దానవులపాడు

దానవులపాడు జైన పీఠం

రాయలసీమలో ప్రసిద్ది చెందిన చారిత్రక ప్రదేశం దానవులపాడు – ప్రొద్దుటూరు నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో జమ్మలమడుగుకు పోయే దారిలో రోడ్డు ప్రక్క వుంది. ఈ ప్రాంతం క్రీ.శ. 6వ శతాబ్దంలో జైనమతపీఠంగా ప్రాధాన్యం పొందింది.

దానవులపాడుకు ఆ పేరు ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేము. చరిత్ర పుటలు తిరగేస్తే శాతవాహన, ఇక్ష్వాకు, చాళుక్య, రేనాటిచోళ, నోలంబన, రాష్ట్రకూట రాజుల కాలాల్లో ఈ ప్రాంతానికి హిరణ్య రాష్ట్రమని, టెంకణ ప్రాంతమని పేరున్నట్లు శాసనాల, గ్రంథాల ద్వారా తెలుస్తుంది.

మహావీరుడు మరియు ఆచార్యుల స్తూపం (మద్రాసు మ్యూజియం)
మహావీరుడు మరియు ఆచార్యుల స్తూపం (మద్రాసు మ్యూజియం)

పూర్వం యజ్ఞయాగాదుల్లో నర, జంతుబలులు విరివిగా జరుగుతుండేవి. హింస రాక్షసులు లేదా దానవుల కృత్యం, కాబట్టి ఇక్కడ విపరీతమైన హింస జరగడం వల్ల అహింసావాదులైన జైనులు దాన్ని దానవులపాడుగా వ్యవహరించి తమ పీఠాన్ని నెలకొల్పి యజ్ఞయాగాదులను ఖండించి ఉంటారని ఊహించవచ్చు. ఈ దానవులపాడుకే దాండ్లపాడని, జాండ్లపాడని, గొండ్లపాడని, జైనపాడని వ్యవహార నామాలున్నాయి. ఇక్కడ పార్శ్వనాథుని దాండ్లపాటి దేవుడనీ బిత్తలసామనీ బిత్తలయ్యనీ వ్యవహరిస్తారు.

ఒకప్పుడు తీర్థంకరులు బోధించిన జైన మత సారం భారత, శ్రీలంక దేశాలకే పరిమితమైంది. పన్నెండవ తీర్థంకరుడైన వసుపూజ్యుని కాలంలో జైనులు అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని భట్టిప్రోలుకు వలస వచ్చారని 14వ శతాబ్దానికి చెందిన నయసేనుడు ధర్మయాతమనే కన్నడ గ్రంథంలో రాశాడు.

వర్థమాన మహావీరుడు 11 మంది శిష్యుల సారథ్యంలో 4వేల మంది సన్యాసులతో సంఘాన్ని స్థాపించాడు. ఆ 11మంది శిష్యులను గణాదులు అనేవారు. ఆప్తమిత్రులను శ్రుతకేవలులని అంటారు. వారిలో చివరి వాడు భద్రబాహువు. అతను మౌర్య చంద్రగుప్తుని సలహాదారునిగా ఉన్నాడు. ఈ భద్రబాహువు గణానికి చెందిన వాడే కొండ కుందాచార్యులు, 3వ శతాబ్దం వాడు. ఇతను శిలారూపంలోని సరస్వతిని పలుకవలసిందని బలవంతం చేసిన కారణంగా వారి గణాన్ని బలాత్కార గుణం అనేవారు.

కొండకుందాచార్యులు…

కొండకుందాచార్యులు ప్రస్తుతం గుంతకల్లు సమీపంలోని కొడగండ్ల గ్రామస్థుడు. సంఘంలో చేరకముందు ఆ వంశీకులను పద్మపాదులనేవారు. అతను మహాజ్ఞాని. తత్త్వవేత్త. సీమయసారం, ప్రవచనసారం అనే గ్రంథాలను ప్రాకృత భాషలో రచించాడు. ఇతడు వీత రాగ మార్గాన్ని ప్రబోధించాడు. దక్షిణ భారతదేశానికి చెందిన జైన మతాచార్యులందరు కొండ కుందాచార్యుల వంశానికి చెందినవారే.

తీర్థంకరుడు మరియు మోకాలిపై కూర్చుని ఉన్న సన్యాసి స్తూపము
తీర్థంకరుడు మరియు మోకాలిపై కూర్చుని ఉన్న సన్యాసి స్తూపము

3వ శతాబ్దం మొదట్లో దడిగ మాధవులనే ఇక్ష్వాకు కుమారులు రాష్ట్రకూట రాజులైన నిత్యావర్షుడు, మూడవ కృష్ణుడు అయోధ్య నుంచి దక్షిణ దేశానికి వచ్చి కడప మండలంలో ప్రసిద్ధులైన సింహనందినిని, కొండకుందాచార్యులను కలుసుకున్నారు. సింహనందిని వివిధ కళల్లో ఆరితేరినవాడు. అతడు సిద్ధవటం తాలుకా పేరూరు నగరాన్ని కేంద్రంగా చేసికొని జైనమతాన్ని ప్రచారం చేస్తుండేవాడు. మొట్టమొదట పేరూరులోను, ఆ తరువాత దానవులపాడులోనూ జైనచైత్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయాన్ని మొరం లేదా మొరత అంటారు. అంటే జీవునకు దగ్గరని అర్ధమట, ఆ రెండు చైత్యాలయాలను దర్శించడానికి ఎందరో రాజులు, సామంతులు వచ్చేవారు. చైత్యాలయమనే పేరును బౌద్ధుల నుంచి జైనులు, హిందువులు గ్రహించారు. లంకలోని చైత్యాలయాన్ని వాల్మీకి వర్ణించాడు, బహుశా ఇది ప్రతిష్ఠమై ఉండవచ్చు.

చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!

జైనులలో రెండు వర్గాలున్నాయి. శ్వేతాంబరులు, దిగంబరులు, ఈ ప్రాంతంలోని దిగంబరవర్గానికే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది. 7వ శతాబ్దంలో కొందరు దిగంబర జైనాచార్యులు కడప జిల్లాలో ఉండేవారు. వారిలో కొండకుందాచార్యుల వంశికులేగాక అర్ధమాగధులనే కాయస్థులు కూడా ఉండేవారట. ప్రస్తుత మహారాష్ట్ర భాషే ఆనాటి అర్ధమాగధేయరూపం. ఆ భాషలో సులభశైలిలో జైన వ్యాకరణ గ్రంథాలు రాశాడు. వృషభుడనే ప్రముఖ జైన రాజు దానవులపాడును పరిపాలిస్తూ ఎక్కువ కాలం పెన్నకు అవతల పెనికలపాడు వద్ద ప్రకృతి సిద్ధమైన ఒక గుహలో ఉండేవాడు. దానికి సన్యాసికొండ అని పేరు. ఇప్పటికి పశువుల కాపర్లు సన్యాసి కొండరాళ్లను లావుపాటి గోళీగుండ్లగా తయారు చేసికొని సన్యాసి కొండ బెత్తాలని (గుండ్రని ఆకారం గోళీగుండ్లు) పిలుస్తుంటారు.

వృషభుడు

వృషభుడు కొండకుందాచార్యుల వర్గంలోని వాడు. అతడు సంస్కృతంలో అహష్టుప్ లేదా అనుష్టుప్ చందస్సులో కవితలనేకం రాశాడు. కొండకుందాచార్యులు మాత్రం రచనలను శూరసేన భాషలో రాశాడు. వారి రచనల్లో ప్రసిద్ది పొందింది జైన వ్యాకరణం. కఠినమైన వ్యాకరణ సూత్రాలను కుంద సూత్రం పేరుతో తరువాతి వ్యాకరణకారులు వివరణ చేస్తూ వచ్చారు. బహుశా రుగ్వేదంలోని కుందసూక్తం వలె కుందసూక్తం రూపుదొడిగి ఉండవచ్చునేమో అని సుప్రసిద్ధ వ్యాకరణ పండితులు శ్రీషడ్దర్శనం సుబ్బరామశర్మగారి అభిప్రాయం.

85సెం.మీ ఎత్తు, 26సెం.మీ వెడల్పు కలిగిన నిశీధి స్థూప శాసనం
85సెం.మీ ఎత్తు, 26సెం.మీ వెడల్పు కలిగిన నిశీధి స్థూప శాసనం

జైనమతాచార్యులు బౌద్ధుల మాదిరిగా శిలల్లో విహారాలను తొలచినట్లు ఎక్కడా కనిపించదు. కొనగొండ్ల, చిప్పగిరి, తొగరకుంట్ల, పెనికలపాడు, జాండ్లపాడు గ్రామాల్లో ఉన్న విహారాలు ప్రకృతి సిద్ధమైన గుహలు మాత్రమే. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిపొందిన పాండవ గుళ్లు కూడా జైనమతాచార్యులకు విడిది మందిరాలుగా ఉండేవి. జైనాచార్యులు విడుదలకు వెళ్లే మార్గంలో ఇరుకైన కాలి బాటలుండేవి. వాటిని ఆయా రాజుల చేత విస్తరింపచేశారు. రాష్ట్రకూటుల కాలంలో తిరిగి జైనులకు మంచిరోజులు వచ్చాయి.

మూడవ నిత్యావర్షుని కాలంలో

10వ శతాబ్దానికి చెందిన జైన మత కేంద్రాలలో దానవులపాడు పీఠం చాలా పెద్దది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోని విద్యార్థులు వచ్చి జైనమతానికి సంబంధించిన తాత్త్విక గ్రంథాలను అధ్యయనం చేసేవారు. క్రీ.శ. 914-917 సంవత్సరాల మధ్య మూడవ నిత్యావర్షుని కాలంలో దానవులపాడులో గొప్ప జైనమతపీఠం ఉండేది. ఈ రాజు తన ఆస్థానంలో గల కొండకుందాచార్యులకు సప్త ఫనతుల బంగారపు గొడుగు క్రింద సత్కరించి భూదానమొసగినట్లు అక్కడ ఉన్న శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. పెన్నానది వరద తాకిడి నుంచి రక్షణకు ఈ కేంద్రానికి తూర్పు పడమరలలో 7 మైళ్ల పొడవున పెద్దరాతి బండల గోడ నిర్మించారు. నదినుంచి నీరు తెచ్చుకునేందుకు వీలుగా అక్కడక్కడ మెట్లు కట్టారు. మెటికల పైభాగాన, దిగువ భాగాలలో మొగసాల లేదా రాతి కమాను త్రిప్పిన ద్వారాలు నిర్మించారు. ద్వారాల ప్రక్కగల రాతి మొత్తెపై సింహం, పద్మం గుర్తులున్నాయి. రుతు పవనాల ప్రభావంతో ప్రతిఏటా ఇసుక దిబ్బలేర్పడి దానవులపాడు ఆ దిబ్బలతో పూడిపోయింది.

చదవండి :  పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?

తవ్వకాలు…

దానవులపాడులో దొరికిన హోన్నిచెట్టి నిశీధి స్తూప శాసనం
హోన్నిచెట్టి నిశీధి స్తూప శాసనం (78×42.5 CM)

ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపకులైన కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులు గారు 1904లో ఈ దిబ్బలను తవ్వించారు. రెండు దేవాలయాలు, నాలుగు సమాధిశాలలు, రెండు ముఖాలు గల తీర్థంకరుల పానవట్టం, పది అడుగుల ఎత్తు గల పార్శ్వనాథుని విగ్రహాలు రెండు, పద్మావతి విగ్రహం, రెండు చామర గ్రాహిణులు, ఒక స్నానపీఠం, శిధిలమైన నవగ్రహాల మండపం, మూడడుగుల వెడల్పుతో పెద్ద పద్మాన్ని చెక్కిన రాయి, ధర్మచక్రం ఆ త్రవ్వకాలలో లభించాయి. వీనిలో పార్శ్వనాథుని విగ్రహం, మరొక నవగ్రహ గుడి మాత్రం ఇప్పటికి దానవులపాడులో ఉన్నాయి. పార్శ్వనాథుని గుడి ప్రక్కన ఎర్రరాతిపై ప్రాకృత భాషలో శిధిలమైన శిలాశాసనముంది. తక్కిన వాటిని మద్రాసులో మ్యూజియంలోని జైన గ్యాలరీలో భద్రపరచారు.

క్రీ.శ. 696-737 నాటి విజయాధిత్యుని కన్నడ శాసనమొకటి ఉండేది. అది నేడు కానరాదు. ఇక్కడ విగ్రహం పార్శ్వనాధుడు, దిగంబర విగ్రహం. ఈ విగ్రహం గల గుడిని దద్దలం లేదా మొగడం లేదా ముగురం అంటారు. అంటే మోక్ష సన్నిధికి అని అర్ధమట. ఈ పార్శ్వనాథునే మరి కొందరు జైనులు మహావీరుడంటారు. ఈ విగ్రహం శిరోభాగం వెనుక ఐదు తలల పాము పడగ చిత్రింపబడింది. విశాలమైన రాతి అరుగు, రెండువైపులా సింహారూఢులైన యక్షుల విగ్రహాలున్నాయి. శాంతినాథ తీర్ధంకరుని స్నానార్ధమై ఈ శిలా వేదికను మూడవ ఇంద్రుడు నిర్మించాడు. మరి కొన్ని పానవట్టాలపై శిరస్సు ఖండించబడిన స్త్రీ విగ్రహం ప్రక్కన తీర్ధంకరుని విగ్రహం ఉంది. మరెన్నో శిల్ప వృత్తాదులైన సమాధులున్నాయి. ఈ శిధిలాల్లో రాతి చెరువు, శిలారథమున్నట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని జైన క్షేత్రాల్లో ప్రముఖమైన గ్రామాన్ని జైన శాసనంలో కురుమారి లేదా కురిమారి తీర్ధంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం…

ప్రస్తుతం దానవులపాడులో నల్లరాతి ఆలయ నిర్మాణం చేశారు. జైనుల ఆలయ నిర్మాణంలో బౌద్ధ సంకేతాలైన ధర్మచక్రం, శ్రీరత్నం, ప్రభుసింహాసనం మున్నగు వాటిని స్వీకరించారు. ఈ శిధిల శిల్పకళాఖండాలను నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే, ఆనాటి రాజులు ఔన్నత్యం కంటే శ్రమ జీవుల శిల్ప కళా నైపుణ్యమే వేనోళ్ల కొనియాడతగినది. నాటి శిల్పకళా వైచిత్రి తరువాత కాలంలో విలసిల్లిన శిల్పకారులకు ఒరవడి దిద్ది నూతన కళాకాంతులను విరజిమ్మింది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1990

మూడవ నిత్యావర్షుని కాలంలో ప్రతి మహా శివరాత్రినాడు దానవులపాడులో గొప్ప జైనారాధన జరుగుతుండేది. ఆ పార్శ్వనాథుని గురించి వింత వింత జానపద గేయాలను విరివిగా పాడేవారు. వాటిలో..

బిత్తలసామి వచ్చాడు, బిత్తలసామి వచ్చాడు
బెండ్ల బండి కట్టరండీ ఓ అమ్మలారా
గంధం చెక్క సాదరండీ ఓ అక్కలారా
సామి వీపు రుద్దరండీ..
గండ్లచీర కట్టరండీ ఓ అమ్మలారా
వేపదీపం పెట్టరండీ ఓ అక్కలారా
సామి సుట్టు తిరుగ రండీ

అట్లే

వెన్నెలకు వేటగాడే నా సామి సామి
మబ్బులకు మోటుగాడే
దాండ్లపాటి సామోడంట
దిన్నెమీద ఉన్నోడంట
ఉన్నోళ్లకు లేనోళ్లకు
నెల తప్పుడు చేస్తాడంట
కనుమేతల ఉన్నోడంట
ఇసుకవతల సేరేనంట
అడ్డమొచ్చి నోళ్ల కంత
అడిగిందే తడవంటూ

ఈ రకమైన పదాలెన్నో కాలగర్భంలో కలసిపోయాయి. అంతేగాక ఈ మధ్య మరణించిన శ్రీ కలవటాల జయరామారావుగారు జనుల పాలిటి రక్షకు జైనసామి అన్న మకుటం గల శతకాన్ని రచించినట్లు తెలుస్తుంది.

అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలు

భక్తులు తమ కోరికలు నెరవేరాలని పార్శ్వనాథుని సేవించేవారు. ముఖ్యంగా గొడ్రాళ్లు సంతానం కోసం అర్ధరాత్రి వేళ అక్కడ బస చేసి, పార్శ్వనాథునికి గంధం పూసి, పూజలు, భజనలు చేసేవారు. గొడ్రాండ్రు దిగంబరులై భజనలు, నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు. రానురాను ఇది సభ్య ప్రపంచంలో అశ్లీలమై బూతు తిరునాళ్లుగా మారింది. తరువాత బ్రిటిష్ పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో 1800- 1807 ప్రాంతంలో అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపేశారు. మరి కొంత కాలానికి మరింత జుగుప్సాకరంగా తిరునాళ్ల కొనసాగింది. 1918లో జిల్లా కలెక్టరు గారైన హెచ్.హెచ్. బర్‌కిట్ ఈ ఉత్సవాలను సంపూర్తిగా రద్దు చేశారు.

ఆనాటి నుంచి దానవులపాడు ప్రాశస్త్యం క్రమక్రమంగా అంతరించి చరిత్రలో మరుగుపడిపోయింది. కాని నేటికి మహాశివరాత్రి పండుగ పక్షం రోజులు ముందే బయలుదేరి రాజస్థాన్ ప్రాంతంలోని జైన భక్తులు అనేక జైన దేవాలయాలను సందర్శిస్తూ ఈ దానవులపాడుకు కూడా వచ్చి పార్శ్వనాథుని దర్శించిపోతుంటారు. ఈ గుడిలోని అపురూపమైన కళాఖండాలను వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.

– మల్లేల నారాయణ

ఇదీ చదవండి!

dengue death

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: