేస్తున్నారు
విదేశీ ఉప్పుగల్లుకూ, సబ్బుబిళ్లకూ
నాజూకు ముసుగేసి నాట్యం చేయిస్తున్నారు

చదవండి :  నాది నవసీమ గొంతుక (కవిత)

బూవమ్మ అంగట్లోని తియ్యటి బొరుగు ముద్దను
అరచేతిలో వాల్చిన నా బుజ్జి ఐదు పైసల బిళ్ల
శెట్టిగారి అంగట్లోని కమ్మటి నెయ్యిదోశెలను
దోసిట్లో పరిచిన నా చంటి పావలా
కమ్మయ్యగారివనం టెంటులో
పాతాళభైరవి చూపిన నా వరాల అర్ధరూపాయి
దమ్మిడీకి కొరగాకుండా చేస్తున్నారు
ఒకటీ, రెండు, మూడుపైసల నాణేల్ని
ఏనాడో పురావస్తు పద్దులో జమ చేశారు
ఎవరికి పుట్టిన బిడ్డలో అన్నట్టు
ఏ మూలన్నో పడి వెక్కి వెక్కి ఏడ్చేలా చేశారు

డిస్కో థెక్కుల కిక్కులకూ
అర్థరాత్రి నగ్న విన్యాసాలకూ
రాజ గౌరవం కల్పిస్తున్నారు
తోలు బొమ్మలాటలకూ, సురభి నాటకాలకూ
పిచ్చిగుంట్ల కథలకూ, పగటి వేషాలకూ
నైలాన్‌ ఉరితాళ్లు బిగిస్తున్నారు

చదవండి :  అన్నన్నా తిరగబడు... (కవిత) - సడ్లపల్లె చిదంబరరెడ్డి

పాతాళభైరవిలో మాంత్రికుడికీ
బాలనాగమ్మలో మాయలమరాటీకీ
మంత్రాల పెట్టె నాడు నిజాలనే చూపింది.
మన నట్టింట్లోని బుల్లితెరలో
పిశాచాల్లా తిష్టవేసిన వీళ్లు
మనల్ని ఏమార్చి బురిడీ కొట్టిస్తున్నారు

తిండీ,తీర్థం, ఆట,పాట
సేద్యం,వాద్యం, చదువు,చట్టం,
ఒకటేమిటి, అన్నింటా
మన బతుకులను శాసిస్తూ
మనకంటితో మన కంటినే పొడిపిస్తున్నారు

సామ్రాజ్య వాద గారడీలతో
పరాయీకరణ పల్లాయిలతో
మన బతుకుల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ
మెడలకు పలుపుతాళ్లను బిగిస్తున్నారు

ఈ హరితవనం స్మశానం కాకముందే
సంఘటితంగా కాకి గోల చేద్దాం
మన మూలుగుల్ని తొలచివేస్తున్న
ప్రపంచవన్నెల చిలుకలను తరిమేద్దాం
ఈ కాష్ఠానికీ, ఈ దౌష్ట్యానికీ
ఇకనైనా చరమగీతం పాడదాం

చదవండి :  కడప జిల్లాలో కథాసాహిత్యం - డా|| కేతు విశ్వనాధరెడ్డి

[author image=”https://kadapa.info/gallery/albums/userpics/10001/tavva_obul2.jpg” ]

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి  కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. వీరు ఇటీవల దక్షిణ భారతదేశంలోనే విలక్షణమైన కోట, కడప జిల్లాలోని గండికొట పై 112 పేజీల పుస్తకం రచించారు. వివరాలకు 9440024471 నెంబరుకు సంప్రదించవచ్చు.

[/author]

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *