ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి
పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ….
”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయంతో రైతు బాగా బతకగలడు. ఆ ఆదాయం రైతుకు మేలు చేసేలా ఉండాలని వైఎస్సార్ సంకల్పించారు. అప్పుడే ఆయన రూ. 240 కోట్లను విడుదల చేసి, 236 కోట్లు ఖర్చుపెట్టి ఈ కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లోనే మరో రూ.123 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి విడుదల చేశారు.
ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదు. అయినా ఈ ప్రాజెక్టు ఎందుకీ స్థాయిలో ఉంది? కిరణ్ సర్కారూ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సీఎం వద్దకు దీని గురించి అడగాలని పంపాం. అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కారు కూడా అలాగే ఉన్నాయి.
ఇప్పటికీ మొత్తం డబ్బులు రూ. 247 కోట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా ఎందుకీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది? 6 రీసెర్చి ల్యాబ్స్ కట్టి.. అసలు ఏరకంగానూ ఉపయోగించకుండా వదిలేశారు. 2 బయోసేఫ్టీ ల్యాబ్స్ నిరుపయోగంగా ఉన్నాయి. హాస్టళ్లు, శాస్త్రవేత్తల క్వార్టర్లు అన్నీ ఉన్నాయి. ఆడిటోరియం కూడా సిద్ధంగా ఉంది. అన్నీ ఉన్నా, వాడుకోడానికి ప్రభుత్వం వైపు నుంచి ఆసక్తి కనపడటం లేదు. దాదాపు 7.06 లక్షల చదరపు అడుగుల భవనాలు కట్టి ఉంచారు. వీటిలో మూడు కంపెనీలు కలిపి కేవలం 9 శాతం స్పేస్ను అంటే… 60 వేల అడుగులే వాడుకుంటున్నారు. మిగిలినదంతా నిరుపయోగంగా వదిలేశారన్నమాట.
వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణకు వెళ్లిపోయింది. అలాంటిదాన్ని ఎందుకు మన రాష్ట్రానికి తేవట్లేదు? రైతుల గురించి, పశుసంపద గురించి మనం ఆలోచించేది ఇదేనా? ఇప్పటికీ చంద్రబాబు టేబుల్ మీద రెండు మూడు నెలల నుంచి అమెరికా కంపెనీ ప్రతిపాదన ఫైలు క్లియర్ కాలేదు. మరో కంపెనీ ప్రతిపాదన కూడా అలాగే మూలుగుతోంది.
రాష్ట్రానికి చెందిన నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ మంత్రికి పంపితే, అక్కడి నుంచి సీఎం టేబుల్ మీదకు వెళ్లి 2, 3 నెలలు అయినా పట్టించుకోవట్లేదు. ఈ కేంద్రానికి రెగ్యులర్ సీఈవో దేవుడెరుగు.. రెగ్యులర్ స్వీపర్ కూడా లేడు. ఒకే ఒక్క అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పారేశారు. కరెంటు కూడా తాత్కాలిక కనెక్షనే. బోర్లున్నాయి గానీ, మోటార్లు లేవు. బ్యాంకుల్లో డబ్బులున్నా ఖర్చుపెట్టరు. కంపెనీలు ముందుకొచ్చి, పరిశోధన చేస్తామన్నా.. వారికి అనుమతులు ఇవ్వరు. ఇదీ మన రాష్ట్ర పరిస్థితి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 3 పేజీల లేఖ, 28 ఫొటోలతో నివేదిక పంపారు. అయినా ఇంతవరకు చేసింది సున్నా. చంద్రబాబు కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం కాబట్టి పక్కన పెట్టాలని అనుకోకుండా.. దీన్ని ఉపయోగంలోకి తీసుకురండి. డబ్బులున్నా, వాడేందుకు మీకు మనసు రాదు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, రైతులకు మంచి చేయాలని కోరుతున్నా. ఇది 650 ఎకరాల క్యాంపస్. ఇది ఉపయోగంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుంది.”