అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు.

అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం చుట్టూ పొంచి ఉన్న శత్రురాజులమీద తన ప్రతాపం చూపించి రాయలు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవలసి వచ్చింది. అందుకోసం ముమ్మరంగా యుద్ధాలు చేశాడు. యుద్ధభూమికి రాయలు తనవెంట నందితిమ్మనను, అల్లసాని పెద్దనను, మాదయగారి మల్లననూ తీసుకు వెళ్లినట్లు రాయవాచకం వల్ల తెలుస్తుంది. రాజ్యానికి వచ్చిన తొలినాళ్లలోనే ఆ ముగ్గుర్నీ రాయలు తన ఆస్థానకవులుగా చేర్చుకొని ఉంటాడు. రాయల సాహిత్యాభిమానం అలాంటిది.

కోకట గ్రామాద్యనేకాగ్రహారాల్లో రాయలు కోకటం గ్రామాన్ని మొదట పెద్దనకు సమర్పించాడు. కళింగం మీదికి దండెత్తిన సమయంలో వైశాఖ పూర్ణిమ చంద్రగ్రహణ సమయాన కోకటం గ్రామంలోని కొంతపొలాన్ని కోకటంలోని సకలేశ్వరునికి పెద్దన ధారపోశాడు. ఈ దానశాసనం రాగిరేకులపై చెక్కించాడు. రాయలు క్రీ.శ. 1522లో ఉత్తర భారతదేశంలోని గయవరకు జయించి వచ్చాడు. ఆ తరువాతి కాలంలోనే అల్లసాని పెద్దనను ‘కృతిరచింపు’మని కోరాడు. ఆంధ్రకవితాపితామహ బిరుదం, గండపెండేర స్వీకారం అప్పటికే పెద్దన పొందాడు.

రాయలు పట్టాభిషిక్తుడు కాకమునుపే పెద్దనతో పరిచయం ఉంటుంది. పెద్దనను పెద్దనగానే సంభావించాడు. ఆస్థానకవిగా పెద్దనకు అగ్రస్థానమిచ్చి గౌరవించాడు. క్రీ.శ. 1519లో కటకాది సీమ నాయంకర గౌరవం ఇచ్చాడు. ఆ సంవత్సరం కార్తిక పూర్ణిమ నాడు చంద్రగ్రహణ సమయంలో పెద్దన తన నాయంకరంలోని అన్నూరు గ్రామాన్ని వరదరాజు పెరుమాళ్ల అంగరంగవైభోగాలకు, నిత్యనైవేద్యాలకు దీపారాధనకు దానం చేశాడు (సమగ్రాంధ్ర సాహిత్యం).

ఇంతకూ అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌(కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.

పెద్దన రాయల కొలువు చేరిన తరువాత కోకట గ్రామాదుల్ని పుచ్చుకొన్నాడు. ఆయన పూర్వపు నివాసం ఇది కావచ్చు కాకపోవచ్చు. కాని పెద్దన స్వస్థలానికి సంబంధించి ఆలోచించడానికి అవకాశమిచ్చే ఒక సంగతి మెకంజీ కైఫీయత్తుల్లో కనిపిస్తున్నది. అది యం.ఓ.యల్‌. 344 సంపుటం. 521 నుండి 524 పుటలు. ఇందులో ఒక శాసనం ప్రతి ఉంది. అది చౌడూరు అగ్రహారానికి సంబంధించిన ఒక వృత్తిని కామరసు పెద్దతిమ్మరుసయ్య గారికి ప్రదానం చేస్తున్న శాసనం.

చదవండి :  మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

శాసన కాలం శా.శ. 1431. శుక్ల సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ శుక్రవారం అగ్రహారంలోని వృత్తిని సమర్పిస్తున్నవారు ‘అనంతపురం అనే ప్రతినామముగల చౌడూరి స్థితాశేష విద్వన్మహాజనాలు’. అప్పటికే ఆ గ్రామంలో 42 వృత్తులున్నాయి. అదనంగా ఒక వృత్తిని కల్పించి సమర్పిస్తున్నారు. వృత్తిని స్వీకరిస్తున్న పెద్ద తిమ్మరుసయ్య అరకటవేముల నివాసి. ఈ గ్రామానికి భైరవ సముద్రం అని నామాంతం. భైరవ సముద్రం అన్న పేరుతో ఇక్కడ ఒక చెరువుంది. ఆ చెరువును నిర్మించిన వారు ఈ కామరుసు పెద్దతిమ్మరుసయ్య. ఈ చెరువు కట్టమీదే ఈ శాసనం ఉంది. పెద్ద తిమ్మరుసయ్య గ్రామానికే (అరకట వేముల) చౌడూరి విద్వన్మహాజనాలు వెళ్లి ఆయనకు సమర్పించారు. ఇందుకు దాఖలాగా ఆ శాసనంలో పదముగ్గురు మహాజనాల వ్రాలు (పేర్లు) న్నాయి. ఈ పేర్లన్నీ వృత్తి దానానికి సాక్ష్యంగా నిలిచిన వారివి. అందులో ఎనిమిదోపేరు అల్లసాని నారాయణమ్మ. అంటే అల్లసాని వారి కుటుంబాలీ గ్రామంలో ఉన్నట్లేగదా! మూడవపేరు పెద్దన. పెద్దనకూడ అల్లసాని వాడు అయి ఉండవచ్చు. ఇక చౌడూరు చౌడేశ్వరి పేరుమీద వెలసిన గ్రామమే. నందవరీకుల కులదేవత చౌడేశ్వరి. ఈ గ్రామంలో చౌడమ్మ గుడి ఉంది. ఈ చౌడూరు అరకట వేముల గ్రామాలు ఒకదాని కొకటి పదిపన్నెండు కిలోమీటర్ల దూరంలోనివే. చౌడూరు నుంచి కోకటం, పెద్దనపాడు గ్రామాలు కూడా సమీపంలోనివే. ఈ గ్రామాలన్నీ కడప జిల్లాలోని ప్రముఖ పట్టణం ప్రొద్దుటూరుకు సమీపం లోనివి.

ఇక కామరుసు పెద్దతిమ్మరుసయ్య సామాన్యుడేం కాదు. స్వగ్రామంలోని చెరువు ఆయన తవ్వించిందే. సమీప గ్రామాల్లో ఆయనకు దత్తమైన పొలాలు బహుళంగా ఉన్నట్లు ఈ కైఫీయత్తులోని ఇతర శాసనాలవల్ల తెలుస్తుంది. అంతేకాదు రాజకీయబలం ఉన్నవాడు. కృష్ణరాయల్ని ధిక్కరించి తట్టుకోలేక అడవుల్లో తలదాచుకొన్న పత్తూరు పాలెగాడు ముసలినాయుడు ఈ తిమ్మరుసయ్య నాశ్రయించి రాయలవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పుష్పగిరి – పేర్నపాడు మధ్యగల అరణ్యం జాగీరుగా పొందాడు.

అరకటవేముల శాసనం క్రీ.శ. 1509 నాటి వైశాఖ పూర్ణిమ. అప్పటికింకా రాయలు పట్టాభిషిక్తుడు కాలేదు. ఈ శాసనం సాక్షుల పేర్లలోని పెద్దనను అల్లసాని పెద్దనగా భావిద్దాం. అలాగయితే పెద్దన కేవలం విద్యావంతుడే కాదు. స్వగ్రామంలోని విద్వన్మహాజనాల్లో ఒకరు. కట్టి కుడవడానికే కాక ఇతరులకు పెట్టడానికే కలిగినవాడు. గ్రామంలో పెద్దతనం నెరపుతూ ఉన్నవాడు. ఈ నేపథ్యమే ఆయన తరువాతి జీవితాన్నీ ప్రభావితం చేసింది. అగ్రహారాలు పొందడమే కాదు, కైంకర్యమూ చేశాడు. నాయంకరం పొందిన గౌరవం ఉన్నవాడు. ఖడ్గానికి గంటానికి తగినవాడు కాబట్టి ఆ సామర్థ్యంతో రాయలమరణం తరువాత దండెత్తివస్తున్న గజపతుల్ని పదునైన సీసంతో ఎదిరించాడు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2008

సీ|| రాయరావుతు గండ రాచయేనుగువచ్చి

ఆరట్ల కోట గోరాడు నాడు

సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి

సింహాద్రి జయశిల జేర్చునాడు

సెలగోలు సింహంబు చేరి దిక్కృతి కంచు

తల్పుల కరుల డీ కొల్పునాడు

ఘనతర నిర్భర గండపెండెరమిచ్చి

కూతురాయల కొడ గూర్చునాడు

|| ఒడలెఱుంగవొ చచ్చితొ ఉర్విలేవొ

చేవజాలక తలచెడి జీర్ణమైతొ

కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర

తెఱచినిలు కుక్క సొచ్చిన తెఱగు దోప.

ఈ పద్యం చూచుకొని గజపతి వెనుదిరిగాడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు పెద్దన రాజకీయ ధిషణనూ ప్రదర్శించాడు.

జూపల్లివారు సామంతులు. చెన్నూరు, పోట్లదుర్తి ప్రాంతాలను పాలిస్తున్నారు. చౌడూరు, కోకటం గ్రామాలు పోట్లదుర్తి యిలాఖా లోనివే. తమ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దన పట్ల జూపల్లి వారికి గౌరవాభిమానాలు తప్పకుండా ఉండి ఉంటాయి. జూపల్లి వారికీ అల్లసాని వారికీ ఉన్న పరిచయం క్రీ.శ. 1525 నాటి ఉప్పరపల్లి శాసనం బయలు పరుస్తుంది. ఈ ఉప్పరపల్లి చెన్నూరు యిలాఖా లోనిది. అక్కడి నాగేశ్వర దేవాలయం సమీపంలోని స్తంభం మీద శాసనం ఉంది. జూపల్లి పెదసింగామాత్యుడు ఈ శాసనం వేయించాడు. ఆ శాసనంలోని ప్రారంభ శ్లోకం ఇలా ఉంది.

పాయద్వాగణనాయకః పశుపతే రగ్రే (ంకే) చిరం సంస్థితో

వామార్ధాంగ విరాజితాం గిరిసుతాం జ్ఞాత్వా నిజాం మాతరం

తుండాగ్రం ప్రవిసార్య సస్మితముఖః పీత్వాస్తనం చాపరం

పాతుం ప్రేతమనాస్తనం మృగయతే విఘ్నాంతకస్సర్వదా!

(1. పి.వి. పరబ్రహ్మశాస్త్రి సంపాదకత్వంతో వెలువడిన ఆంధ్రప్రదేశ్‌ శాసనాలు కడప జిల్లా రెండో భాగం.

2. కడప జిల్లా శాసనాలు సంస్కృతి చరిత్ర – డా|| అవధానం ఉమామహేశ్వర శాస్త్రి, పుటలు 11, 13)

ఈ శాసనపాఠం చదువుతూ ఉంటే ఎవరికైనా మనుచరిత్రలోని ఈ పద్యం గుర్తుకు రాకమానదు.

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బా

ల్యాంకవిచేష్ట తుండమున నవ్వలి చన్గబళింపబోయి యా

వంక కుచంబుగాన కహివల్లభ హారముగాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికై.

మనుచరిత్రలో ఈ పద్యం వినాయకస్తుతి మాత్రమే కాదు, కావ్యాంతర్గత కథాసూచన కూడా ధ్వనిస్తుంది. కావ్యంలో పాదం మోపిన పద్యం శాసనంలో చోటుచేసుకొంది. శాసన శ్లోకాలన్నింటినీ పెదసింగామాత్యుని కోరికపై పెద్దన రచించి యిచ్చి ఉంటాడు.

పెద్దన మనుచరిత్రలోని అరుణాస్పదపురం వర్ణన సందర్భాన చెప్పిన ‘అచటపుట్టిన చివురుకొమ్మైన చేవ’ అన్న వాక్యాన్ని బట్టి జనమంచి శేషాద్రిశర్మగారు పెద్దన స్థానికతను గుర్తుచేశారు. కోకటం, కమలాపురం ప్రాంతాల్లో చిగురు చెట్లు పెరుగుతాయి. ఆ చిగురుచెట్టు చిన్నతనం నుంచి చేవదేరి ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సులో చిగురుచెట్లను పెంచుతారు. ఆ చెట్ల అతి సన్నని కొమ్మలైనా మీదైనా బరువైన విదేశీ పక్షులు నివసిస్తాయి. సరస్సులో నీళ్లున్నా చిగురుచెట్టు కాండం దెబ్బతినదు. ఈ చిగురుచెట్లను అక్కడ కడప చెట్లు అని పిలుస్తారు. కడప ప్రాంతం నుంచి దిగుమతి చేసుకొన్నది కాబట్టి ఆ పేరు వచ్చింది. అలాగే పెద్దన ఈ ప్రాంతం వాడే అనడానికి మనుచరిత్ర నుంచి మరొక ఉదాహరణ. ‘మల్లె వట్టిన చేని క్రమంబుగాగ’ అన్నది ఆయన ప్రయోగం (మను చరిత్ర). మల్లె అన్నది ఒక కలుపు మొక్క. అది పెరుగుతూ జొన్న, ఉల్లి వంటి పైర్లను నాశనం చేస్తుంది. ఈ మల్లె మొక్క కమలాపురం, జమ్మలమడుగు, పులివెందులవంటి ఈ ప్రాంతాల్లోని నల్లరేగడి పొలాల్లో పెరుగుతుంది.

చదవండి :  దివిటీల మల్లన్న గురించి రోంత...

ఇక పెద్దనపాడు గురించి. కోకటం సమీపంలో ఈ గ్రామముంది. ఈ గ్రామాన్ని పెద్దన నిర్మించాడని, ఇందులో పెద్దన నివసించాడని ఒక వాడుక ఉంది. తాను కొత్తగా పెద్దన అక్కడొక గ్రామాన్ని నిర్మించి ఉంటే అది పెద్దన ‘పాడు’ అయి ఉండదు. పాడు అన్న పేరు వచ్చిందంటే అక్కడొక గ్రామం ఉండి పాడయి పోయి ఉంటుంది. ఆ స్థానంలో గాని సమీపంలోగాని మరో గ్రామం నెలకొని ఉంటే ఆ గ్రామానికి చివర ‘పాడు’ చేరుతుంది. ఒకప్పటి జైన నివాసం కురుమరి. జైనం అదృశ్యమయింది. అక్కడున్న కురుమరి పాడై దానవులపాడుగా మారిపోయింది. ఇక్కడ కూడా ఏ జైనస్థావరమో ఉండి పాడయి ఉంటుంది. ఆ సమీపంలో మళ్లీ ఊరు వెలసింది. దానిని పెద్దనపాడుగా పిలుస్తున్నారు. పెద్దన మీది గౌరవంతో గాని, ఆయన నేతృత్వంలో గాని కొత్తగా కట్టిన ఊరికి పెద్దనపాడు అని పేరు పెట్టి ఉంటాడు. ఇప్పటికీ పెద్దనపాడు సమీపంలో పురాతన గ్రామ అవశేషాలు కనిపిస్తాయి.

కృష్ణరాయల అస్తమయం తరువాత పెద్దన కోకటం, పెద్దన పాడు లేదా రెండు గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఈ ప్రాంతం నుంచే గజపతులకు ధిక్కారస్వరంతో పద్యం పంపి ఉంటాడు. తన తొలినాటి ఊరైన చౌడూరును వదలి ఉంటాడని అనుకోలేం.

కలిగినవాడు ఎన్ని చోట్లైనా ఇళ్లు కట్టుకోగలడు!

రచయిత గురించి

భాషాపండితుడుగా ఉద్యోగ విరమణ పొందిన విద్వాన్ కట్టా నరసింహులు గారు కడపలోని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర బాధ్యతలు నిర్వహించారు. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం – ప్రకటిస్తున్న మెకంజీ కైఫీయత్తులుకు సంపాదకత్వం వహిస్తున్నారు.ఇప్పటి వరకు వీరు ఆరు సంపుటాలకు సంపాదకత్వం వహించారు. కడప జిల్లా చరిత్ర సాహిత్యాల వికాసానికి కృషిచేస్తున్న వీరు ప్రసుతం కడపలో నివసిస్తున్నారు. ఫోన్ నంబర్: 9441337542

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

అరకట వేముల శాసనం

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: …

2 వ్యాఖ్యలు

  1. brahmananda reddy sagili

    sir……
    mee vyaasam chaalaa baagundi………..allasaani peddana gurinchi chalaa visheshalu telipaaru…kruthagnathalu………..

  2. పెద్దన మూలాల గురించి చక్కని విశ్లేషణ…
    పెద్దనపాడు కాకుండ సౌడూరు పెద్దన ఊరు ఎందుకనేది తెలిసింది.
    కట్టా నరసింహులు గారికి థ్యాంక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: