గురువారం , 21 నవంబర్ 2024
అన్నమయ్య

అన్నమయ్య కథ : ఐదో భాగం

అన్నమయ్య ఆలయ ప్రవేశం:

అన్నమయ్య ఆదివరాహస్వామిని సేవించుకొని వేంకటేశ్వరస్వామి కోవెలకు వెళ్లాడు. పెద్ద గోాపురాన్ని ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ పెద్ద చింతచెట్టు ఉండేది. దానికి మ్రొక్కాడు. కోరిన కోర్కెలు తీర్చే గరుడగంభానికి సాగిలపడ్డాడు . పెద్ద పెద్ద సంపెంగ మానులతో నిండి ఉన్న చంపక ప్రదక్షిణం చుట్టాడు.

విమాన వేంకటేశ్వరుని దర్శించాడు. రామానుజులవారిని సేవించుకున్నాడు. యోగనరసింహస్వామికి నమస్కరించాడు. జనార్దనుని మూర్తికి మ్రొక్కాడు. వంట ఇంటిలో వెలసి ఉన్న అలమేలుమంగమ్మను అర్చించాడు. యాగశాలను దర్శించాడు. కళ్యాణ మంటపాన్ని తిలకించాడు. వరుసగా వాహనమండపంలో ఉన్న అశ్వాన్ని, బంగారు గరుత్మంతుని ఆరాధించి, అందంగా నిలిచి ఉన్న ఆదిశేషునికి మోకరిల్లాడు. గోవా దేశం నుండి తెప్పించిన తట్టుపునుగును బంగారుశకలాలకు గుచ్చి కరగిస్తున్నారు. యాత్రికులు గుంపులుగుంపులుగా “గోవింద, ముకుంద, తిమ్మప్ప” అంటూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

చదవండి :  గడపరాయ చాలదా యింకా (సంకీర్తన) - తాళ్ళపాక పెదతిరుమలాచార్య

బంగారు పంజరాల్లో పంచవన్నెల రామచిలుకలున్నాయి. “వేంకటపతిని సేవించుకోండి; కానుకలు సమర్పించండి; కొండలప్పకు దండాలు పెట్టండి; మీరు కోరుకున్న కోరికలన్నీ సమకూరుతాయి” అంటూ ఆ చిలుకలు పలుకుతున్నాయి.

స్వామి పట్టు పీతాంభారాలున్న శ్రీభండారాన్ని చూశాడు. తన పంచె కొంగున అతి జాగ్రత్తగా దాచుకున్న ఒక కాసు తీసి, బంగారు గాదెలకు (హుండీ) నమస్కరించి, వడ్డీ కాసులవానికి సమర్పించాడు.

దివ్యమంగళ విగ్రహ సందర్శనం

శ్రీనివాసుని హస్తం
శ్రీనివాసుని హస్తం

అన్నమయ్య, స్వామి సన్నిధిలో బంగారు వాకిళ్ళ వద్ద నిలిచాడు. శ్రీనివాసుని దర్శించాడు. అన్నమయ్య శరీరమంతా పులకాంకురాలు చెలరేగాయి. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు. ఒక చేతిలో శంఖం, బొడ్డులో మాణిక్యం,సూర్యకటారి, పాదాలకు అందెలు, పట్టు పీతాంబరం, కటి మీద ఒక చేయి, వరాలను ఇచ్చే వరదహస్తం, చెవులలో నవనవలాడే మణికుండలాలు, కళలను వెదజల్లే ముఖం, ముత్యాల నామం, ధగధగ మెరిసే రత్నకిరీటం, శరీరమంతా పట్టించిన తట్టుపునుగు, కిరీటానికి ఇరువైపులా దిగవేసిన కలువపూదండ, వనమాల, శ్రీవత్సం, కౌస్తుభం, వెలలేని ఆభరణాలు – వేంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని అలానే తిలకించసాగినాడు. అన్నమయ్య హృదయం ఉప్పొంగింది. అతని గొంతు నుండి కెరటాలు కెరటాలుగా భావగీతికలు వెలువడుతున్నాయి:

చదవండి :  ఇటు గరుడని నీ వెక్కినను - అన్నమాచార్య సంకీర్తన

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా,
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

అన్నమయ్య పాటలు విని అర్చకులు ముగ్దులైపోయారు. బాలుని దగ్గరకు తీసుకొని ప్రశంసిస్తూ తీర్థం, ప్రసాదం ఇచ్చి శఠకోపం తలమీద ఉంచారు. అన్నమయ్య ఆ రోజు ఒక మండపంలో విశ్రమించాడు.

కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి

రచయిత గురించి

కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే పట్టా పొందినారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వద్ద శిష్యరికం చేసిన వీరు చాలా కాలం పాటు తితిదేలో పనిచేసినారు. తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టుకు,  శ్రీ వెంకటేశ్వరా దృశ్య శ్రవణ ప్రాజెక్టుకూ డైరెక్టరుగా వ్యవహరించినారు. అన్నమాచార్య సంకీర్తనలకు వ్యాఖ్యానాలు రాసినారు. తాళ్ళపాక కవుల జీవిత చరిత్రను రాసినారు.తితిదే వారి ‘శ్రీనివాస బాలభారతి’ పుస్తకమాలలో భాగంగా ప్రచురించిన ‘అన్నమాచార్యులు’ పుస్తకం కోసం కామిశెట్టి  శ్రీనివాసులు గారు పరిశోధించి రాసిన కథ ఇది.

చదవండి :  కామిశెట్టి శ్రీనివాసులు ఇక లేరు

ఇదీ చదవండి!

అన్నమయ్య

అన్నమయ్య కథ – మూడో భాగం

ఇంటి పని ఎవరు చూస్తారు? నారయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్నచిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: