కడపపై మరోసారి ఈనాడు అక్కసు

కడపపై మరోసారి ఈనాడు అక్కసు

ఈనాడు అక్కసు

ఈనాడు – యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే “తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది”. ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి. బహుశా కడప జిల్లా ఓటర్లు మరోసారి ఆ పత్రిక సమర్ధిస్తున్న పార్టీలను పక్కన పెట్టారని కాబోలు…

సంపాదకీయం పేర (బాక్స్ చూడండి) ఇవాళ కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి. కడప జిల్లాలో ఘర్షణలు, రాళ్లదాడులు, ఏజెంట్ల అపహరింతలు, దొంగ ఓట్లు, రిగ్గింగు, అభ్యర్థుల నిర్బంధాల వంటి నేరపూరిత కుట్రలు సర్వసాధారణమట. కడప జిల్లాలో గత ముప్పై ఏడేళ్లుగా ప్రజాస్వామ్యం లేదంట. అక్కడికేదో కడపకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక జమీందారీతనం lలేదా రౌడీతనం ఉన్నట్లు. కడపలో జమీందారీతనం ఉన్నట్లయితే అక్కడ రెండు లేదా మూడు పార్టీలు మనుగడలో ఉంటాయా? అక్కడ వివిధ పార్టీలకు చెందిన  వాళ్ళు గెలిచేవారా?

మీకు తెలుసో లేదో కడప జిల్లా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఆ తరువాత ఎన్టీ రామారావు, చంద్రబాబుల ఆధ్వర్యంలో నడిచిన తెదేపాకు సైతం పట్టం కట్టారు. అంతకు పూర్వం కమ్యూనిస్టులను సైతం ఆదరించినారు. కడపలో ప్రాజాస్వామ్యమే లేకపోతే ఇదెలా సాధ్యమయ్యేది?

జమ్మలమడుగు మండలంలోని ఆరు గ్రామాలలోకి తెదేపా వాళ్ళు వెల్లలేకపోతే కడప జిల్లాలో ప్రజాస్వామ్యం అడుగంటినట్లా? ఇదెక్కడి చోద్యం… తెదేపా ప్రాబల్యమున్న అనేక గ్రామాల్లో మిగతా పార్టీల వారిదీ అదే పరిస్థితి. ఎన్నికలప్పుడు ఆయా గ్రామాలలో ఇటువంటి పరిస్తితులను సృష్టించడంలో అన్ని పార్టీల నాయకులకీ ప్రమేయం ఉంది. అంతమాత్రాన కడప జిల్లాలో ప్రజస్వామ్యమే  లేదంటే ఎట్లా? ఎన్నికలప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఇలాంటి చిన్న చిన్న గలాటాలు, గొడవలు జరగడం మామూలే. అవి ఈ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాలేదు. అదేమిటో ఈనాడు వారికి 2004-2009 మధ్యలోనివి మాత్రమే గుర్తుంటాయి. మిగతావి గుర్తుండవు!

చదవండి :  చిన్నచౌకు కార్పోరేటర్ బరిలో సురేష్‌బాబు

ఎన్నికల వేళ పులివెందుల, జమ్మలమడుగులలో జరిగిన ఘటనలను భూతద్దంలో చూపి కడప జిల్లా పైన ఫ్యాక్షన్ ముద్ర రుద్దటం మానవీయత కాదు. జమ్మలమడుగు, పులివెందుల ఘటనలలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందే!

వైఎస్, జగన్లపై ఉన్న ద్వేషాన్ని (ఉదా: సంపాదకీయం వాడిన విపరీత వ్యాఖ్యానాలు – ‘ జగన్ సారథ్యంలోని ఫ్యాక్షనిస్టు తండాలు’,’ మదపిచ్చి ముదిరిన జగన్’,’వైకాపా క్రిమినల్ బుద్ధులు’ … ) కడప జిల్లాకు, ఇక్కడి ప్రజలకు అన్వయించి తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని పేరు గొప్ప పత్రికలకు సవినయంగా మనవి చేస్తున్నాం. గతంలో సైతం కడప జిల్లా అభివృద్ధిని గూర్చి మీరు చేసిన ప్రచారం ఇప్పటికే మాకు గుర్తే!

కుబుసం విడిచిన ఫ్యాక్షనిజం తాలూకు రాక్షసత్వం ఎన్నికల ప్రక్రియను నోట కరచేందుకు సాగించిన దౌర్జన్యాలతో యావత్ సీమాంధ్ర బిత్తరపోయింది. రేపటి సీఎం తానేనంటూ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అర్జీ పత్రాలు ఇప్పుడే పంచిపెట్టే స్థాయిలో మదపిచ్చి ముదిరిన జగన్ దాష్టీకాలకు దన్నుగా- కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. ఘర్షణలు, రాళ్లదాడులు, ఏజెంట్ల అపహరింతలు, దొంగ ఓట్లు, రిగ్గింగు, అభ్యర్థుల నిర్బంధాల వంటి నేరపూరిత కుట్రలతో పోలింగ్ ప్రక్రియ పవిత్రతకే ఎక్కడికక్కడ తూట్లు పొడిచిన వైకాపా- ముప్ఫై ఏడేళ్ల ‘కడపస్వామ్యాన్ని’ సీమాంధ్ర పరగణాలన్నింటికీ విస్తరించాలనే కంకణం కట్టుకొంది. సీమాంధ్ర అంతటా 11,526 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి 272 కంపెనీల పోలీసు బలగాల్ని శాంతిభద్రతల పరిరక్షణకు మోహరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పినా, వైకాపా అరాచకానికి ఏ దశలోనూ పట్టపగ్గాల్లేకపోయాయి. మావోయిస్టుల ప్రభావం ఉన్న విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ ప్రకటిస్తే- జమ్మలమడుగులో పోలీసు ఉన్నతాధికారులపైనే ఫ్యాక్షనిస్టుల పాశవిక దాడి జరిగింది! పాడేరు నియోజకవర్గంలో రెండు ఓటింగ్ యంత్రాల్ని మావోయిస్టులు అపహరించగా, జగన్ సారథ్యంలోని ఫ్యాక్షనిస్టు తండాలు అనేక జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియనే అనుశాసించడానికి సర్వశక్తులూ ఒడ్డాయి. అనేకచోట్ల ఇతర పార్టీల ఏజెంట్లను గెంటేసి, ఏకపక్ష పోలింగుకు సమకట్టిన ప్రతీపశక్తులు, తెదేపా అభ్యర్థులపై రాళ్లదాడులకూ తెగబడ్డాయి. ఇన్ని ఘోరాలు జరిగినా, ఎక్కడా ఓటింగ్ ప్రక్రియకు విఘాతం కలగలేదన్న భన్వర్‌లాల్- కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ సుద్దులు చెబుతున్నారు. వైకాపా గూండాల రాళ్లదాడిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నెత్తురోడుతుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా ముగిశాయని ఈసీ చెప్పుకోవడం నగుబాటు!

చదవండి :  జిల్లాలో భాజపాను బలోపేతం చేస్తాం

రాష్ట్రంలో తొలి విడతగా తెలంగాణలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా ముగిసిపోయాయి. అదే సీమాంధ్రకొచ్చేసరికి ఎందుకింతగా నెత్తురోడాయి? తెలంగాణలోనూ జగన్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగినా, ప్రత్యేక వాతావరణంలో తన పప్పులుడకవని తెలిసి మిన్నకుంది. సీమాంధ్రకు వచ్చేసరికి- జగన్ అస్తిత్వానికే సవాలుగా మారిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే ఏకైక లక్ష్యంగా అన్నిరకాలుగా బరితెగించింది. ‘ఓటు వెయ్యి’ అని ఎన్నికల సంఘం జనజాగృతి కార్యక్రమాలు చేపడితే- ‘ఓటుకు వెయ్యి’ అంటూ వైకాపా అక్రమ ధన ప్రవాహాలకు, నానావిధ ప్రలోభాలకు లాకులెత్తేసింది. హిమాచల్ ప్రదేశ్, గోవా, హర్యానాలకు చెందిన వివిధ బ్రాండ్ల పేరుతో స్పిరిట్, రసాయనాలు, రంగులు కలిపి వైకాపా సరఫరా చేసిన నకిలీ మద్యం ఇప్పటికే కొంతమంది అభాగ్యుల ప్రాణాలు తోడేసింది. మత ప్రార్థనల ముసుగులో పార్టీ ప్రచారాలు, కుల సంఘాలతో విందు రాజకీయాలు కొన్నాళ్లుగా జోరెత్తాయి. కోట్లరూపాయలతో ఎలెక్ట్రానిక్ వస్తూత్పత్తుల్ని కొని బోగస్ బిల్లులతో షాపులకు చేర్చి, కుటుంబంలో ఓటర్ల సంఖ్యను బట్టి ‘చీటీలు’ ఇవ్వడం ద్వారా వాటిని తెచ్చుకొనే ఏర్పాటు చెయ్యడం – వైకాపా క్రిమినల్ బుద్ధులకే అద్దం పట్టింది. ఏదో విధంగా గెలిచి, తెరచాటు రాజకీయ బేరసారాలతో కేసులనుంచి బయటపడటం జగన్‌కు ప్రాణావసరంగా మారిపోవడంతో వైకాపా విశ్వరూపం- జమ్మలమడుగు సహా అనేకచోట్ల కళ్లకు కట్టింది. వైకాపా దౌర్జన్యాల వల్ల పోలింగ్ శాతం ఏమీ ప్రభావితం కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తీర్మానించడం పూర్తిగా అసంబద్ధం. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరిగి ఉంటే, ఓటింగ్ శాతం కొత్త రికార్డులు నెలకొల్పేదన్నది నిర్ద్వంద్వం!

చదవండి :  'శశిశ్రీ'కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

ఎలెక్షన్ జోడ్‌నే కా హై, శిర్ తోడ్‌నే కా నహీ(ఎన్నికలు మనుషుల్ని కలపడానికే గాని, తలలు తీయడానికి కాదు)- అని నిర్వాచన్ సదన్ ఎంత మొత్తుకొన్నా, బాంబుల భాష, వేటకొడవళ్ల సంస్కృతి మాత్రమే తెలిసిన ఫ్యాక్షనిస్టుల చెవికెక్కడం లేదు. జమ్మలమడుగు మండలంలోని ఆరు గ్రామాల్లోకి తెదేపా పాతికేళ్ల తరవాత మొన్న అడుగు పెట్టగలిగిందంటే, కడపలో ప్రజాస్వామ్యం ఎంతగా అడుగంటిందో వేరే చెప్పనక్కరలేదు. 2004-2009 ఎన్నికల్లో కడపలో దాదాపు లక్షన్నర ఓట్లు ముఠా నాయకులే వేసుకొన్నట్లు క్షేత్ర పరిశీలనలో నిగ్గుతేల్చిన నిఘావేదిక- ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్ జరిగిన గ్రామాలు వందల్లో ఉన్నాయని మూడేళ్లనాడే స్పష్టీకరించింది. ఆ పరిస్థితిని మార్చడానికి ఇప్పటికైనా ప్రయత్నించాలన్న మేధావుల సూచనను ఈసీ చెవిన పెట్టకపోవడంతో- కడప నమూనాను రాష్ట్రవ్యాప్తం చేసే దుస్తంత్రం నేడు ఈ స్థాయిలో గజ్జెకట్టింది. వైఎస్ జగన్లు కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం వాళ్ల ఫ్యాక్షనిస్టు దందా, ప్రజాస్వామ్యాన్ని కాలరాచేలా ఏకపక్ష పోలింగ్ పంథా- కడపకే పరిమితమయ్యాయి. తన మనుగడ కోసం ఎప్పుడైతే జగన్ సొంత దుకాణం పెట్టుకొన్నాడో- సీమాంధ్రలోని తక్కిన పన్నెండు జిల్లాల్నీ తాను గుప్పిటపట్టిన కడపలా మార్చేయడానికే కంకణం కట్టుకొన్నాడు. పోలింగ్ వేళ పోలీసుల్నీ కొనేసి తమ దురన్యాయాలకు ఎదురే లేకుండా చూసుకోవడం దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేస్తున్నదే. వైకాపా శ్రేణుల అక్రమాల్ని చిత్రిస్తున్న మీడియాపై ఆ పార్టీ గూండాలు దాడిచేస్తున్నా పోలీసులు మొహం చాటేయడం – రాజ్యవ్యవస్థ ఎంతగా చేవచచ్చిందో స్పష్టీకరించేదే. ఎన్నికల తరుణంలోనే ఇన్ని దారుణాలకు తెగించిన జగన్- రేపు ఒకవేళ నిజంగా గెలిస్తే సీమాంధ్ర భవిష్యత్తు ఏమవుతుందో వూహకందదు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *