పద్మనాభం ఇంటర్వ్యూ

పద్మనాభం ఇంటర్వ్యూ

అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు …

ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. కొద్దిసేపటికి ఇంట్లో నుండి హాలులోకి వచ్చి ఆత్మీయంగా పలకరించారు 76 సంవత్సరాల పద్మనాభం గారు.

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన బసవరాజు పద్మనాభం తన జ్ఞాపకాల దొంతరలను మా ముందు ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…

“మా ఊరు సింహాద్రిపురం. కడప జిల్లాలోని పులివెందుల తాలూకాలో వున్న మా ఊరిలో 15వేల పైచిలుకు జనాభా ఉంటుందేమో! ఈ మధ్యే మా ఊరిని మండలంగా కూడా చేశారు. మానాన్నగారిది యర్రగుజిపాడు. మా అమ్మగారిది వీరన్నగట్టుపల్లె. వారి వివాహమైన తరువాత మా నాన్నగారికి సింహాద్రిపురం కరణంగా పని రావడంతో వారు అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడే నేను పుట్టాను (20-8-1931).”

చదవండి :  వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

మా ఊరి వాతావరణం, పరిసరాల విషయానికొస్తే అక్కడ అన్నీ కొండలు. కొండల కింద బావులుండేవి. ఒకసారి నేను మిత్రబృందంతో కలిసి ఈత కొట్టేందుకు ఊరికి సమీపంలో ఉన్న బావికి వెళ్ళాము. అప్పటికి నాకు ఈత రాదు. మునగబెండ్లు కట్టుకుని బావిలోకి దూకాను. అంతే ఒక్కసారిగా మునగబెండ్లు నా నడుము నుండి తెగిపోయాయి. అప్పటికి బావిలో ఎవరూ లేరు. నేను అరవడంతో నా వెంట వచ్చిన స్నేహితుడు ప్రభాకరరెడ్డి రక్షించాడు.

మా ఊర్లో చెన్నకేశవులు నాయుడు అనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన దగ్గర హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ ఉండేది. చిన్నప్పుడే నేను ఆ గ్రామ్‌ఫోన్ దగ్గరకు పోయి పాటలు విని పాడడానికి ప్రయత్నించేవాడిని.

ఒకసారి మా ఊరికి సినిమా టెంటు వచ్చింది. అందులో ‘ద్రౌపది వస్త్రాపహరణం’, ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘భక్త ప్రహ్లాద’ వంటి సినిమాలను ప్రదర్శించారు. ఈ సినిమాలన్నింటినీ చూసిన నేను అందులోని పద్యాలు, పాటలు, కామెడీ సీన్లను అనుకరించి ఆనందించేవాడిని.

బోర్డు స్కూల్లో ఒకటో తరగతి చదివేటప్పుడు మా ఊర్లో చింతామణి నాటకం వేశారు. మా మాస్టారు బాబూసాహెబ్ నాకు ఇందులో బాలకృష్ణుడి వేషం ఇచ్చారు.

చదవండి :  కడప నుండి కలెక్టరేట్‌ వరకూ .... తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌
Simhadripuram Town
Simhadripuram Town

మా ఊర్లో మాకు ‘అల్లరి బ్యాచ్’ అనే పేరు కూడా ఉండేది. ఇదే విషయాన్ని మా మాస్టార్లు ఇంటికి వచ్చి మా నాన్నతో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు బీడీ ముక్కలను ఏరుకుని తాగడం కూడా మాకు సరదా.

ఒకసారి బీడి ముక్కలను కాలుస్తుండగా చూసిన నాన్నగారు మమ్మల్ని బెత్తంతో చితకబాదారు. మరోసారి పండుగరోజు ఒళ్ళంతా రంగు పూసుకుని రాక్షసుడి వేషం వేసుకుని ఊరంతా తిరిగాను.

ఎలిమెంటరీ చదువు పూర్తయ్యాక నేను, మా చిన్నాన్న సుదర్శనరావు హైస్కూలు చదువు కోసం ప్రొద్దుటూరుకు వెళ్లాము. అక్కడ సినిమాలు చూసే అలవాటు పెరిగింది.

1942లో నేను చూసిన సినిమాల్లో ‘భక్తపోతన’, ‘కృష్ణప్రేమ’, ‘ఝులా’ ముఖ్యమైనవి.

సైకిల్ కొనాలన్న కోరికతో నేను, మా చిన్నాన్న బెంగుళూరు వెళ్లాం. తరువాత మద్రాసు వెళ్లి పని చూసుకోవాలని నిర్ణయించుకున్నాం.

టికెట్ లేకుండా మద్రాసు చేరుకున్నాం. అక్కడ కన్నాంబ గారి ఇంటికి వెళ్లి వారిని కలిశాం. మా పరిస్థితి తెలుసుకున్న ఆమె మాకు భోజనం పెట్టారు.

తరువాత రాజరాజేశ్వరి కంపెనీలో ఆర్టిస్టులుగా చేరే అవకాశం వచ్చింది. అక్కడ లింగం సుబ్బారావు, గూడవల్లి రామబ్రహ్మం వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఆ విధంగా ‘మాయలోకం’ సినిమాలో నటించే అవకాశం లభించింది.

చదవండి :  గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ
Padmanabham
Padmanabham

‘మాయలోకం’ రషెస్‌లో తెరపై నన్ను నేను చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. తరువాత ‘త్యాగయ్య’, ‘రాధిక’ వంటి సినిమాల్లో నటించాను.

1948లో కొంతకాలం గ్యాప్ రావడంతో మా ఊరికి వెళ్లాను. అప్పటికి నేను నటించిన సినిమాలు అక్కడ టెంటు హాల్లో ప్రదర్శించబడ్డాయి.

తరువాత విజయా-వాహినీ సంస్థలో పర్మినెంట్ ఆర్టిస్టుగా చేరాను. అక్కడ మూడు సంవత్సరాలు పనిచేశాను. అప్పట్లో నాకు నెలకు 150 రూపాయల జీతం, సినిమాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేవారు.

1957లో నా మకాం టి.నగర్‌కు మార్చాను. తరువాత 1958లో నాగార్జున నగర్‌లో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాను.

ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాను. ఇప్పటికీ అప్పుడప్పుడు నా జన్మస్థలమైన సింహాద్రిపురానికి వెళ్ళి వస్తుంటాను.

— తవ్వా విజయభాస్కరరెడ్డి, ప్రవీణ్ కుమార్

వార్తా విభాగం

ఇవీ చదవండి

1 Comment

  • వ్యాసం బాగుంది. పద్మనాభం ఫోటోలు మరిన్ని ఉంటె బాగుండు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: