
ఆదినారాయణ రెడ్డి చదిపిరాళ్ల – జమ్మలమడుగు
‘నిరూపిస్తే…నన్ను ఉరితీయండి’ : ఎమ్మెల్యే ఆది
జమ్మలమడుగు పురపాలికలో ఓ కౌన్సిలర్ అపహరణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినందున ఛైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను, తమ వారు తెదేపా కౌన్సిలర్‌ను అపహరించినట్లు నిరూపిస్తే.. తనను ఉరితీయాలని సవాల్ విసిరారు.
తనతోపాటు, ఎంపీ, తమ పార్టీ కౌన్సిలర్లకు బయటకు వెళితే రక్షణ ఉండదంటూ పురపాలిక కార్యాలయంలోనే నిరసన తెలుపుతూ ఉండిపోయారు. 144వ సెక్షన్ అమల్లో ఉండగా, తెదేపాకు చెందిన వందల మంది ఎలా వచ్చారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
జమ్మలమడుగు పురపాలికలో 20 వార్డులకుగాను, తెదేపా 11, వైసీపీ 9 గెలుపొందాయి. ఎమ్మెల్యే, కడప ఎంపీ ఓట్లు కలిపితే వైసీపీ ఓట్లు కూడా 11కు చేరాయి. బుధవారం పొద్దుపోయిన తర్వాత నుంచి ఒకటో వార్డుకు చెందిన తెదేపా కౌన్సిలర్ ముల్లా జానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. జానీని వైకాపా నేతలే అపహరించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా జానీ కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు 144 సెక్షన్ అమలులో ఉండగా తమ కౌన్సిలర్‌ను వైకాపా నేతలు అపహరించారంటూ తెదేపా నేత రామసుబ్బారెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైకాపాకు చెందిన 9 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి పురపాలిక కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో బరితెగించిన తెదేపా మద్దతుదార్లు పురపాలిక కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అనంతరం పురపాలక కార్యాలయంలోకి చోచ్చుకేల్లెందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగాలు చేశారు. తర్వాత గాలిలోకి కాల్పులు జరిపారు.
ఎస్పీ అశోక్‌కుమార్, ఏఎస్పీ అప్పలనాయుడు తెదేపా వర్గీయులకు సర్దిచెప్పారు. అనతరం ఎన్నికల అధికారి, ఆర్డీవో రఘునాథరెడ్డి పైస్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి చివరకు ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరో వైపు ఎన్నిక వాయిదా పడ్డాక సాయంత్రం వైకాపాకు చెందిన మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో పురపాలిక కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు జమ్మలమడుగుకు చేరుకుని ఆదికి సంఘీభావం ప్రకటించారు.
50శాతం కోరం ఉంటే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని నిబంధనలు రూఢీ చేస్తున్నాయి. అయితే 22 మంది సభ్యులకు 21మంది హాజరైనప్పటికీ ఎన్నికలు వాయిదా వేసిన ఘనత జమ్మలమడుగులోనే సాధ్యమైందని వైకాపా వారు ఆరోపించారు. ఇంతకీ ఎన్నికల కమీషన్ ఏమి చేస్తున్నట్లు?
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019